నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ప్రభుత్వం జనగణ చేపట్టాలని నిర్ణయం ఇప్పట్లో జరిగేనో లేదో తెలియదు కానీ అంతకుముందే కుక్కల గణన చేయాలని భావిస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా వీధి కుక్కల బెడద, కుక్క కాటు నియంత్రణ, సంతాన ఉత్పత్తి నియంత్రణ, కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీల ద్వారా కుక్కల గణన చేపడుతున్నట్లు తెలుస్తోంది. మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో 15 వార్డులు ఉన్నాయి. వాడవాడలో వీధి కుక్కల సంఖ్య లెక్కలేనన్ని ఉన్నాయి. మరోవైపు ఇంటి పెంపుడు కుక్కలు కూడా లేకపోలేదు. కుక్కల గణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది.
ఈ సర్వే కార్యదర్శులకు అదనపు పనిభారం కానుందని పలువురు మాట్లాడుకుంటున్నారు. వీరు కుక్కల గణన చేసి, పంచాయతీ రాజ్ వెబ్సైట్ లోని జిపి లాగిన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిని అత్యవసరంగా భావించి తప్పనిసరిగా వివరాలు పొందుపరచాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వీధికుక్కల బారిన పడి ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా మేకలు, గొర్రెలు కూడా శునకాల బారిన పడి మృత్యువాత పడ్డాయి. ఒక్క మండల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ర్టవ్యాప్తంగా గ్రామ సింహాల ప్రభావం ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ కుక్కల గణనతో పాటు వాటిని నియంత్రణ చర్యలు కూడా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



