– ప్రారంభమైన లీఫ్ అండ్ సాయిల్ టెస్ట్ ప్రక్రియ
– 23 మంది రైతుల తోటల్లో నమూనాల సేకరణ
– 15 రోజుల్లో రానున్న నివేదిక
నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ రైతులు ఎన్నాళ్లుగానో కోరుతున్న లీఫ్ అండ్ సాయిల్ టెస్ట్ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. పామాయిల్ తోటల్లో చీడపీడల సమస్యలు, పోషక లోపాలు, గెలల అల్ప దిగుబడులకు గల కారణాలను శాస్త్రీయంగా గుర్తించి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఆయిల్ ఫెడ్ చేపట్టిన చర్యలు కార్యరూపం దాల్చాయి. ఈ మేరకు ఆయిల్ ఫెడ్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తో ఒప్పందం కుదుర్చుకోగా, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని 23 మంది రైతులకు చెందిన సుమారు 200 ఎకరాల పామాయిల్ తోటల నుంచి మట్టి, ఆకుల నమూనాలను సేకరించారు.
గురువారం రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ మేనేజర్ వీరాస్వామి సేకరించిన నమూనాలను సంగారెడ్డిలోని ఎస్‌టీఆర్‌సీ (సాయిల్ టెస్టింగ్ రిసోర్స్ సెంటర్)కు పంపేందుకు శాస్త్రీయ విధానంలో సిద్ధం చేశారు. పరీక్షల అనంతరం సుమారు 15 రోజుల్లో ఫలితాలను సంబంధిత రైతుల మొబైల్ ఫోన్ నంబర్లకు పంపించనున్నట్లు వీరాస్వామి తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా రైతులు ఎరువుల వినియోగం, పోషక నిర్వహణ, చీడపీడల నివారణ చర్యలను శాస్త్రీయంగా అమలు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.



