నవ తెలంగాణ – గరిడేపల్లి
నవతెలంగాణ సంగారెడ్డి జిల్లా అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పగడాల మానస సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని తన నివాసంలో చనిపోయింది. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మానస భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం ఆమె అత్తగారి నివాసమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి తీసుకొచ్చారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. పగడాల మానస విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశారు. కొన్నేండ్లుగా మానస నవతెలంగాణలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో పనిచేసింది. మానస మాజీ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య సతీమణి. ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. మానస అకాల మరణం పట్ల నవతెలంగాణ సంగారెడ్డి జిల్లా కార్యాలయం సిబ్బంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన పలువురు నాయకులు ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల నవతెలంగాణ ఎడిటర్ ఆర్. సుధాభాస్కర్, సీజీఎం పి. ప్రభాకర్ సంతాపం తెలియజేశారు.