అమ్మ తల్లి’ ఆరాధన మన బతుకుమూలాల్లోనే ఉంది. ఏ దుష్టశక్తి ఊరి మీద పడకుండా వేయికండ్లతో కాపుకాయడానికి ఊరికో గ్రామదేవత ఉన్నట్టు ప్రతి మనిషి జీవితానికి అమ్మ ఉంది. కండ్లను చూసి బిడ్డ ఆకలిని పసిగట్టేది ఈ లోకంలో అమ్మ ఒక్కతే. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చినట్టు, సముద్రాన్ని కేవలం సముద్రంతోనే పోల్చినట్టు అమ్మను కేవలం అమ్మతోనే పోల్చగలం. అలాంటి అమ్మల గురించి వనపట్ల సుబ్బన్న ‘పసరంటిన కొడవలి’ని తీసుకొని వస్తున్నాడు. అమ్మ గురించి వేరు వేరు సందర్భాల్లో రాసిన కవితలతో తెస్తున్న ఈ పసరంటిన కొడవలి ఒక దీర్ఘ కవిత లాంటిది. వనపట్ల సుబ్బన్న దీర్ఘ కవితలకు కేరాఫ్ అడ్రస్. తెలంగాణ, చెరువు, అడివి, మంగలి వృత్తి జీవితం, జయశంకర్ సార్, ఫూలే.. ఏ అంశాన్ని తీసుకున్నా అలుగెల్లిన అక్షరమై ప్రవహించి దీర్ఘ కవితగా ప్రవహించాడు. ఒక వైపు షాపు నడిపిస్తూ మరొక వైపు సమాజంలోని ఆధిపత్యపు కోరలను కత్తిరిస్తూ ముందుకు పోతున్నాడు. “నీ కుర్చీలో నీవొక్కడివే రాజు/ నా కుర్చీలో జనమంతా రాజులే” అని మంగలి కుర్చీకి సాహిత్యగౌరవం కల్పించిన కవిత తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిల్చిపోతుంది.
సాహిత్యంలో అమ్మకు గొప్ప స్థానం ఉంది. అమ్మ మీద నాలుగు వాక్యాలు రాయని కవి ఉండడు. ప్రపంచ సాహిత్యపు గతిని మార్చిన మాక్సింగోర్కి ‘అమ్మ’ నవల ప్రభావం మనకు తెలుసు. అమ్మ మీద రాసిన కవితలతో ఎన్నో సంకలనాలు వచ్చాయి. చీకోలు సుందరయ్య సంపాదకత్వంలో నూట పద్దెనిమిది మంది కవులు రాసిన ‘అమ్మ’ సంకలనం వచ్చింది. నేటినిజం సంపాదకులు బైసా దేవదాసు సంపాదకత్వంలో అమ్మ చిత్రాలతో అమ్మ కవితా సంకలనం వచ్చింది. ఘంటశాల నిర్మల సంపాదకత్వంలో ‘అమ్మపదం’ కవిత్వ సంకలనం వచ్చింది. అన్వర్ సంపాదకత్వంలో ముస్లిం కవులు రాసిన ‘అమ్మీజన్’ సంకలనం వచ్చింది. వనపట్ల సుబ్బన్న సంపాదకత్వంలోనే ‘ తల్లీ నిను దలంచి ‘ వచ్చింది. ‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే ‘ అని చెప్పిన వేల సినిమా పాటలు వచ్చాయి. పుట్టిన రోజులు, పెండ్లి రోజులు తెల్వని అమ్మ కోసం ‘అమ్మ పండుగ’ చేసి తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి, అమ్మపండుగ చేసి ఇమ్మడి బుచ్చయ్య ‘అమ్మతో నేను’ పుస్తకం రాశాడు. భావ, విప్లవ, అస్తిత్వ ఉద్యమాలలో అనేక కోణాల్లోంచి అమ్మను కవిత్వీకరించిన సందర్భాలు అనేకం. “ఏనుగంత తండ్రిపోయినా ఏకులబట్టంత తల్లి ఉండాలి”, “అవ్వ మీద యాష్ట రాదు. బువ్వమీద బుద్ది తీరదు” మొదలైన సామెతలన్నీ అమ్మప్రేమ చుట్టు అల్లుకున్నవి. ”వచ్చి పోయే దారిలో అమ్మ సమాధి/ యాదికొచ్చినప్పుడల్లా/ తలుపెనుకున్న/ పసరంటిన కొడవలి కనపడతది!“ సుబ్బన్న కొడవలిలో అమ్మను చూసుకుంటున్నాడు. అమ్మను గుర్తుకు తెచ్చుకుంటూ కొడవలిని యాది చేసుకుంటున్నాడు.
అమ్మను గుర్తుకు తెచ్చుకుంటే నెత్తిన సద్దిమూట, చేతిలో కొడవలిలిక్కితో సర్రసర్ర బాటపొంటి కూలికి పోయే దృశ్యం గుర్తొస్తది. ఇసుర్రాయి కాడ కూర్చోని ఇసురుతూనే కనబడుతది. పొయ్యి కాడ కూర్చోని పొయ్యి రాజేస్తూ అన్నం ఉడికిందో లేదో చూస్తూ ఉంటది. పని దప్పా వేరే ప్రపంచం తెల్వని తల్లుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాడు సుబ్బన్న. ‘రెండు చేతుల విత్తనమేసే అమ్మ ఒక ద్విపద కావ్యం’ అంటాడు నాగిళ్ళ రమేశ్. వ్యవసాయంలో స్త్రీ చేయి లేకుండ మునుం ముందుకు సాగదు. పంట ఇంటికి రాదు. నాట్లేసినా, కోత కోసినా, మెద మోసినా, తూర్పాల పట్టినా ప్రతి పనిలోను అమ్మ ఉంటుంది. ఒకవైపు ఇంటి చాకిరి చేస్తునే కూలిపోయిన దగ్గర తల్లి కష్టం ఎట్లుంటదో ప్రధానంగా చెబుతున్నాడు. అమ్మ శ్రమ గురించి సుబ్బన్న చెబుతుంటే “అమ్మ శ్రమకు వృద్దాప్యం లేదు. అమ్మ పనికి వస్తుంది” అనే జుగాష్ విలి వాక్యాలు మనసలో మెదిలాయి. “కోతకు వంగితే చేలు అదిరేవి/ కలుపు తియ్యని చెలుక లేదు/ పరిగలేరని పొలం లేదు/ సాలంతా కాపోళ్ల పొలంలో పొద్దై వాలేది” నలభై యాభై ఏండ్ల కిందట తల్లులు ఎట్లా ఉండేటోళ్ళో ఈ తరానికి తెల్వదు.
ఆరేడుమంది పిల్లలను కని, సాది, సవరించి పెద్ద చేసేటోళ్ళు. ఇప్పుడున్నన్ని వసతులు వాళ్ళ కెక్కడివి? గ్రైండర్లు, మిక్సిలు పట్టె వాళ్ళకు విసుర్రాయితో, కుందెనలో పోసి దంచే తల్లుల శ్రమ తెలుసా? లైటర్ వెలియించే ఆధునిక తరానికి మోపులకు మోపులు కట్టెలు తెచ్చి పొయ్యి ముట్టించే బాధ తెల్వదు. చేదబాయిలో నీళ్ళు చేదిన తరం. వొంచిన నడుము లేపకుండా చేను కోసిన తరం. ఆ తల్లుల శ్రమను పసరంటన కొడవలిలో చూపెడుతున్నాడు సుబ్బన్న. వనపట్ల సుబ్బన్న ‘పసరంటిన కొడవలి’ ఒక శ్రమకావ్యం. ఒక మమకార కావ్యం . అనేక మంది తల్లులు ఒక దగ్గర కూర్చోని ముచ్చట పెట్టుకునే పల్లె దృశ్యాలను కవిత్వంలోకి తెచ్చాడు. అమ్మ నడిచిన దారులను, నిలబడి ముచ్చట పెట్టిన తావులను, కొంగు అడ్డం పెట్టి చన్నిచ్చిన పాలధారలను కవిత్వంగా మలిచాడు.
ఈ పసరంటిన కొడవలి కూలితల్లుల బతుకకథ. రెక్కల్ని దాసుకోకుండా నిండార కూలి చేసి బిడ్డలకు అంగిలాగు కుట్టించి, అక్షరాల తొవ్వ చూపిన తల్లుల కథ. అమ్మ త్యాగాన్ని చెప్పడానికి అమ్మను వృక్షంగా, నదిగా దర్శించాడు. అమ్మని మించిన ఙ్ఞానం లేదని చెప్పడానికి ‘మహాబోధి’గా కవిత్వీకరించాడు. ఒక్క మాటలో తల్లి అల్లిన గూడే ఈ ప్రపంచం అని తల్లి పాదాల దగ్గర ఈ సమస్తాన్ని పెట్టాడు.
అమ్మ పేరు పడిపోకూడదని, అమ్మను తల్చుకోవడానికి చాలా మంది సాహిత్యకారులు అమ్మ పేరుతో పురస్కారాలు ఇస్తున్నారు. ఖమ్మంలో సీతారాం ‘సాహితీ మాణిక్యం పురస్కారం’, సిరిసిల్లలో రంగినేని మోహన్ రావు ‘రంగినేని ఎల్లమ్మ పురస్కారం’, నాగర్ కర్నూల్లో ఎదిరెపల్లి కాశన్న ‘ఎదిరెపల్లి మశమ్మ స్మారక పురస్కారం’ ఇస్తున్నారు. ఇంకా వంశీకృష్ణ ‘తాటికాండల భ్రమరాంబ పురస్కారం’, సుద్దాల అశోక్ తేజ ‘సుద్దాల జానకమ్మ పురస్కారం’, మేఘనాథ్ రెడ్డి ‘శివాగేరి దేవమ్మ’ పురస్కారాలు ప్రముఖంగా చెప్పుకోదగినవి. అమ్మ పేరు మీద ఇట్లా పురస్కారాలు ఇవ్వడం ‘నేల మీద సంస్కారానికి నారు పోయడమని’ సుబ్బన్న అంటున్నాడు. ప్రతి కవితలోను సుబ్బన్న ప్రధానంగా అమ్మ శ్రమను, కుటుంబంలో అమ్మ త్యాగాన్ని చెబుతూ ముగింపులో అమ్మ లేని జీవితాన్ని చూపిస్తాడు. కొన్ని మాటలు చదువు తుంటే, కొన్ని దృశ్యాలు చూస్తుంటే ఎక్కిళ్ళు పట్టేటట్టు ఏడ్చి పేజీ ముందుకు తిప్పనివ్వని అనుభవం . ‘అమ్మ కోసం దేవులాట’ ఈ కవిత్వంలో మనందరిని కదిలించే దృశ్యం. “ఊర్ల అందరూ వున్నారు/ అమ్మ ఒక్కతే లేదు!/ తెంపిన మక్కజొన్న కంకులు/ కట్టిన కట్టెల మోపు/ సెలుకల అన్నీ ఉన్నవి/ ఒక్క అమ్మనే లేదు!” ( కుదెన)
జానపదులు పాడుకునే ఆవు – పులి కథలో ‘మీరందారొస్తిరి / మా అమ్మ ఏది’ అని ముందొచ్చే ముంగ్యావులను, ఎనుకొచ్చే ఎర్రావులను, నడుము వచ్చె నల్ల ఆవులను లేగ దూడ అడిగినట్లు సుబ్బన్న కూడా పొద్దూకంగనే వచ్చే కూలి తల్లుల గుంపులను అడుగుతున్నాడు. ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత కీర్తి మూట గట్టుకున్నా లోకం ఎంత అర్ధమయినా మళ్ళీ మనల్ని పసిపిల్లలను చేసి ఆడించే గుణం అమ్మమాటకు ఉంది. ఈ అక్షరాలకూ ఉంది.
“కలం పట్టుకున్నపుడన్నా అమ్మ కాకపోతే/ అక్షరాలెట్టా బతుకుతాయి!/ ఎట్టా ఎదుగుతాయి! ఎట్టా ఎగురుతాయి!!” అని అంటాడు కవి కె. శివారెడ్డి. పసరంటిన కొడవలి లో సుబ్బన్న కేవలం అమ్మ మీదనే రాయలే. అమ్మగా మారి రాశాడు. అందుకే ఈ అక్షరాలలో చనుబాల తీపి వాసనే. గోటితో గిచ్చితే పాలుగారే లేత మొక్క లాంటిది అమ్మ మనసు. ఏడ కథ చెప్పితే ఆడికి సంకన సాపను పెట్టుకొని వాలె పసివిల్ల అమ్మ. తన ఇష్టలోకాన్ని ఎంత అపురూపంగా పటంగట్టి చూపెడుతున్నాడో చూడండి. ”చెట్టుమీద పిట్టవాలినట్లు/ ఊర్ల యాడ కథ సెప్పితే ఆడ పావురంలా వాలేది/ కథ నడుస్తుంటే బీర్లాయనతో పాటు అమ్మేడిసేది/ పొద్దుగాల నాట్లల్ల కలుపుల్ల రాత్రి కథ చెప్పేది./ ఎల్లమ్మ, నాగమ్మ, బ్రహ్మంగారి ఆటన్న అమ్మకు ప్రేమే!” (అమ్మే ప్రపంచం) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (తారకమ్), కె. నిరంజన్ రెడ్డి (కోట్ల వెంకటమ్మ), కె. మన్యప్ రెడ్డి (కొండ కింది మనెమ్మ), ఎదిరెపల్లి కాశన్న (ఎదిరెపల్లి మశమ్మ) తగుళ్ళ గోపాల్ (తగుళ్ళ ఎల్లమ్మ), హెచ్. రమేష్ బాబు (సక్కుబాయి), గుడిపల్లి నిరంజన్ ( కొడిదెల కిష్టమ్మ), కొల్లాపురం విమల ( సౌభాగ్య లక్ష్మి), నాగవరం బలరాం (రంగమ్మ) మొదలైన రాజకీయ వేత్తల, సాహితీకారుల మాతృమూర్తుల మీద రాసిన ఎలిజీలు ఉన్నాయి ఈ సంపుటిలో. వాళ్ళతో తనకున్న అనుబంధం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ సామాజిక నేపథ్యం కొన్ని కవితల్లో కనబడితే వాళ్ళు వెళ్ళి పోయిన తర్వాత మిగిలిన పొక్కిలైన వాకిళ్ళు మరికొన్ని కవితల్లో కనబడుతాయి.
శివసాగర్ “అమ్మా! నను కన్నందుకు విప్లవాభివందనాలు” అన్నాడు. సుబ్బన్న కూడా అమ్మకు ‘కవితాభివందనాలు’ అర్పిస్తున్నాడు. ఈ కవితలో అమ్మ గొప్పతనం కీర్తించడం వరకే ఆగిపోలేదు. సామాజిక వాస్తవాలను చూపించి అమ్మతనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిడ్డలకు విషం పెట్టి చనిపోతున్న తల్లులను చూస్తున్నాం. పిల్లలను అనాథలుగా విడిచిపెడుతున్న తల్లులను చూస్తున్నాం. రైలు పట్టాల మీద పిల్లలతో పాటు ఆత్మ హత్య చేసుకుంటున్న వార్తలను వింటున్నాం. గ్లోబలైజేషన్ యుగంలో డబ్బు సమస్యలు, ఒంటరితనం…కారణాలు ఎన్నున్నా తనతో పాటు తన పిల్లలను చంపడం ఒక తల్లి చేయాల్సిన పని కాదు. అట్లాంటి తల్లలందరికి కనువిప్పు ఈ కవిత. ఊర్లల్లో తండ్రి సచ్చినా తల్లి ఉండాలంటారు . ఏడిండ్లు తిరిగైనా బిడ్డలను బతికిచ్చుకుంటదని అంటారు. అట్లాంటి అమ్మను తలుచుకుంటూనే వీధిపాలు చేయనందుకు నీకు వందనాలు అని అంటున్నాడు. అందరూ అమ్మలేదని బాధపడుతుంటే అమ్మ ఎక్కడికీ పోదని సుబ్బన్న ధైర్యమిస్తున్నడు. “అమ్మ ఎక్కడికి వోలె/ ఏ ఊరు పోలె తిరునాల పోలె/ ఏ పేరంటానికి పోలె ఏ ఆట చూడ పోలె/ ఊరోళ్ల జొన్నచేను కోయ కూలికి పోయింది./ తమ్మునికి సన్నియ్య పొద్దప్పుడు తప్పక వస్తది/ నాకు పాల జొన్నల్ని/ కొంగుల మూటగట్టుకొస్తది!” ( అమ్మ కూలికి పోయింది) అవును, అమ్మ కూలికి పోయింది. మనందరి కోసం కందికాయలను కొంగులో కట్టుకొని వస్తది. పసరంటిన కొడవలి చదివిన తర్వాత నాకు మరింత ధైర్యం వచ్చింది. అమ్మ మళ్ళీ మనింటికి వస్తది. బిడ్డల రూపంలోనో, కొడుకుల రూపుతోనో. అమ్మ పేరునో, అమ్మపేరులోని మొదటి అక్షరాన్నో కలిపి కొత్తగా పిలుచుకుందాం. వాక్యం వాక్యం దగ్గర అమ్మను గుర్తుకు తెచ్చిన వనపట్ల సుబ్బన్న ప్రేమలు.
తగుళ్ళ గోపాల్, 95050 56316



