వంద రోజులు..!

 Editorial తెలంగాణ ఏర్పడిన పదేండ్ల తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 15న తన వందరోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్టానం నుండి కూడా మంచి ప్రశంసలందుకున్నారు. ప్రజలు సైతం ఈ వందరోజుల పాలన పట్ల కొంతమేర తృప్తిగానే ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని, పడిపోతుందన్న గందర గోళం మధ్య సాఫీగానే వందరోజులు దాటింది. కేసీఆర్‌ అహంకారాన్ని భరించలేక కాంగ్రెస్‌కు అధికారమిచ్చి నందుకు ప్రజలకు కొంత మేరకు ఊరట లభించిందనే చెప్పాలి. ఇక ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు జరిగితే ప్రభుత్వం ఓ మేరకు విజయం సాధిస్తుంది.
ముఖ్యంగా కేసీఆర్‌ హయాంలో ప్రగతిభవన్‌ గేట్లు మూసేసి, ముండ్ల కంచెలేసి ప్రజలకు పాలన అందనంత దూరమైంది. రేవంత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్‌ కంచెలు తొలగించి ప్రజావాణికి వేదికనేర్పాటు చేశారు. ఇన్నేండ్లకు తమగోడు వినే నాయకుడొచ్చాడని ప్రజలు సంబరపడ్డారు. అన్నట్టుగానే ప్రజాపాలనతో ఆర్జీలు స్వీకరించి ప్రజల్లో నమ్మకం కల్పించారు. అప్పులు, ఆర్థిక పరిమితులున్నా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తానన్న మాటను దాదాపుగా నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన వాగ్దానాలన్నింటినీ త్వరలోనే అమలు చేస్తారనే ప్రజలు నమ్మకంగా ఎదుచూస్తున్నారు.
అయితే ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్లో కూడా వాస్తవం ఉంది. ప్రధాన ప్రతిపక్షమైతే వందరోజుల పాలనకు వంద ప్రశ్నలు కూడా సంధించారు. ప్రతిపక్షాల ధోరణి ఎలా ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందనే నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం గొంతు చించుకొని ఎంత అరిచినా అవి రాజకీయ విభేదాలు, అక్కసుతో అన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నేర్చుకోవల్సింది ఏంటంటే తనని ఎవరూ ఓడించలేరనే అహంకారం పెరిగితే తనకు తానే పతనమవుతుందని గుర్తెరిగి నడుచుకోవాలి. అదే సమయంలో ప్రజలు కాంగ్రెస్‌కు ప్రేమతో ఓట్లు వేయలేదు. కేవలం బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతోనే గద్దెనెక్కించారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతను తమకు అను కూలంగా మలుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మిగిలిన హామీలను కూడా కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన ప్రజా సమస్యలైన నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టిపెట్టాలి. వాస్తవానికి ప్రజలు కోరుకుంది కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోరుకున్నారు. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ ఈ నెలరోజుల ప్రస్తానం తృప్తినిచ్చింది’ అంటూ తన నెల రోజుల పాలన సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ స్వేచ్ఛా, ప్రజాస్వామ్యాన్నే ప్రజలు కోరుకుంటున్నారనేది ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే ప్రగతిభవన్‌ గేట్లు తెరిచిన నాలుగోరోజే మహబూబాబాద్‌లో పేదలు వేసుకున్న గుడిసెలు పీకేసారు. తర్వాత హన్మకొండ, జగిత్యాల, కోరుట్లలో ఇదే అమానుష నిర్భంధం కొనసాగిం చారు. నిన్నగాక మొన్న జనగాం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జగిత్యాల, కోరుట్లలో అయితే పేదలకు అండగా నిలబడ్డ నాయకులపై 307(హత్యానేరం) కేసులు మోపారు.
నెలరోజుల పాటు వాళ్ళను జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటనలు చేసే ప్రాంతాల్లో ప్రతిపక్షాలను ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. మేడిగడ్డ, ఆదిలాబాద్‌ సంగారెడ్డిలో దీన్ని కండ్లారా చూశాం. ఇలా ప్రజలవైపు నిలబడే నాయకులను అరెస్టులు చేస్తే ప్రజలు హర్షించరనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అమలు చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఈ విషయంలో మాత్రం ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘ఈ వంద రోజులు ఒక ముఖ్యమంత్రిగా అద్భుతంగా పని చేశాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా రాజకీయం ఏంటో చూపిస్తాను’ అంటూ సవాల్‌ విసిరి గేట్లు తెరిచానంటూ ప్రకటించారు. అంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకొని ప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పని మొదలు పెట్టినట్టే కదా! అప్పట్లో కేసీఆర్‌ ఇదే చేశాడు. ఇప్పుడు రేవంత్‌ కూడా అదే బాట పట్టారు.
విధానాలను విభేదించి ఒకరిద్దరు తన పార్టీలోకి రావడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ ఆశలు చూపించి బేరసారాలాడి ప్రతి పక్షమే లేకుండా చేయాలని చూడడం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోదు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ప్రజలు కోరుకుంటున్న నిజమైన మార్పును చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉందని వంద రోజుల పాలన సందర్భంగా సమీక్షించు కుంటే బాగుంటుంది. వంద రోజులనేది వాస్తవంగా తక్కువ సమయమే. కానీ ప్రభుత్వ అడుగులు ఎటువైపు అనేది ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మరవకూడదు.

Spread the love