మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమనీ, ప్రజాస్వామ్యానికి ఇదే తల్లి వంటిదని తాజాగా జీ-20 సదస్సులో మోడీ ఢంకా బజాయించి చెప్పారు. రుజువు చేసుకునే అవకాశం రానూ వచ్చింది. పోనూ పోతోంది. రాజులు, రాచరికాలు పోయిన తర్వాత ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరపడం, పార్టీలను ఎన్నుకోవడం రివాజు. ఇదంతా హుళక్కి అని తేలిన తర్వాత మన దేశాన్ని ప్రజాస్వామ్యం అనగలమా?
”గతంలో బూత్‌లు స్వాధీనం చేసుకుని ఓట్లు గుద్దుకునేవారు. ఇప్పుడు ఎన్నికల కమీషన్‌నే తన అధీనంలోకి తెచ్చుకున్న మోడీ సర్కార్‌కు ఇక ఎదురేముంది?” అని ఒక పెద్దాయన చమత్కరించారు. నిలోత్పల్ బసు అన్నట్టు ఎన్నికలస్వామ్యమే ప్రజాస్వామ్యంగా పరిగణించబడ్తోంది. దానికి ప్రధాన రిఫరీ ఎన్నికల కమిషన్! అధికారం వైపుకి ఈసీ వంగిపోతే?! ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా మూడ్రోజుల ముందు ఇద్దరు కమిషనర్లు నియమింపబడ్డారు. ఎన్నికల్లో ఏమి చెయ్యొచ్చో, ఏమి చేయకూడదో బరిగీసి చెప్పింది ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్. దాన్నే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు (ఎమ్‌సిసి) అన్నారు. ‘మో-షా’లు దాన్ని పచ్చిగా అతిక్రమిస్తున్నా ఈసీ చప్పుడు చేయదు. కేంద్రం చేతిలోని నిఘా వ్యవస్థలు ఇండియా కూటమి పార్టీలపై ఉక్కుపాదం మోపుతుంటే కిమ్మనదు. ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ జైల్లో పెట్టినా, ఏఐసీసీ అకౌంట్‌ను ఐటీ శాఖ స్తంభింపచేసినా, కేరళ త్రిస్సూర్‌లోని సీపీఐ(ఎం) అకౌంట్‌ను స్తంభింపచేసినా, ఇవన్నీ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకొచ్చిన తర్వాత జరిపినా ఈసీకి ఏమీ పట్టదు.
రెండవ దశ పోలింగ్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టి తాజాగా ఏడవ దశ ముందు వరకు మోడీ ముస్లింలపై విద్వేషం వెళ్ళగక్కుతున్నా ఈసీకి ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ అనే బాల మురళీ కృష్ణ పాటే దిక్కయింది. వరుసగా మొదటి, రెండో దశ పోలింగు ముగిసిన పదకొండు రోజులకు, నాలుగు రోజులకు ఓటింగ్ శాతం వివరాలు ఈసీ తన వెబ్ సైట్‌లో ఉంచింది. అది దుర్మార్గమని ఈ ఆధునిక యుగంలో 48 గంటల్లో పెట్టలేకపోవడమేమిటని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్ సంస్థలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాయి.
అసలు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్ని ఓట్లు పోలైనాయో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17 సీని ప్రతి పార్టీ ఏజెంటుకీ ఇస్తారు. దాన్ని స్కాన్ చేసి ఈసీ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి అన్నేసి రోజులు పట్టడమేంటని రిట్ పిటిషన్‌లో ఆ రెండు స్వచ్ఛంద సంస్థలూ వాదించాయి. ఆశ్చర్యకరంగా ఈసీని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు చేతులెత్తేసింది. ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలకంటే 5-6శాతం పెరిగినట్టు ఆ తర్వాత ఈసీ ప్రకటించడం ఒక ఆందోళనకర అంశం.
ఇవన్నీ ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతనే ప్రశ్నించేవి. ప్రజాస్వామ్యానికే తల్లి అని చెప్పుకోవాలంటే రేపు (జూన్ 1న) జరగబోయే ఏడవ దశ పోలింగ్ 57 సీట్లుగాని, జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియగాని సజావుగా జరగడం అవసరం. అసలీ ఏడు దశల పోలింగ్ మోడీ క్యాంపెయిన్‌కు వీలుగా ఏర్పాటైనట్టు అనేకమంది విజ్ఞులు చెప్తున్నారు. ఈసీ యొక్క ‘విశ్వసనీయతను దెబ్బతీస్తున్నా య’ని కొన్ని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం ఆరోపిస్తున్నది. కాని ఒక కీలక విషయం గమనార్హం. ఆర్టికల్ 324 ప్రకారం అలానే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు ప్రకారం ఎన్నికలను సరిగా నిర్వహించేలా చూడటం ఎలక్షన్ కమిషన్‌దే కీలక బాధ్యత. విశ్వసనీయత రుజువు చేసుకోవాల్సింది కూడా ఈసీనే.
మరో కీలకాంశం – ఉత్తరప్రదేశ్‌లో స్థానిక పోలీసులు అనేకమందికి, ముఖ్యంగా ముస్లింలకు.. వాళ్ళు ఎన్నికలకూ భంగం కలిగిస్తారనే ‘రెడ్ కార్డ్’లు ఇచ్చారు. ఈ విషయం ఈసీకి తెలియదు. అసలు ఆ రెడ్ కార్డులకు సరైన రుజువులు కూడా లేవు. ఇండియా కూటమి నాయకులు అనేక వివరాలు ఈసీ ముందు పెడ్తే, ఆ విషయం తమకి తెలియదని అంగీకరించి చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. పైన లేవనెత్తిన అనేక విషయాల్లో ఈసీ తన పవిత్రతను రుజువు చేసుకోవాల్సిన అవసరముంది. అదే దానికి లిట్మస్ టెస్ట్.