– అడ్డుకున్న గ్రామస్తులను దూషించిన అటవీ అధికారి
– బాధితుల ఫిర్యాదు, కేసు నమోదు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇద్దరు వ్యక్తులను దూషిస్తూ బెదిరించిన విషయంలో అటవీ అధికారిపై బుధవారం కేసు నమోదు చేసినట్టు ములుగు జిల్లా పస్రా ఎస్‌ఐ ఎస్‌కే మస్తాన్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. చల్వాయి గ్రామంలో వక్ఫ్ బోర్డ్‌కు చెందిన 4 ఎకరాల భూమిలో ఫారెస్ట్ అధికారి తేజవత్ దిప్‌లాల్ అక్రమంగా నర్సరీ మొక్కలు దించారు. అదే గ్రామానికి చెందిన జహరుద్దీన్, షఫీలమ్ గమనించి అడ్డుకోగా దీప్‌లాల్ వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరించారు. దాంతో బాధితులు పస్రా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి అధికారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.