నేడు కొనుగోలు కేంద్రాల ప్రారంభం

– మౌలిక సదుపాయాలు కల్పించాలి
 – గతంలోని సమస్యలను పునరవృత్తం కాకుండా చూడాలి
 – పక్క రాష్ట్రాల ధాన్యం కొంటే చర్యలు 
–  అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
యాసంగి దాన్యం   2023-24    కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. నేడు   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు  తెలిపారు.    2023- 24 యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై బుధవారం ఆయన జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటుచేసిన  శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు  సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద    త్రాగునీరు, నీడ  వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. ధాన్యం సగటు నాణ్యతా ప్రమాణాల ప్రకారం   తేమ, తాలుశాతం  సరిగా ఉండేలా చూసుకోవాలని,  ఈ విషయం పై కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రైతుల ద్వారానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మధ్య దళారుల ప్రమేయం ఉండరాదని, అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ నిరంతరం తనిఖీలు ఉంటాయని తెలిపారు.  నిర్వాహకులు ఒకవేళ బయటి రాష్ట్రం నుండి వచ్చే ధాన్యాన్ని   కొనుగోలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు సందర్భంలో ఏవైనా సమస్యలు  వస్తే స్థానిక తహసిల్దార్ ,ఆర్డీవోలు  పరిష్కరించడానికి  అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వం  గ్రేడ్- ఏ ధాన్యానికి రూ.  2203 రూపాయల మద్దతు ధరను, సాధారణ రకానికి రూ. 2183 మద్దతు ధర  చెల్లిస్తుందని, ఈ మద్దతు ధరల పట్టికలతో కొనుగోలు కేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి  రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.లోక సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రారంభించకూడదని అలాగే ప్రారంభంలో ప్రజా ప్రతినిధులెవరు పాల్గొనకూడదని స్పష్టం చేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి రాజకీయపరమై ఫ్లెక్సీలు ఉండకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు  జాగ్రత్తగా  ఉండాలని, లేనట్లయితే  ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద  క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని  హెచ్చరించారు.ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాలు, డిఆర్డిఏ, వ్యవసాయ, జిల్లా కో-ఆపరేటివ్, మార్కెటింగ్, తూనికలు కొలతలు, ట్రాన్స్పోర్ట్ శాఖలు సమన్వయంతో పనిచేసి  రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని  చెప్పారు.ఈ శిక్షణా కార్యక్రమంలో  జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, డిఆర్డిఏ పిడి  నాగిరెడ్డి, డిసిఓ కరుణాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా తూనికలు కొలతలు అధికారి రామకృష్ణ, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
Spread the love