ఒకరి నిర్లక్ష్యం.. మరొకరికి విషాదం

One's negligence.. another's tragedy– సీట్‌బెల్ట్‌, హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌..
– సాధ్యం కాని ‘యాక్సిడెంట్‌ ఫ్రీ సీటీ’ ప్రణాళిక
– పట్టించుకోని ట్రాఫిక్‌ నిబంధనలు
రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం ఓవైపు, నిబంధనలు పాటించని వాహనదారుల తీరు మరో వైపు.. ఇలా ప్రమాదాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని నగరంలోనూ అంతే తీవ్రత ఉంది. నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చిన్నారులు, వృద్ధులు రోడ్డు దాటుతున్నా పట్టించుకోకుండా వాహనదారులు దూసుకెళ్తున్నారు. మరికొందరు సిగల్స్‌ పడినా జంప్‌ చేస్తున్నారు. వీరి కారణంగా వాకింగ్‌కు వెళ్లినవారు సైతం అకారణంగా ప్రాణం కోల్పోతున్నారు. ఇలా ప్రతిరోజూ నగరంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. నగరాన్ని ‘యాక్సిడెంట్‌ ఫ్రీ సిటీ’గా తయారు చేయాలని పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. కొందరి నిర్లక్ష్యం.. మరి కొందరి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. వాహనాలు నడిపించే సమయంలో సీట్‌బెల్టు, హెల్మెట్‌ ధరించడం నామోషీగా భావించడం.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
నవతెలగాణ- సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ పరిధిలో 83.5 లక్షల వాహనాలు, 240.9కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదోఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గతేడాది 2370 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 280 మంది మృతిచెందారు. 2090 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా డివైడర్‌కు ఢకొీట్టడం లాంటివి కొన్నయితే, వాహనదారులను ఢకొీట్టినవి.. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం ఇంకొన్ని సంఘటనలున్నాయి. ఈ ఘోర సంఘటనలు స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి.
వాకింగ్‌కు వెళ్లిన పాదచారులు పలువురు మృతి
నగరంలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలంటే నానా ఇబ్బందులకు గురికావల్సిందే. దూసుకెళ్తున్న వాహనాలు ఓ వైపు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యహరించే వారు మరోవైపు.. సెల్‌ఫోన్లు, సిగల్‌ జంపింగ్స్‌ చేసే వారికారణంగా అమాయకులు ప్రాణం కోల్పోతున్నారు. గతేడాది రోడ్డు దాటుతూ 121 మంది పాదచారులు మృతిచెందిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో 23 మంది (60ఏండ్లకు పైబడి) వృద్ధులుండగా, 23 మంది యాచకులున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లివారు 18 మంది మృతిచెందగా, నగరాన్ని చూసేందుకు వచ్చిన ముగ్గురితోపాటు ఇతరులు 54 మంది ప్రమాదాలకు గురై మృతిచెందారు. ఈ ప్రమాదాలు బాధితుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి.
త్రిబుల్‌ రైడింగ్‌… రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌
డ్రైవర్ల నిర్లక్ష్యం.. కొందరు వాహనదారులు రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి ఘటనలు రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తుండటం భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు.
గతేడాది సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌లో 53456 మందితోపాటు రాంగ్‌సైట్‌ డ్రైవింగ్‌లో 523382 కేసులు నమోదయ్యాయి. సిగల్‌ జంపింగ్‌లో 65413 కేసులు నమోదుకాగా, త్రిబుల్‌ రైడింగ్‌లో 121956 కసులు, ఓవర్‌స్పీడ్‌ చేసినందుకు 76538 కేసులు నమోదు చేశారు. ఇక మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ రోడ్లపై వచ్చిన 1745 మంది పోలీసులకు పట్టుబడ్డారు.
స్పెషల్‌ డ్రైవ్‌ ఆయినా..
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరాన్ని ‘యాక్సిడెంట్‌ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు పలు ప్రాంతాల్లో డెడ్‌ స్పాట్స్‌గా గుర్తించి ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా వాహనదారులు అధిక స్పీడ్‌తో దూసుకెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
వాహనాలను నడిపించే సమయంలో సీట్‌బెల్ట్‌, హెల్మెట్‌ ధరించాలని అవగాహన కల్పించినా పాటించడం లేదు. నగరంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ డ్రైవ్‌లో సీటుబెల్టు పెట్టుకోలేని కారణంగా 18,429 కేసులు నమోదు కాగా, హెల్మెట్‌ లేనికారణంగా 18,33,761 కేసులు నమోదయ్యాయి. హెల్మెట్‌, సీటుబెల్ట్‌ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు దెబ్బలు తగిలి అనేక మంది మృతి చెందుతున్నారని ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. తప్పనిసరిగా సీటుబెల్ట్‌, హెల్మెట్‌ ధరించాలని కోరారు.

Spread the love