గగనతలంలో విమాన ప్రయాణికులకు భయానక అనుభవం.. ఒకరు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : గగనతలంలో విమాన ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. ఓ విమానం భారీ కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బ్రిటన్‌ రాజధాని లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్‌ తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.

Spread the love