మార్చిలోపు నాన్‌ ప్రొఫెషనల్‌ విద్యార్థుల

– ఉపకారవేతనాలను విడుదల చేయాలి
– కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్‌ గౌరీ సతీష్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బకాయి ఉన్న రూ.350 కోట్ల నుంచి రూ.360 కోట్లను ఈ నెలాఖరులోపు విడుదల చేయాలని కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్‌ గౌరీ సతీష్‌ ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. తమను రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికిగాను 86.55 కోట్ల టోకెన్లు జారీ చేసినప్పటికీ నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 2022-23 సంవత్సరానికిగాను దాదాపు రూ.226 కోట్లు విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఉపకారవేతనాలకు సంబంధించి ప్రభుత్వం ప్రొఫెషనల్స్‌, నాన్‌-ప్రొఫెషనల్స్‌గా విభజించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ పీజీలు కాలేజీలు స్థాపించుకుని గత ఎనిమిదేండ్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గౌరీ సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద పని చేసే బోధనా, బోధనేతర సిబ్బందికి కనీసం జీతాలు చెల్లించలేక పోతున్నామని తెలిపారు. తీసుకున్న రుణాలకు బ్యాంకులు రికవరీ నోటీసులు, ఆస్తి తదితర పన్నుల నోటీసులు జారీ చేస్తుండగా, తనిఖీ అధికారులు మౌలిక సదుపాయాల వివరాలు అడుగుతూనే ఉన్నారని తెలిపారు. ఎనిమిదేండ్లుగా ఫీజులు పెంచలేదనీ, అయినప్పటికీ ప్రతి సంవత్సరం తనిఖీ ఫీజు, అనుబంధ గుర్తింపు ఫీజు 10 శాతం నుంచి 50 శాతం పెంచు తున్నారని తెలిపారు. ఇప్పటికీ ఏడాదికి ఇంటర్మీడియట్‌ ఫీజు రూ.1,940గానే ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత ఖర్చులకు తగినట్టుగా ఆ ఫీజును పెంచాలని కోరారు. రెండేండ్లుగా ఉపకారవేతనాలు విడుదల చేయకుండా తాము నాణ్యమైన విద్యను ఎలా అందివ్వగలమంటూ ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల్లో 55 శాతం తమ కళాశాలల్లోనే చేరుతున్నారనీ, గత 20 నుంచి 30 ఏండ్లుగా వీటిని విజయవంతంగా నడిపిస్తు న్నామని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు రాంరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, చంద్రయ్య, సుధాకర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love