నో కామెంట్‌…

– ప్రధాని ప్రసంగంపై ఈసీ సమాధానం ఇదే
– కమిషన్‌ స్వతంత్రతపై కమ్ముకుంటున్న నీలినీడలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌ పర్యటనలో తన వాక్చాతుర్యాన్ని మరోసారి ప్రదర్శించారు. మతాల మధ్య మరోసారి విద్వేషాలను పెంచేందుకు ప్రయత్నించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ కనబరచిన వ్యవహార శైలిని ఇప్పుడు రాజకీయ పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. మత విద్వేషాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మోడీ పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్షాలు తరచుగా ఆరోపిస్తుంటాయి. రాజస్థాన్‌లో చేసిన ప్రసంగం మళ్లీ ఆ ఆరోపణలను గుర్తుకు తెస్తోంది. మోడీ ప్రసంగంపై ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ మాత్రం మౌనాన్ని వీడడం లేదు.
మోడీ ప్రసంగంపై మాట్లాడాల్సిందిగా సోమవారం ఉదయం నుండి పలువురు మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినప్పటికీ ఎన్నికల కమిషన్‌ ప్రతినిధి నుండి ఒకే ఒక సమాధానం వస్తోంది. అదేమిటంటే ‘వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నాము’. ఎన్నికల కమిషన్‌ ఇంతకుముందు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు నోటీసు ఇచ్చింది. ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ‘హిందూ’, ‘జై భవాని’ పదాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. అయితే అందుకు ఉద్ధవ్‌ నిరాకరించారు. ముందుగా మోడీకి నోటీసు పంపాలని ఈసీకి సలహా ఇచ్చారు.
అన్నీ ఉల్లంఘనలే
పౌర సమాజ సంస్థలు, ఏడీఆర్‌ ఎన్నికల పరిశీలకుడు జగదీప్‌ చక్రవరి ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఓ ఫిర్యాదు పంపారు. మోడీ ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 (3), (3ఏ), 125 సెక్షన్లకు కూడా విరుద్ధంగా ఉన్నదని ఆయన అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 153-ఏను కూడా ఇది ఉల్లంఘిస్తోందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పటికే దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన ఈసీ, ఏవైనా చర్యలు తీసుకుంటుం దా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. సాక్షాత్తూ ప్రధానమంత్రే హిందూ ఓట్లను దండుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే వాటిని విస్మరిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తన స్వతంత్రతపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. తద్వారా ప్రజల దృష్టిలో దానిపై కొంత నమ్మకం ఏర్పడుతుంది.

Spread the love