Poetry is a criticism of life” Matthew Arnald.
తెలుగు సాహిత్య చరిత్రలో కావ్య విమర్శకు ఒక సుదీర్ఘ ప్రస్థానం ఉంది. కేవలం కావ్యంలోని గుణదోషాలను చర్చించడమే విమర్శ కాదు. కవి యొక్క హృదయ మథనంతో పాటూ కవి వాడిన వస్తువులు, నిర్మాణ పనిముట్లు, రచనాకౌశలం, కవి జీవించిన విభిన్న కాల పరిస్థితుల నేపథ్యం అంచనా, కవిత్వరూపం స్థాయి భావన విమర్శకు హేతువులుగా నిర్దిష్టతను సంతరించుకున్నది.కావ్యాన్ని కంటితో చూస్తే సరిపోదు పంటితో నమిలితేనే దాని రసాస్వాదన తెలుస్తుంది. కవి హృదయాన్ని బయటకు తీసే ఒక అపురూప ఆయుధమే విమర్శ.
కవి సృష్టించిన కవిత్వ మెరుపులు కాల గమనంలో వేగంగా మార్పులకు లోనైన కవిత్వ భాష, అభివ్యక్తి,వస్తు పరిమితి, కళాత్మక శిల్ప సౌందర్యం,ఎత్తుకున్నవాదం అన్నీ పరిణతి రూపంలో ప్రభావవంతమైన కావ్యంగా నిలదొక్కుకోవడానికి పై విషయాలన్నీ దోహదం చేస్తాయి. ఇలాంటి అంశాలను పలు కోణాల్లో విశ్లేషించుటకు దారులు పరుచుకున్నదే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ‘వ్యక్తావ్యక్తం’ కవితా విమర్శ గ్రంథం. ఇది కవిత్వం రాయాలనుకునే వారికి కావ్య పఠనముగా, కవిత్వాన్ని విశ్లేషించేవారికి కార్యగమనంగా పాఠకునికి రెండు నేత్రాలుగా ఉపకరిస్తుంది. ఇది ముమ్మాటికీ పరిశీలనల పరిశోధక పత్రం అని చెప్పవచ్చు.
కవిత్వ ప్రక్రియలో పరిశోధన చేసిన ఏనుగు నరసింహారెడ్డి ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసంలో కవిని ఒక ఉద్యమకారుడిలా చూపిస్తాడు. తెలుగు సాహిత్యం సమకాలీన దృక్పథం తెలుసుకోవాలంటే ఈ పుస్తక దారిని తొక్కల్సిందే! ఈ పుస్తకాన్ని మనసుపెట్టి చదువుతే కవి వ్యక్తీకరణ, దృక్పథం బోధపడుతుంది. ‘మంచి కవిత్వాన్ని పరిచయం చేయడం’ Quality Poetry తీసుకురావడం ప్రధాన ఉద్దేశంతో చేసిన ప్రయత్నం లక్ష్యాన్ని చేరుకొనుటకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది. వర్తమాన కవుల కవిత్వ ధోరణి వారి సృజనశక్తి, విస్పష్టంగా సూటిదనంతో వివరించారు. తొలి పుస్తకం వేసే వారికి కూడా నిరాశ పడకుండా ప్రోత్సాహక మాటను అందించి ఉత్తమ రచనా పద్ధతి అవలంబించడానికి తగు సూచనలు చేసిన అంశాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. వ్యక్తావ్యక్తం ఖచ్చితత్వం పాలు ఎక్కువ కాఠిన్యత తక్కువ. మరో రకంగా చెప్పాలంటే భావగర్భిత విస్ఫోటనంలా కనిపిస్తుంది. వ్యాస పరంపరను పరిశీలిస్తే 76 వస్తు వైవిధ్యం గల వ్యాసాలు కనిపిస్తాయి. ఇవి ఆయా కవుల సంపుటాలపై రాసిన ముందుమాటలు, పీఠిక వాక్యాలు, లోతైన విశ్లేషణ వ్యాసాలుగా విభజించుకొని చూడవచ్చు. వ్యక్తావ్యక్తం ఒక సాధారణ వ్యాస సంపుటి కాదు. అందులో నరసింహ రెడ్డి ఆత్మ ప్రతిబింబిస్తుంది. కవిత్వంపై ఆయనకున్న స్పృహను, అంతర్లీన భావ స్పర్శను, కవి రాసిన కవిత్వాన్ని పట్టడానికి తను చేసిన విన్యాసం అంతా ప్రతివాక్యంలో దృశ్యమానమవుతుంది.
మొత్తం వ్యాసాలను పరిశీలన చేస్తే కవి, కవిత్వం, భాష, వస్తు వైవిధ్యం, శిల్పం, సాంద్రత, వచన కవిత్వరీతులు, నిర్మాణ పద్ధతులు వంటి పలు కోణాలను అత్యంత శక్తివంతంగా ప్రదర్శనకు పెడతాడు రచయిత.
ప్రతి వ్యాసం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుందే తప్ప మూస ధోరణి అనే మాట మచ్చుకు కూడా కనబడదు. నాణ్యమైన కవిత్వం నేటి తరానికి ఎలా అందించాలి? అనే ప్రశ్నకు జవాబుగా నిలబడ్డది వ్యక్తావ్యక్తం. ఏనుగు నరసింహారెడ్డి కవిని విభిన్న రీతుల్లో అంచనా వేస్తూ, పరిశోధన చేస్తాడు. మనతో పరిశీలన చేయిస్తాడు. కవిలో అగ్నిపర్వతం దాగి ఉంటుందని, కవి బడబాగ్ని అంతా కవిత్వంలో కలవరింతగా చూపెట్టడం జరుగుతుందనీ విశ్లేషణాత్మక ఋజువును ప్రకటిస్తారు. కవి కవిత్వం రాయాలనుకుంటే అతని నిరంతర శ్రమ, కవిత్వం రాసేటప్పుడు అతని మూడ్ ఎలా ప్రభావితం చేస్తుందో ‘మరో కవిత్వ మజిలీ’అనే వ్యాసంలో సిహెచ్ ఆంజనేయులును పరిచయం చేస్తూ, కవిని బయటకు లాగి, అతని కవిత్వంపై అన్వేషణ జరిగేలా పాఠకుణ్ణి ఆలోచింప చేస్తాడు. కవి దృక్పథం తెలియాలంటే అసలు దృక్పథం ఏర్పడడానికి పునాది అతని కుటుంబం. పరిసరాల ప్రభావం కవి మీద ఎంతుందో చూపుతాడు. కవికి దేశీయమైన సరిహద్దులు ఏవీ లేవంటూ స్వేచ్ఛా కవిత్వరచనకు ఊతంగా నిలబడతాడు. కవిత్వం నిజానికి కవి రాయడు కవిత్వమే కవిని సాధనంగా చేసుకొని కవిత్వాన్ని రాయిస్తుందనీ దండమూడి శ్రీ చరణ్ హృదయ స్పర్శను పులుముతారు. కవి గురించి చెబితే కవిత్వం ఎలా ఉంటుందో చెబుతా, కవిత్వమంతా చదివితే ఆ కవి ఎలా ఉంటాడో చెబుతానని ఒక విమర్శకుని వాక్యాన్ని ఆసరాగా చేసుకొని అనేక వ్యాసాల్లో కవిని ప్రత్యేక వస్తువాంశముగా తీసుకొని ప్రయోగాలు చేశారు.
వర్తమాన కవిత్వంపై చక్కని అభినివేశం చేశారు నరసింహారెడ్డి. “Knowledge is not free.You have to pay attention”-Richard Fhemman కవి తన కవిత్వాన్ని తక్కెడలో పెట్టి తూచాలని చాపల్య సాహసంపై వివరణ ఇస్తూ భారతీయ అలంకారీకులు చెప్పిన ప్రతిభ,వ్యుత్పత్తి కవిని వెలుగు తీరం వెంట నడిపిస్తుందని ఉదాహరణగా అమ్మంగి కవితాస్వామి కవిత్వానికి ఆసరా వాక్యం రాసిన రచయిత, పలు లక్ష్యాత్మక అంశాలపై వివరణ ఇస్తారు. ఒక శతాబ్దం వయసు కూడా నిండని వచన కవిత్వంలో వచ్చిన మార్పులు రూపంలో పురోగతి కంటే, వస్తు స్వీకరణలో, దృష్టి కోణంలో వచ్చిందని భావ, అభ్యుదయ, విప్లవ అస్తిత్వ ఉద్యమాలు వచన కవితను పరిపుష్ఠం చేశాయని సోదాహరణంగా వివరిస్తారు. ప్రతి కవికి గాయం నుండే గేయం పుడుతుంది. గతం పునాది మీదనే వర్తమానం నడుస్తుందనీ, శ్రీశ్రీ భావాలను తిలక్ వ్యక్తీకరణలను శేషేంద్ర కవిత్వాన్ని యాదికి తెప్పిస్తాడు. కొత్త కవుల రచనాతీరు, కవిత్వ పోకడపై మార్గదర్శకుడుగా వ్యవహరిస్తారు.
కవి తాత్విక దృశ్యంలో విశ్వసనీయతను పరికిస్తే కవి తాత్వికుడు ఇద్దరు అన్నదమ్ములు అంటారు. ‘సుంకిరెడ్డి నారాయణ రెడ్డి దాలి ప్రతీకలు భావ చిత్రాలు’ అనే వ్యాసంలో ఆధునిక కావ్య కళ గురించి గట్టిగానే నొక్కి చెబుతాడు. ఒక వస్తువును కవిత్వీకరిస్తున్నప్పుడు ఆ వస్తువును నేరుగా చెప్పకుండా ఇతర సంకేత పదం వాడడం ద్వారా అసలు వస్తువును పాఠకుడికి స్ఫురింప జేయడం ఆధునిక కావ్యకళ Poetry takes place when the emotion recollected in tranquility అన్న వర్డ్స్ వర్త్ మాటను కోట్ చేస్తూ విశిష్ట విపులీకరణ చేస్తారు. ప్రతికలు భావ చిత్రాల ద్వారా దాలి దీర్ఘ కావ్యాన్ని సుంకి రెడ్డి నడిపించిన తీరును స్పష్టమైన ఉదాహరణలతో చూపెట్టారు.
దాలి ఒక తెలంగాణ రైతు స్వరంలో చేసిన క్రోధ ప్రకటన అంటూ ప్రతీకాత్మక వ్యక్తీకరణ గురించి చెబుతూ నిఘంటువు చెప్పే అర్థం కంటే సందర్భాన్ని చెప్పే అర్థమే ప్రధానమంటాడు రెడ్డి. కొమ్ములపగ్గం, ముదాడు, హత్కడీల్, మెడ సంకెల, బారసాల, చెరసాల ఈ పదాల వాచ్యార్థం వేరే లక్యార్థం వేరే అయినప్పటికీ ఇవన్నీ ప్రతీకలుగా లక్ష్యార్ధాన్ని సాధిస్తుందని సుంకిరెడ్డి కవిత్వ కోత గురించి చెప్తాడు. వర్తమాన కవుల కవిత్వ ధోరణి విపులంగా వివరించబడింది. కవిత్వంలో నిర్మాణం అభివ్యక్తి గురించి సూచనలు చేస్తూనే, తొలి పుస్తకం వేసే వారికి కూడా నిరాశపడకుండా ప్రోత్సాహక మాటలను అందిస్తూ, కవిత్వ సాంద్రతను మాత్రం అత్యంత లోతుగా విశ్లేషించారు. విమర్శ రాసేవారికి అవసరమైన పనిముట్లను, విమర్శోపకరణాలను అద్దంలా శుద్ధి చేసి పెట్టారు నరసింహారెడ్డి. కవి రచనలపై అతడు జీవించిన కాల పరిస్థితుల ప్రభావం ఎంత ఉంటుందో, కాల సందర్భాలను మించిన కవిత్వం లేదంటాడు ఈ సన్నివేశంలో గుర్రం జాషువా కవిత్వాన్ని స్మరిస్తూ, కవిత్వం వస్తుకేంద్రితంగా సాగాలంటూ నందిని సిధారెడ్డి అనిమేషపై విస్తృత వ్యాఖ్యను గుప్పిస్తారు. సాహిత్య సముద్రం ఈదడంలో కవి అలసట చెందకూడదంటాడు. ఒక మనిషి మరొక మనిషితో చేసే ఆత్మీయ సంభాషణ లాగా కవిత్వ రచన సాగాలంటారు.
గన్నోజు ప్రసాద్, 9491617161



