ఏఎన్ఎం ల నోటిఫికేషన్ రద్దు చేయాలి

– ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి
– ప్రభుత్వం పట్టింపులకు పోవొద్దు
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
ఏఎన్ఎంలో నోటిఫికేషన్ రద్దు చేయాలని ప్రభుత్వం పట్టింపులకు పోవద్దని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్ వద్ద ఏఎన్ఎంలు సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని వీడడం లేదన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం అందర్నీ డైరెక్ట్ గా రెగ్యులర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకుండా మొండిగా రాత పరీక్ష ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తామని అంటున్నదన్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో 1520 పోస్టులు ప్రకటించి యూనియన్లతో చర్చల అనంతరం 400 పైచిలుకు పోస్టులు పెంచిందన్నారు. గతంలో లేని పోస్టులు చర్చల అనంతరం ఎలా పెరిగాయని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జనాభా ప్రాతిపదికన, సబ్ సెంటర్ ప్రాతిపదికన కనుక లెక్కలు తీస్తే ఏఎన్ఎం పోస్టులు పెరగడానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా రాత పరీక్ష ద్వారానే పోస్టుల్ని నింపుతామని కూర్చోవడం మూలంగా రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు నష్టపోతారని అన్నారు. రాత పరీక్ష అంటే కొత్తగా వచ్చిన విద్యార్థులతో వీరి పోటీ పడడమే, దీనివల్ల వీరికి నష్టం జరుగుతుంది. ఇదే వైద్య ఆరోగ్యశాఖలో గతంలో పారామెడికల్ సిబ్బందిని మరియు మెడికల్ ఆఫీసర్లను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేసినప్పటికీ ఏఎన్ఎంల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి ఎందుకు అవలంబిస్తున్నది అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉండకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎం అందరిని రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతంగా ముందుకు వెళుతుందని, ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు గంగా జమున , కవిత, సరోజా సావిత్రి, రాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love