ఇండియా గేటుకు నో ఎంట్రీ

– సందర్శకుల నిషేధం…భారీగా పోలీసుల మోహరింపు
– రెజ్లర్ల ఆందోళనపై సమాధానం చెప్పకుండా పరుగులు తీసిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి
న్యూఢిల్లీ : దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు ఇండియా గేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే, ఢిల్లీ పోలీసులు బుధవారం ఇండియా గేట్‌ను చుట్టుముట్టారు. ఇండియా గేటు చుట్టు ఉన్న గార్డెన్‌ (పచ్చిక బయళ్లు)లోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధించారు. ఇండియా గేట్‌ లాన్‌లకు వెళ్లే అండర్‌పాస్‌ పాదచారులను సైతం వెళ్లనివ్వటంలేదు. ప్రజలు పచ్చిక బయళ్లకు రాకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసులను కూడా మోహరించారు. బారికేడ్లకు నో ఎంట్రీ (ప్రవేశం లేదు) బోర్డులను అతికించారు. ‘ఇటీవల కురిసిన వర్షాలకు గడ్డి దెబ్బతింది. గడ్డి పెరగటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఓ అధికారి చెప్పారు. ‘రెజ్లర్లు ఇక్కడ ఆందోళనకు దిగకుండా ఉండేందుకే’ నని ఆ అధికారి చివరకు చెప్పారు.
బ్రిజ్‌ భూషణ్‌ పై ఆధారాలు లేవని మీడియా వార్తల్లో నిజం లేదు: ఢిల్లీ పోలీసులు
బ్రిజ్‌ భూషణ్‌ పై ఆధారాలు లేవని మీడియా వచ్చిన వార్తల్లో నిజం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సరైన ఆధారాలు దొరకలేదని కొన్ని టీవీ చానళ్లు చెప్తున్నాయనీ, అందులో వాస్తవం లేదని తెలిపారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. తుది నివేదికను కోర్టుకు సమర్పిస్తామన్నారు.
2న డీసీడబ్ల్యూ ముందు హాజరుకండి
ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) ముందు హాజరుకావాలని న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ) ప్రణవ్‌ తాయల్‌కి డీసీడబ్ల్యూ చైర్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ సమన్లు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌కు మైనర్‌ గుర్తింపును వెల్లడించే చర్యతో ఏమైనా సంబంధం ఉందా లేదా? అనే విచారణ కాపీతో జూన్‌ 2న కమిషన్‌ ముందు హాజరు కావాలని కోరారు. ”ఈ కేసులో నిందితుడు (సింగ్‌) అత్యంత ప్రభావశీలుడు. ఇప్పటి వరకు అరెస్టు చేయబడలేదు. కేసు సున్నితత్వం, ప్రాణాలతో బయటపడిన వారికి, ముఖ్యంగా మైనర్‌కు ప్రత్యక్ష ముప్పును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వారికి భద్రత కల్పించాలి. అటువంటి సందర్భంలో, ప్రాణాలతో బయటపడిన మైనర్‌ గుర్తింపును బహిర్గతం చేసే చర్యను తీవ్రంగా పరిగణించాలి’ అని సమన్లలో పేర్కొన్నారు.
నేడు ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్‌ : నరేష్‌ టికాయిత్‌
రెజ్లర్లకు మద్దతుగా నేడు (గురువారం) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో మహా పంచాయత్‌ నిర్వహించనున్నట్టు రైతు నేత నరేష్‌ టికాయిత్‌ ప్రకటించారు. సుప్రీం కోర్టులో రెజ్లర్ల తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పోక్సో కేసులో ఇతరులను అయితే వెంటనే అరెస్టు చేస్తారని, కాని బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను మాత్రం అరెస్టు చేయరని విమర్శించారు.
రెజ్లర్ల ఆందోళనపై మీడియా ప్రశ్న, కేంద్రమంత్రి పరుగులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రోజురోజుకీ ఉధృతంగా మారుతున్నది. ఈ క్రమంలోనే రెజ్లర్ల నిరసన గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖిని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ఆమె పరుగులు పెట్టారు.
కేంద్రంలో బీజేపీ తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని విలేకరులు చుట్టుముట్టారు. ”రెజ్లర్ల ఆందోళనపై మీ స్పందన ఏంటి?” అని ఆమెను ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మీనాక్షి లేఖి వెళ్తుండగా.. విలేకరులు కూడా ఆమెను అనుసరించారు. అదే ప్రశ్నను మళ్లీ అడగ్గా.. ”న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది” అని చెబుతూ ఆమె పరిగెత్తారు. కేంద్రమంత్రి ‘చలో.. చలో.. చలో’ అంటూ తన కారు వద్దకు పరిగెట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
విచారణ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి: కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్ల ఆందోళనలపై కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పోలీసులు తమ విచారణ పూర్తి చేసేంత వరకూ రెజర్లు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. రెజ్లర్లు తీసుకునే చర్య వల్ల క్రీడలు, రెజ్లర్లు కావాలనకునే వారి ఆకాంక్షలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. క్రీడలు, క్రీడాకారులకు తాము సానుకూలమని చెప్పారు.

Spread the love