న్యూస్‌క్లిక్‌పై ఇక సీబీఐ వంతు ప్రబీర్‌ నివాసం, కార్యాలయంలో సోదాలు

On Newsclick, the CBI has searched the office of Prabir's residenceదాడిని తీవ్రం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ పై కేంద్ర ప్రభుత్వం దాడిని తీవ్రం చేసింది. గతంలో ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి, దర్యాప్తు చేశాయి. న్యాయస్థానాల ముందు ఒక్క ఆరోపణననూ రుజువు చేయలేకపోయాయి. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు దాడి చేశారు. ఇప్పుడు సీబీఐ వంతు వచ్చింది. సీబీఐ రంగంలో దిగి న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ ఇల్లు, ఆఫీసులో బుధవారం సోదాలు చేపట్టింది. ఈ సంస్థపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను ఉల్లంఘించిందని సీబీఐ ఆరోపిస్తుంది. బుధవారం ఉదయం ప్రబీర్‌ నివాసానికి, కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇటీవల ప్రబీర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. న్యూస్‌ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఇటీవల ప్రబీర్‌ నివాసం సహా ఆ సంస్థ కార్యాలయం, అందులో పనిచేసే సీనియర్‌ జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. అనంతరం ప్రబీర్‌ను, సంస్థ హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిని అరెస్టు చేశారు. వీరికి కోర్టు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. భారత్‌ వ్యతిరేక ప్రచారం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి భారీ మొత్తాల్లో నిధులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ తోసిపుచ్చింది. హింస, వేర్పాటువాదం, మరే విధమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తామెన్నడూ పాల్పడలేదని, తమ వార్తా కథనాల్ని చూసినా ఈ విషయం తెలుస్తుందని పేర్కొంది. చైనా నుంచి ఒక్క పైసా కూడా రాలేదని స్పష్టం చేసింది.

Spread the love