ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సుప్రీంలో ఆప్‌ పిటీషన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఆమాద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారం సవాలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌ రాజ్యాంగవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239 ఎఎ ప్రకారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్న అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు చెందేలా ఎలాంటి సవరణ చేయరాదని పిటిషన్‌లో ఆప్‌ పేర్కొంది. దేశరాజధానిలోని ఐఎఎస్‌, డిఎఎన్‌ఐపిఎస్‌ అధికారుల బదిలీలు, నియామకాల అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు వర్తింపజేస్తూ మే 19న కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తెచ్చిందని పిటీషన్‌లో ఆప్‌ ఆరోపించింది. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పులో పోలీసులు, ప్రజాభద్రత, భూములు మినహా మిగిలిన అన్ని సర్వీసులను ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఈ తీర్పు ఇచ్చిన వారానికే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది. పార్లమెంటులో ఈ ఆర్డినెన్స్‌ చట్టరూపం దాల్చకుండా చేయాలని ఆప్‌ ప్రయత్నం చేస్తుంది.
ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల మద్దతూ కోరుతుంది. అలాగే, జూలై 3 నుంచి ఈ ఆర్డినెన్స్‌ ప్రతులను తగులబెట్టడం ద్వారా తమ ఆందోళనను ముందుకు తీసుకువెళ్లాలని కూడా ఆప్‌ భావిస్తుంది.

Spread the love