మణిపూర్‌లో కొనసాగుతున్న రీపోలింగ్‌ ..

నవతెలంగాణ – ఇంఫాల్‌: ఔటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానానికి  రీపోలింగ్‌  కొనసాగుతోంది.  మంగళవారం  ఉదయం 9.00 గంటల వరకు 16.68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు మంగళవారం తెలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఆరు పోలింగ్‌ కేంద్రాల్లోను ఉదయం 7 గంటలకు రీ పోలింగ్‌ ప్రారంభమైందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించామని అన్నారు. ఉక్రుల్‌ జిల్లాలోని మొత్తం ఐదు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మొత్తం 4,156 ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్‌ 26న జరిగిన రెండవ దశ ఎన్నికల్లో నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లోని ఇవిఎంలు, వివిప్యాట్‌లను దుండగులు ధ్వంసం చేయడంతో రీపోలింగ్‌ అనివార్యమైంది. ఓ పోలింగ్‌ స్టేషన్‌లోని ఇవిఎం పనిచేయలేదని, మరో పోలింగ్‌ స్టేషన్‌లో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి, ఓటర్లను బెదిరించారని అన్నారు. ఉక్రుల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నాలుగు పోలింగ్‌ స్టేషన్లు, ఉక్రుల్‌లోని చింగై అసెంబ్లీ స్థానం, సేనాపతిలోని కరోంగ్‌ స్థానంలో జీరో ఓటింగ్‌ నమోదైనట్లు గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Spread the love