క్యాండిడేట్స్‌ కింగ్‌ మన గుకేష్‌

Candidates are king Our Gukesh– ఫిడె క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా అవతరణ
– ప్రపంచ కిరీటం వేటలో డింగ్‌ లిరెన్‌తో ఢ
– చాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు
‘ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాలనేది నా స్వప్నం’.. 12 ఏండ్ల ప్రాయంలోనే గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన డి. గుకేశ్‌ 2019లో నమ్మకంగా చెప్పిన మాట ఇది. గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచిన గుకేశ్‌.. ఐదేండ్లలో ప్రపంచ కిరీటం దిశగా అడుగులు వేశాడు. 2024 ఫిడె క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌గా అవతరించిన డి. గుకేశ్‌.. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ వేటలో చైనా దిగ్గజం డింగ్‌ లిరెన్‌తో పోటీపడనున్నాడు.
టోరంటో (యుఎస్‌ఏ)
17 ఏండ్ల దొమ్మరాజు గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. 2024 ఫిడె క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ విజేతగా అవతరించాడు. ప్రపంచ మేటీ ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడిన మెగా టోర్నీలో 14 రౌండ్ల పోటీల అనంతరం భారత చదరంగ రారాజు డి. గుకేశ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2014లో చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత క్యాండిడేట్స్‌ విజేతగా నిలిచిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన 14 రౌండ్‌ పోటీల్లో ఆరు గంటల హోరాహోరీ ఎత్తులకు తెరదించుతూ గుకేశ్‌ విజయబావుటా ఎగురవేశాడు. వరల్డ్‌ నం.3 హికారు నకముర (యుఎస్‌ఏ)తో మ్యాచ్‌ను గుకేశ్‌ డ్రా చేసుకోగా.. ఇదే సమయంలో వరల్డ్‌ నం.2 ఫాబియానో (యుఎస్‌ఏ), వరల్డ్‌ నం.4 ఐయాన్‌ నెపొమ్నియాచి (రష్యా) మ్యాచ్‌ సైతం డ్రాగా ముగిసింది. దీంతో గుకేశ్‌ 9.0 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన విజేతగా అవతరించగా.. నెపొమ్నియాచి, ఫాబియానోలు 8.5 పాయింట్లతో తర్వాతి స్థానాలకు పరిమితం అయ్యారు. ఆఖరు రౌండ్లో అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)పై విజయం సాధించిన ఆర్‌. ప్రజ్ఞానంద 7.0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా.. విదిత్‌ గుజరాతీ 6.0 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
అదిరే ఎత్తులతో.. : ఫిడె క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ ఆఖరు రౌండ్‌ అత్యంత ఉత్కంఠకు దారితీసింది. ఆరు గంటల పాటు సాగిన సస్పెన్స్‌కు గుకేశ్‌ విజయంతో తెరదించాడు. చాలెంజర్‌ బెర్త్‌ కోసం గుకేశ్‌తో ఫాబియానో, నెపొమ్నియాచి గట్టిగా పోటీపడ్డారు. ఈ ఇద్దరు ముఖాముఖి తలపడిన మ్యాచ్‌లో ఎవరు విజయం సాధించినా.. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతను తేల్చేందుకు టైబ్రేకర్స్‌కు వెళ్లాల్సి వచ్చేది. 109 ఎత్తుల పాటు సాగిన మ్యాచ్‌లో 41వ ఎత్తులో ఫాబియానో వ్యూహాత్మక తప్పిదంతో నెపొమ్నియాచి పట్టు బిగించాడు. ఆఖర్లో ఫాబినాయో మళ్లీ నియంత్రణ సాధించినా.. సమయాభావంతో వేగంగా పావులు కదపాల్సి వచ్చింది. దీంతో నెపొమ్నియాచి అలవోకగా ఓటమి కోరల్లోంచి బయటపడ్డాడు. ఇద్దరూ 109 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించారు. అప్పటికే 71 ఎత్తుల్లో హికారు నకమురతో మ్యాచ్‌ను గుకేశ్‌ డ్రా చేసుకున్నాడు. క్వీన్స్‌ గ్యాంబిట్‌ డిక్లైన్డ్‌లో పోటీపడిన గుకేశ్‌, హికారులు ఆఖరుకు బోర్డుపై రాజులు మాత్రమే మిగలటంతో డ్రాకు అంగీకరించారు. ఇక నామమాత్రపు మ్యాచ్‌లో ఆర్‌. ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో అబసోవ్‌పై విజయం సాధించాడు. విదిత్‌ గుజరాతీ 14 ఎత్తుల్లో అలిరెజాతో డ్రా చేసుకున్నాడు.
రూ. 1 కోటి ప్రైజ్‌మనీ : 17 ఏండ్ల ప్రాయంలోనే క్లాసికల్‌ చెస్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ వేటలో నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌.. ఫిడె క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజేతగా నిలిచి భారీ నగదు బహుమతి సైతం దక్కించుకున్నాడు. ఎనిమిది మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో పోటీపడిన టోర్నీలో.. గుకేశ్‌ విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ నిబంధనల ప్రకారం ప్రతి 0.5 పాయింట్లకు రూ.3.10 లక్షల నగదు బహుమతి దక్కుతుంది. విన్నర్‌ టైటిల్‌, 9.0 పాయింట్లతో కలుపుకుని గుకేశ్‌ రూ. 1 కోటి ప్రైజ్‌మనీ ఖాతాలో వేసుకున్నాడు. ఆర్‌. ప్రజ్ఞానంద రూ.21 లక్షలు, విదిత్‌ గుజరాతీ రూ.18.5 లక్షలు నగదు బహుమతి రూపంలో దక్కించుకున్నారు.
వరల్డ్‌ నం.6 : క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ చూపిన గుకేశ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎగబాగాడు. 14 రౌండ్ల పాటు జరిగిన క్యాండిడేట్స్‌ టోర్నీలో గుకేశ్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లో ప్రత్యర్థికి తలొగ్గాడు. ఏడో రౌండ్లో అలిరెజాతో మ్యాచ్‌ను గుకేశ్‌ కోల్పోయాడు. కానీ ఆ పరాజయమే గుకేశ్‌ను విజయం దిశగా నడిపించిందని అతడు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. ‘ఆ ఓటమితో నిరాశకు లోనయ్యాను. కానీ విరామం రోజు బాగానే ఉన్నాను. బాధాకరమైన ఓటమి చవిచూసినా.. నా ఉత్తమ ఆటతీరు కనబరిచాననే అనిపించింది. ఆ ఓటమి నాలో ప్రేరణ కలిగించింది. విజయం దిశగా అడుగులు వేసేందుకు దోహదం చేసింది’ అని గుకేశ్‌ తెలిపాడు. ఫిడె రేటింగ్స్‌లో 2763 పాయింట్లు సాధించిన గుకేశ్‌.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ భారత గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.
రన్నరప్స్‌గా హంపీ, వైశాలి :
ఫిడె మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ టాన్‌ విజేతగా నిలిచింది. తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యంలో కొనసాగిన టాన్‌.. 14 రౌండ్ల అనంతరం అగ్రస్థానం నిలుపుకుని చాంపియన్‌గా అవతరించింది. 9.0 పాయింట్లతో టాన్‌.. చాలెంజర్‌ బెర్త్‌ సాధించగా.. భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపీ, ఆర్‌. వైశాలి రన్నరప్‌గా నిలిచారు. వైశాలి వరుసగా ఐదు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసింది. ఆఖరు రౌండ్లోనూ లాగ్నోపై 45 ఎత్తుల్లో గెలుపొందింది. కోనేరు హంపీ సైతం 62 ఎత్తుల్లో లీపై పైచేయి సాధించింది. 7.5 పాయింట్లతో నిలిచిన కోనేరు హంపీ, వైశాలిలు.. లీ తో కలిసి ఉమ్మడి రన్నరప్‌గా నిలిచారు.

Spread the love