– జూనియర్ స్పందించకపోతే పట్టించుకోను : బాలకృష్ణ వ్యాఖ్యలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో భేటి అయ్యారు. ఇందులో టీడీపీ అధ్యక్షలు కాసాని జ్ఞానేశ్వర్ తదితర నేతలు సైతం పాల్గొన్నారు. ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై సినిమావాళ్లు స్పందించకపోవడాన్ని పట్టించుకోబోనని అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయనీ, ఈ సమయంలో ఏపీలో జరిగిన పరిణమాలు, చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందన్నారు. బాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందేనని అన్నారు. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్దపు కేసులు పెట్టారని వివరించారు. రిమాండ్‌లోకి తీసుకున్నాక సెక్షన్‌లు చెబుతున్నారని చెప్పారు. ప్రతిఒక్కరూ బాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందనీ, ఇప్పుడు మళ్లీ చైతన్యం వస్తున్నదని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధికోసం కాకుండా తెలుగువారి గౌరవం కోసం పనిచేద్దామని అన్నారు. కేసులు, అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వివరించారు. తెలంగాణలో అంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని వివరించారు. పార్టీ పునర్వైభవానికి ప్రతిక్షణం పోరాడతామనీ, పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని వివరించారు. తెలంగాణలో టీడీపీ లేదు అన్న వారికి మేమేంటో చూపిస్తామని అన్నారు. ఏపీలో ఒక సైకో పరిపాలన నడుస్తున్నదన్నారు. ప్రజాసంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బందిపెట్టే రాజకీయం అక్కడ జరుగుతున్నదన్నారు. 17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారనేదే మా ప్రశ్న అని అన్నారు. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో, లేదో అవగాహన లేదన్నారు. అనవసరంగా ఎవరిపైనా నిందలు వేయమని చెప్పారు.
జేపీ అధ్యక్షురాలిగా మా అక్క పురందేశ్వరి ఉన్నారనీ, ఆమెతో టచ్‌లో ఉన్నామని వివరించారు. సినిమా వాళ్లు స్పందించకపోవడంపై నేను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్, రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని అన్నారు. బురద మీద రాయి వేస్తే మనమీదే పడుతుందని అభిప్రాయపడ్డారు.