నోరు విప్పరేం…!

– మోడీని రప్పించేందుకే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం
– మణిపూర్‌ కోసం న్యాయ పోరాటం : కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం లోక్‌ సభలో ప్రారంభమైంది. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొరు చర్చను ప్రారంభిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చిందన్నారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్‌ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్‌ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్‌ న్యాయం కోరుతోందని తెలిపారు. మణిపూర్‌ తగులబడుతోందంటే భారత దేశం తగులబడినట్లేనన్నారు. వివిధ వర్గాల మధ్య ఇంత తీవ్రమైన విద్వేషాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాలు మణిపూర్‌లో రెండు మణిపూర్‌లను సృష్టించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల జాఢ్యం పెరిగిందని ఆరోపించారు. గంజాయి సాగు పెరుగుతోందన్నారు. పార్లమెంటులో మాట్లాడరాదనే మౌనవ్రతాన్ని ప్రధాని మోడీ చేపట్టారని, ఆ వ్రతాన్ని భగం చేయాలనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదు? దాదాపు 79 రోజుల తరువాత మాట్లాడినపుడు కేవలం 30 సెకండ్లు మాత్రమే ఎందుకు మాట్లాడారు? మణిపూర్‌ ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదు? అనే మూడు ప్రశ్నలు మోడీని అడుగుతున్నామని చెప్పారు. మణిపూర్‌ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. వైఫల్యాలను బీజేపీ అంగీకరించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడటం కోసమే మోడీ మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ తీర్మానంపై నిషికాంత్‌ దుబే, నారాయణ్‌ రణే, సునీతా దుగ్గల్‌, కిరణ్‌ రిజిజు (బీజేపీ), మనీష్‌ తివారీ (కాంగ్రెస్‌), టిఆర్‌ బాలు (డీఎంకే), సౌగత్‌ రారు (టీఎంసీ), ఎఎం ఆరీఫ్‌ (సీపీఐ(ఎం), సుప్రియా సూలే (ఎన్‌సీపీ), డింపుల్‌ యాదవ్‌ (ఎస్‌పీ), ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ (ఆర్‌ఎస్‌పీ), అరవింద్‌ గణపత్‌ సవంత్‌ (శివసేన (ఠాక్రే)), సర్దార్‌ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ (ఎస్‌ఏడీఎం), తిరుమవలవన్‌ (వీసీకే), పినాకి మిశ్రా (బీజేడీ), శ్రీకాంత్‌ షిండే (శివసేన (షిండే)), నవనీత్‌ రాణ (ఇండిపెండింట్‌ ఎంపీ) తదితరులు మాట్లాడారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబేపై కాంగ్రెస్‌ ప్రివిలేజ్‌ నోటీస్‌
లోక్‌సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబేపై కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ ప్రివిలేజ్‌ నోటీస్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై నిషికాంత్‌ దూబే ‘పూర్తి కల్పితం’ అని ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.
ఆయన పలుకే బంగారం …
చట్టసభలో పెదవి విప్పని ప్రధాని
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. అయితే ప్రధాని మోడీ 2014లో పదవిని చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఏ నాడూ చట్టసభను పెద్దగా ఖాతరు చేసిన దాఖలాలు లేవు. కీలకమైన అంశాలపై ఓ వైపు సభలో చర్చ జరుగుతుంటే ఆయన గైర్హాజరు అయిన సందర్భాలు అనేకం. పార్లమెంట్‌ కంటే ఆయనకు ప్రాధాన్యత కలిగిన విషయాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు 2021లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన 11 గంటల 33 నిమిషాల పాటు అనర్గళంగా ప్రచార సభలలో ప్రసంగిం చారు. అయితే అదే సంవత్సరం ఆయన పార్లమెంట్‌ బడ్జెట్‌, వర్షాకాల, శీతాకాల సమావేశాలకు హాజరైన మొత్తం సమయం నాలుగు గంటల కంటే తక్కువే. చట్ట సభలు ప్రజాస్వామ్యానికి దేవాలయాల వంటివని ప్రవచ నాలు చెప్పే ప్రధాని పార్లమెంటుకు హాజరైన సమయం కంటే ప్రకటనలు,ప్రచార కార్యక్రమాల్లోనే నిత్యం తలమునకలై ఉంటారు.తద్వారా తన ప్రాధాన్యతలను చాటిచెప్పారు. అయితే పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతానని మాత్రం ఆయన పలు సందర్భాల లో ప్రకటిస్తుంటారు.. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రధాని కార్యాలయం (పీఎంఓ) కేవలం 13 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పింది. అసలు ప్రశ్నించే గొంతుకలంటేనే ఆయనకు గిట్టదు. విదేశీ పర్యటనల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎన్నడూ వాటిపై సభలో ప్రకటన చేయలేదు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలూ ఇవ్వలేదు. ఏదైనా విషయంపై చర్చ జరిగినా ఆయన ఎన్నడూ జోక్యం చేసుకునే వారు కాదు. కేవలం ఒకే ఒక్క సందర్భంలో… అది కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలో మాత్రం చర్చలో భాగస్వామి అయ్యారు. ఓ ఎన్నికల ప్రచార సభలో సాధ్వి నిరంజన్‌ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పుడు స్పందించారు.
అదే మొదటి సారి…చివరిసారి కూడా.
ఇక గత ఏడు సంవత్సరాల కాలంలో చర్చ సందర్భంగా ఆయన పార్లమెంటులో పెదవి విప్పింది ఒకే ఒక్క సందర్భం లో. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు 2017 ఫిబ్రవరిలో ఆయన సమాధానం ఇచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలు జరగడానికి ముందు ప్రతిసారీ ఆయన మీడియాకు ఓ సందేశం చేర వేస్తుంటారు. ఉభయ సభలలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశా భావం వ్యక్తం చేస్తారు. కానీ ఆయన మాత్రం ఎన్నడూ ఏ చర్చలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన పాపాన పోలేదు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులే సమాధానాలు ఇస్తుంటారు. ప్రధానిని ఉద్దేశించి అడిగే ప్రశ్నలకు సైతం పీఎంఓ సహాయ మంత్రే జవాబు ఇస్తుంటారు. గడచిన ఏడు సంవ త్సరాలలో ఆయన ఒక్క పత్రికా సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సైతం ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇచ్చే వారు కాదు. తాను చెప్పింది రాసుకోవడమే పాత్రికేయుల విధి అని అనుకునే వారు. ప్రధాని అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తనను పొగిడే భజనపరులకు ఇచ్చినవే. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు అరుణ్‌ శౌరి వంటి పరిశీలకులు ఆయనది అధ్యక్ష తరహా పాలన అని అంచనా వేశారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వారి అభిప్రాయంతో ఏకీభవించక తప్పదేమో!.

Spread the love