సరి కొత్త వ్యసనం

Okay new addictionఫోన్‌ కాల్‌ వచ్చిన నుండి రాఘవయ్య మనసంతా దిగులుగానే ఉంది. ఎంతో ఇబ్బందిగా ఉంటే కానీ సుమతి ఫోన్‌ చేసి రమ్మనదు. ఏమి చేయాలో తోచడము లేదు. వెంటనే భార్యను తీసుకుని హైదరాబాద్‌ బయలు దేరాడు. రైలులో కూర్చున్నాడే కాని మనసు స్థిమితంగా లేదు. ఇంత అత్యవసరంగా పిలిచింది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. ఈ పరిస్థితి నుండి సుమతిని ఎలా బయట పడేయాలి అని దారి పొడుగునా ఆలోచిస్తూనే ఉన్నాడు.
”ఈ మధ్య మీ అల్లుడుగారు నన్ను పట్టించుకోవడం లేదు. ఎప్పుడు దాని ధ్యాసే”
అప్పుడే పల్లెటూరి నుండి వచ్చిన అమ్మానాన్నలతో ఏడ్చుకుంటూ చెప్పింది సుమతి. ఒక్కగానొక్క బిడ్డ సుఖపడుతుందని ఎన్నో మంచి పెద్దపెద్ద సంబంధాలు వచ్చినా హైదరాబాద్‌లో ఆరంకెల జీతం వస్తుందని విశ్వాస్‌ కిచ్చి విశ్వాసంగా పెళ్లి చేశారు. పెళ్లైన ఆరేడు నెలలు బాగానే ఉన్నారు. ఇప్పుడు కూతురు త్వరగా రమ్మని పోన్‌ చేస్తే ఆరువందల కిలో మీటర్ల దూరం నుండి రయ్యిన పరుగెత్తుకుంటూ వచ్చారు.
”ఎన్ని రోజుల నుండి జరుగుతుంది ఈ భాగోతం” కోపంగా అడిగాడు తండ్రి రాఘవయ్య
”నెల రోజుల నుండి..” మెల్లగా అంది సుమతి.
”నెల రోజులనుండి నిద్రపోతున్నవా నువ్వు. ఇంత అమాయకురాలివి ఎట్లా బతుకుతావే తల్లి” తల్లి కూడా మందలించింది.
”ఎప్పుడు దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఇంటికి వచ్చాక నాతో సరిగా మాట్లాడడం లేదు. ఏదో మొక్కుబడిగా టిఫిన్‌ చేస్తున్నాడు. అన్నం తింటున్నాడు. అంతే! ఇంట్లో ఉన్నంత సేపు దాని గురించే ఆలోచన. గంటల తరబడి ముచ్చట, వెకిలి నవ్వులు. ఇంట్లోనే ఇలా ఉంటే బయట దానితో ఇంకా ఎలా ఉంటున్నాడో! ఊహిస్తేనే భయమేస్తోంది నాన్న. ఇద్దరమే ఉండే ఈ ఇంట్లో నేనున్నాననే విషయం ఎప్పుడో మరిచిపోయిండు ఆయన…” వెక్కి వెక్కి ఏడుస్తున్న సుమతిని ఓదార్చింది తల్లి. బిడ్డకు ఇంతటి గుండె కోత నిచ్చిన అల్లుడి సంగతి చూడాలని కోపంతో ఊగిపోతున్నాడు రాఘవయ్య.
రాఘవయ్య పదేకరాల ఆసామి. చేసేది వ్యవసాయం అయినా ముందుచూపు బాగా ఎక్కువ. మొదటి నుండి తన కూతురుని పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తికి ఇవ్వాలని ఉండేది. ఆయన ఆలోచనలు కూడా పెద్దపెద్ద పట్నాల చుట్టూ తిరిగేవి. బాగా ఆస్తులు, పొలాలు, భవంతులు ఉన్న బంధువులు ఎంతోమంది సుమతిని తమ ఇంటి కోడలిని చేయమని రాఘవయ్య ఇంటి చుట్టూ అప్పులవారి వలె తిరిగారు. ససేమిరా వినలేదు.
మ్యాట్రిమోని సహాయంతో తమ కూతురికి పెళ్ళి సంబంధాలు చూస్తుంటే ఊర్లోని వారు విడ్డూరంగా చూసారు.
”ముక్కు మొహం తెలియని సంబంధాలు ముప్పుకు దారితీస్తాయి”
”తెలిసిన వారి ఇంటికే పిల్లనిస్తే, మంచి చెడు మనం గమనించవచ్చు”
”పట్నపొల్ల అలవాట్లకు మన పల్లెటూర అమ్మాయిలు అంత త్వరగా ఇమిడిపోరు”
”దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి. దగ్గరికెళ్ళితేనే తెలుస్తాయి. వీరు కూడా ఇంతే”
బంధుమిత్రులు రకరకాల మాటలతో రాఘవయ్యకు నచ్చచెప్పి చూసారు. తన కూతురి భవిష్యత్తు తనకు ముఖ్యమని ఎవరి మాటా వినలేదు. చిన్నచిన్న ఉద్యోగుల జీవితాలలో ఎదుగుదల ఉండదని, పెద్ద జీతం తీసుకునే ఉద్యోగుల గురించే తెలుసుకోవడం మొదలెట్టాడు.
ఓ పది పన్నెండు సంబంధాలు తిరస్కరించిన తర్వాత విశ్వాస్‌ సంబంధం నచ్చింది. పెద్ద ఆఫీసర్‌. ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటారు. హైదరాబాద్‌లో స్వంత ఇల్లు, కోట్లలో ఆస్థి. అన్నీ నచ్చాయి. అల్లుడు కూడా అందగాడు. అమ్మాయి కూడా అతనికి నచ్చింది. ఎక్కడా రాజీ పడకుండా పెళ్ళి ఘనంగా చేసాడు. ఊరి వారందరూ నోరు తెరిచేటట్లు ఏర్పాట్లు చేసాడు.
ఇప్పుడు అల్లుడిగారి నిర్వాకం ఊరిలో తెలిస్తే తన పరువు ఏమి కాను! ఎంతోమంది హెచ్చరించినా వినకపోతిని. ఇప్పుడు బంధు మిత్రుల దెప్పి పొడుపు మాటలు ఎలా భరించాలి. ఏమి మోహం పెట్టుకుని తిరగాలి. నిన్న మొన్న ఓర్వలేనోడు ఈరోజు నవ్వే పరిస్థితి వచ్చింది కదా!
రాఘవయ్య తీవ్రంగా మదనపడుతున్నాడు. కారు హారన్‌తో ఆలోచనలు కట్టేసి ఈ కాలానికి వచ్చాడు.
కొద్దిసేపటి తర్వాత అతడు వెహికల్‌ దిగిన శబ్దం వినిపించింది.
”ఆయన వచ్చినట్లున్నారు” అంది సుమతి.
”ఎప్పుడు వచ్చారు మావయ్య?” ఇంట్లోకి అడుగుపెడుతూనే ఎదురుపడిన మామను చూసి అన్నాడు విశ్వాస్‌.
”ఇప్పుడే వచ్చిన” కోపంగా అన్నాడు.
”అదే..అదే.. నా కాపురంలో నిప్పులు పోసింది” మెల్లగా అమ్మతో అంది సుమతి. ఆమె కోపంగా అల్లుడివైపు చూసింది.
”దాని దుంప తెగ. ఏదే అది” ఆవేశంగా అంది అమ్మ. ఆయనకు ఎడమచేతి వైపున కలర్‌ఫుల్‌గా ఉన్న దాన్ని చూపించింది.
అంతే! సుమతి అమ్మానాన్నలు ఇద్దరూ షాకయ్యారు.
విశ్వాస్‌ మాత్రం రోజులాగే దానితో ముచ్చటలో పడిపోయాడు.
అది… అది… సెల్‌ పోన్‌..
ఇంకా నయం అల్లుడిని తిట్టలేదు అనుకున్నారు ఇద్దరూ. తేలికైన మనసుతో ఊపిరి పీల్చుకున్నాడు రాఘవయ్య. యాంత్రికంగా మారిన అల్లుని మనసును కుటుంబ బంధాల వైపు మార్చడం పెద్ద కష్టమేమీ కాదని అనుకున్నాడు. ఈరోజుల్లో సెల్‌ఫోన్‌ వ్యసనం నుండి బయటపడడం అంతా సులభం కాదని సుమతి నమ్ముతుంది. విశ్వాస్‌ మాత్రం సెల్‌ఫోన్‌ చాటింగ్‌లో మునిగిపోయాడు.
– దుర్గమ్‌ భైతి, 9959007914

Spread the love