నిద్రాయోగ

Nidra Yogaమనసును కుదుటపరచుకోవాలి. ఏ వైపునకూ పరుగెత్త కుండా నిలుపుకోవాలి. మనధ్యాసంతా శ్వాస మీదకు రావాలి. కండ్లు మూసుకోవాలి. చెవులకు ఏ అరుపూ పిలుపూ సోకకూడదు. శరీరం మనసూ అంతా నీ ఆధీనంలో లోపలే ఇమిడి పోవాలి. ధ్యానం చేయాలి. యోగానే నేటి జ్ఞానం. యోగా సాధన చేస్తే ఆందోళనలుండవు. ఎన్ని విపత్తులు, సవాళ్లు ఎదురైనా కండ్లు మూసుకొని పరిష్కరించుకోవచ్చు. అవన్నీ తేలికయినవి, విలువలేనివి వదిలేయాలి. ఇప్పుడు మన నాయకులు చేస్తున్నపని అదే. నిన్న ప్రపంచ యోగా దినాన్ని జరుపుకొన్నాం. శారీరకమైన వ్యాయామం చాలా అవసరమైనదే. ప్రాణాయామమూ ఊపిరిశక్తిని పెంచేసాధనమే ఇవన్నీ చేయవచ్చు.వాటినేమీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ దానిచుట్టూ ఒక తాత్వికజ్ఞానంగా బోధిస్తున్న విషయాలే మూఢత్వంలోకి నెడుతాయి. ఆరోగ్య మంతా యోగాతోనే సాధ్యమనే ప్రచారం అందులో ఒకటి. ఇక ప్రశాంతంగా కూర్చుంటే సవాళ్లు, సమస్యలు పరిష్కారం కావు. బతుకు ప్రశ్నార్థకమయ్యే సమస్య ఎదురైనపుడు మనుషులకు ధ్యానం పరిష్కారమివ్వదు. దాన్ని అధిగమించే ప్రయత్నానికి పూనుకోవాల్సిందే. అనేక విధాల ఆలోచించాల్సిందే. ఇదే మానవ ప్రగతికి దారులు వేసింది.
దేశంలో ముప్పయి లక్షల మంది యువత, తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, న్యాయం చేయాలంటూ రోడ్ల మీదికొచ్చి నినదిస్తుంటే, అడుగుతుంటే, ఒక్క మాటా బదులు చెప్పకుండా, మాట్లాడకుండా నిద్రాయోగ చేస్తారా నాయకుడు! కండ్లు మూసుకుని అన్యాయాలను చూడ నిరాకరించే ఆసనాలు నిజమైన ఆరోగ్య ఆసనాలు కాదు. తప్పించుకు తిరిగే ఆసనాలు మాత్రమే. పరీక్షా పేపర్లు లీకయినా, అవి లక్షల రూపాయలకు అమ్ముడుపోయి, తమ విద్యా భవిష్యత్తు అంధకారమయ మౌతుంటే విద్యార్థులు ప్రశాంతంగా ధ్యానంలో ఆసనాలు వేయాలా? తమ కలల్ని దోచుకుపోతున్న దృశ్యాల్ని చూసీ కండ్లు మూసుకోవాలా? నాయకునికి బాధ్యతలేదా!మన్‌కీ బాత్‌లో ఎన్నో మాటలు పొర్లించే వాక్చతురుడు ఒక్క మాటా ఎందుకు మాట్లాడటం లేదు? మూడోసారి అధికారంలోకి వచ్చి మాసమూ దాటలేదు. ప్రజా సమస్యలపై ఎందుకీ అశ్రద్ధ. ఎందుకీ నిర్లక్ష్యం! ప్రధాని మోడీ నిదానంగా ఆసనాలు వేస్తారు. యోగా ప్రాధాన్యాన్నీ వివరిస్తారు. కానీ, ఈ దేశ భవిష్యత్‌ తరాల సమస్య ప్రాధాన్యాన్ని పట్టించుకోరా? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.
నీట్‌ పరీక్షా పత్రం లీకైన విషయం నిర్ధారణ అయింది. బీహార్‌లో అరెస్టయిన విద్యార్థులే చెబుతున్నారు. ఇంకో వైపు యు.జి.సి. నెట్‌ ప్రశ్నాపత్రం లీకైందని హోం మంత్రిత్వశాఖ పరిధిలోని సైబర్‌క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటరే తేల్చేసింది. లక్షల రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముడు పోయాయన్నదీ రుజువవుతున్నది. ఇన్ని లక్షల మంది విద్యార్థులూ, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే వైఫల్యానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఎన్‌టీఏపై నేరాన్ని తోసి, తాను తప్పు కోవాలని ప్రయత్నిస్తుండటం క్షమించకూడనిది. గడిచిన ఏడేండ్లలో 70 పరీక్షా పేపర్లు లీకయ్యాయి. రెండు కోట్ల మంది యువత, ఆ లీకుల వల్ల నష్టపోయారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లోనే 2015-2023 మధ్య ఈ లీకులకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి. యూపీలోనూ జరిగాయి. ఇపుడు ఎన్డీయే ప్రభుత్వం ఉన్న బీహార్‌లోనే నీట్‌ వ్యవహారం బయటకొచ్చింది.
మోడీ హయాంలో పరీక్షలు అభాసుపాలవుతున్నాయి. ఇది నేడొక జాతీయ సమస్యగా మారింది. విద్యాసంబంధ పరీక్షలను కేంద్రీకృతం చేసుకుని, రాష్ట్రాల హక్కులను హరించిన ఫలితమే ఈ పర్యవసానాలు. విద్యారంగాన్ని వ్యాపారమయం చేసే ప్రయివేటీకరణే ఈ అనర్థాలకు మూలకారణం. కాషాయీకరణ, ప్రయివేటీకరణ కోసం కేంద్రం తహతహ లాడుతున్నది. పరీక్షలను సైతం నిఖార్సుగా నిర్వహించలేని ప్రభుత్వం ఇంకా అభివృద్ధిని ఎలా సాధించగలదు! ఇప్పటికైనా ప్రధాని పరీక్షపై చర్చ చేయాలి. ఈ లీకులకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేసి, విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్రీకృత పరీక్షల విధానాన్ని ఉపసంహ రించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవి. మూడోసారి అధికారం, అమ్మకాలూ, అక్రమాలతో ఆరంభమైంది. ఈ వ్యవహారంపై ఎన్డీయే పక్షాలూ నోరువిప్పాలి. బాధ్యత వహించాలి. తెలంగాణలో కొత్తగా కేంద్ర మంత్రులయినవాళ్లూ, బీజేపీ ఎంపీలు కనీసం ఒక్కమాటా మాట్లాడటం లేదు. ఇదేమీ ప్రజల సమస్య కాదా? ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రతిఘ టించకపోతే భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది. నిద్రాయోగాలిక చెల్లవని చెప్పి కండ్లు తెరిపించాలి.

Spread the love