రాములక్కకు నో ఛాన్స్‌

రాములక్కకు నో ఛాన్స్‌– ప్రచారకర్తల బృందంలో దక్కని చోటు
– పార్టీ మారుతారనే భయంతోనేనా?
– 40 మందితో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో ప్రచారకర్తల బృందంలో సినీనటి, పోరాట కమిటీ చైర్మెన్‌ విజయశాంతికి బీజేపీ జాతీయ నాయకత్వం మొండి చేయి చూపింది. ఇప్పుడు ఆ పార్టీలో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఎన్నికల నేపథ్యంలో పోరాటాల కమిటీ చైర్మెన్‌గా బీజేపీ నియమించింది. కానీ, ఆమె ఆ పనిని చేయట్లేదు. పైగా, తనకు మొక్కుబడిగా ఆ పదవి ఇచ్చారనే అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్రంలో జరిగిన ప్రధాని మోడీ, అమిత్‌షా సభల్లో, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొనలేదు. పైగా, పార్టీకి నష్టం చేకూరేలా వరుసగా సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతూ చర్చనీయాంశం అవుతున్నది. పార్టీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమె త్వరలో హస్తం పార్టీ గూటిలో చేరబోతున్నారనే పక్కా సమాచారంతోనే ఛాన్స్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. దీనిని బట్టే ఆమె త్వరలో పార్టీ మారబోతున్నారనే ఊహాగాహనాలకు మరింత బలం చేకూరి నట్లయింది. మొత్తం 40 మందితో స్టార్‌ క్యాంపెయినర్ల బృందాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ప్రచార కమిటీలో ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీ, బీఎస్‌.యడ్యూరప్ప, కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, స్మృతిఇరానీ, పీయూష్‌గోయల్‌, పర్శోత్తమ్‌ రూపాలా, అర్జున్‌ ముండా, భూపేంద్రయాదవ్‌, జి.కిషన్‌రెడ్డి, సాద్వి నిరంజన్‌ జ్యోతి, ఎల్‌.మురుగన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, తరుణ్‌చుగ్‌, సునిల్‌ బన్సాల్‌, బండి సంజరు కుమార్‌, అర్వింద్‌ మీనన్‌, డీకే అరుణ, పి.మురళీ ధర్‌రావు, డి.పురందేశ్వరి, రవి కిషన్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీ.జితేందర్‌రెడ్డి, గరికెపాటి మోహన్‌రావు, డి.అర్వింద్‌, సోయం బాపూరావు, రాజాసింగ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌, టి.కృష్ణప్రసాద్‌ ఉన్నారు.

Spread the love