భారత్‌ జోడో న్యాయ్ యాత్రకి అడ్డంకులు

Obstacles to Bharat Jodo Nyay Yatra– మణిపూర్‌ ప్రభుత్వ అనుమతి నిరాకరణ
– రాత్రి బసకు అసోం ప్రభుత్వం అనుమతికి నో
– యాత్ర వేదిక మార్పు
– రాహుల్‌ యాత్రలో చేరడానికి మిస్డ్‌ కాల్‌
– యాత్రలో నడిచేవారికి న్యారు యోధ అని పిలుపు
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జనవరి 14 నుంచి చేపట్టనున్న ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ ప్రారంభ వేదికను మారుస్తున్నట్టు ఆ పార్టీ శుక్రవారం తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి కాకుండా.. తౌబాల్‌ జిల్లాలోని ఓ ప్రయివేట్‌ గ్రౌండ్‌ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. వేదిక మార్పుపై పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర స్పందించారు. ఇంఫాల్‌లోని హప్టా కాంగ్జెబుంగ్‌ నుంచి యాత్ర చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాహుల్‌ యాత్రకు అనుమతి కోరుతూ రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ నాయకులు సీఎం బీరెన్‌ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వారికి స్పష్టం చేశారు. అనూహ్యంగా అదే రోజు రాత్రి అనుమతులిస్తూ ఇంఫాల్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్యపై పరిమితులు విధించడంతో పార్టీ వర్గాలు మరోసారి సీఎస్‌, డీజీపీని కలిశాయి. అనంతరం వెయ్యి మంది పాల్గొనేందుకు అనుమతిస్తూ వేదికను మార్చుకోవాలని గురువారం రాత్రి వారు సూచించారు. దీంతో తౌబాల్‌ నుంచి యాత్రను ప్రారంభించాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.
రాత్రి బసకు అసోం ప్రభుత్వం అనుమతి నిరాకరణ
భారత్‌ జోడో న్యారు యాత్ర సందర్భంగా అసోంలోని రెండు జిల్లాల్లో తమ నాయకులకు పబ్లిక్‌ గ్రౌండ్స్‌లో రాత్రి బస చేసేందుకు అస్సాం ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని కాంగ్రెస్‌ పేర్కొంది. ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కంటైనర్లను ఉంచడానికి పార్టీ ఇప్పుడు ప్రయివేట్‌ వ్యవసాయ భూముల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చూస్తోందని, అక్కడ రాహుల్‌ గాంధీతో సహా సీనియర్‌ జాతీయ నాయకులు ఒక రాత్రి బస చేస్తారని అన్నారు. ”మేము మా కంటైనర్‌ వాహనాలను పార్క్‌ చేసి ధేమాజీ జిల్లాలోని గోగాముఖ్‌లో రాత్రి బస చేయడానికి పాఠశాల మైదానాన్ని కోరాం. మొదట ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ చివరి క్షణంలో దానిని ఉపసంహరించుకుంది. దీంతో ప్రయివేట్‌ స్థలాల్లో రాత్రి బస చేస్తారు” అని అన్నారు.
యాత్రలో చేరడానికి మిస్డ్‌ కాల్‌…పాల్గొనేవారు ‘న్యాయ్ యోద్ధ’
రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యారు యాత్రలో పాల్గొనేవారిని, దానికి ఏ విధంగానైనా సహాయం చేసిన వారిని ‘న్యాయ్ యోధ’ (న్యాయ యోధుడు) అని పిలుస్తారని కాంగ్రెస్‌ తెలిపింది. న్యాయ్ యాత్ర కోసం 9891802024 మొబైల్‌ నంబర్‌ను విడుదల చేసింది. దానికి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి యాత్రలో పాల్గొనవచ్చని పేర్కొంది. భారత్‌ జోడో న్యారు యాత్ర.. ఈ నెల 14న మణిపూర్‌లో మొదలై మార్చి 30న ముంబయిలో ముగుస్తుంది. 66 రోజుల పాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.

Spread the love