హెరిటేజ్‌ సిటీగా ఓరుగల్లు

Orugallu as a heritage city– హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి
– ప్రత్యేక జోన్‌గా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రాంతం
– ముఖ్యమంత్రి రేేవంత్‌రెడ్డి వెల్లడి
– ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌
– నగరాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూ.6,115 కోట్లు అవసరం..
– అధికారులతో సమీక్ష వరంగల్‌లో సీఎం బిజీబిజీ
వరంగల్‌ నగరాన్ని హెరిటేజ్‌ సిటీగా.. హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శనివారం హన్మకొండ కలెక్టరేట్‌లో వరంగల్‌ నగరాభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 8 అంశాలపై 3 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. రింగ్‌ రోడ్డు, స్మార్ట్‌ సిటీ పనులు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం, మామునూరు ఎయిర్‌పోర్ట్‌, కాళోజీ కళాక్షేత్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై 20 రోజులకోమారు సమీక్షా సమావేశం నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు.
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో వరంగల్‌ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలందించాలన్నారు. జాతీయ రహదారికి కనెక్ట్‌ అయ్యేలా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వుండాలని సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు కనెక్టివిటీ వుండేలా రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కాళోజీ కళాక్షేత్రం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌ 2050 వరకు డిజైన్‌ చేయాలన్నారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశిం చారు. తాగునీరు లైన్స్‌ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక లు రూపొందించాలని కోరారు. నాలాల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని చెప్పారు. వరంగల్‌లో డంపింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. రింగు రోడ్డు నిర్మాణంపై హన్మకొండ కలెక్టర్‌ పి.ప్రావీణ్య పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రెండు దశల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగు రోడ్డు నిర్మాణానికి మొదట సత్వరమే భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాతే నిర్మాణ పనులు చేయాలన్నారు.
నగరాభివృద్ధికి రూ.6,115 కోట్లు అవసరం..
వరంగల్‌ నగరాభివృద్ధికి రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసినట్టు సీఎం చెప్పారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల యూనిఫామ్‌లను మహిళా సంఘాలే తయారు చేసేలా బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. వరంగల్‌ నగర ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. నాలాల్లో పూడికను ఎప్పటికప్పుడూ తొలగించాలని చెప్పారు. హైదరాబాద్‌లో చేపడుతు న్న కొత్త పద్ధతులను వరంగల్‌లోనూ ప్రయోగించా లని సూచించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలుంటే వెంటనే తొలగించాలన్నారు. నీలోఫర్‌ ఆస్పత్రి లాగా ఇక్కడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఆపరేషన్లు, వైద్యసేవలకు సంబంధించి ‘నిమ్స్‌’లో ఎన్‌ఓసీలు ఇచ్చినట్టుగానే ఎంజిఎం ఆస్పత్రిలోనూ ఎన్‌ఓసీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు, వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి తగిన పారితోషికం అందిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా ఏర్పాటు చేయాలన్నారు.
రాజకీయ ప్రేరేపిత బదిలీలుండవు..
సమర్థత ఆధారంగానే బదిలీలు ఉంటాయని.. రాజకీయ ప్రేరేపిత బదిలీలుండవని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సారధ్యంలో త్వరలోనే మళ్లీ సమావేశం నిర్వహించు కొని వరంగల్‌ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ప్రస్తుతం సమీక్షను ప్రాథమికంగానే నిర్వహించానని, 45 రోజులకు వచ్చి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
సెప్టెంబర్‌ 9 నాటికి కాళోజీ కళాక్షేత్రం పూర్తి
హన్మకొండలో నిర్మిస్తున్న కాళోజీ కళా క్షేత్రాన్ని సెప్టెంబర్‌ 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ పనులకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలిపారు. ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు.
రూ.518.71 కోట్ల చెక్కుల పంపిణీ
స్వశక్తి మహిళలకు రూ.518.71 కోట్ల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీ చేశారు. సమీక్షా సమావేశానికి ముందు హన్మకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, చీఫ్‌ సెక్రటరీ శాంతికుమార్‌, డీజీపీ రవి గుప్తా, విప్‌ డాక్టర్‌ రామచంద్రునాయక్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీలు డాక్టర్‌ కడియం కావ్య, పోరిక బలరాంనాయక్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్‌ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి, వరంగల్‌, హన్మకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్‌ సత్య శారద, పి.ప్రావీణ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love