జ్ఞానాన్ని పెంచేందుకు సహనం సహకరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సహనం అనేది మన స్థితప్రజ్ఞకు సూచికగా చెప్పవచ్చు. ఎక్కడ సహనం ఉంటుందో అక్కడ మేధా వికాసం ఉంటుంది. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే మహామహులంతా తమ నడవడిలలో సహనాన్ని, వినయాన్ని ప్రదర్శించినవారే. ఈ గుణాలు విజేతల లక్షణాలని పెద్దలు చెబుతారు. సహనం ఒక నిగ్రహశక్తి. మానసిక పరిపక్వత గల స్థితి. ఈ గుణం కలిగినవారు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవలీలగా ఎదుర్కొంటారు.
సహనం మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆవేశపడకుండా ఆపుతుంది. మనిషిని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సహనం ఓ అమూల్యమైన సంపద. అందుకే ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ప్రతి మనిషికీ తన దైనందిక వ్యవహారాల్లో ఎన్నో గడ్డు సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కోవడం ముఖ్యం.
భగత్‌సింగ్‌ను చూడండి. ఉరకలెత్తే యువ నెత్తురు ప్రవహిస్తున్న వయసులో దేశం కోసం తపించాడు. మనల్ని బానిసలుగా చూస్తున్న బ్రిటిష్ వాళ్లను దేశం నుండి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యాడు. వాళ్లు హింసాపాతం సృష్టిస్తున్నా ఎంతో సహనంతో మన స్వరాన్ని వారికి వినిపించాలని చూశాడే కానీ వారి చావుని కోరుకోలేదు. అందుకే పార్లమెంటులో పొగబాంబు వేసి మన డిమాండ్లు వాళ్లకు తెలిసేలా చేశాడు. చివరకు ఉరికంబమెక్కాడు. అయినా తన సహనాన్ని కోల్పోలేదు. ప్రాణం పోతున్నా చిరునవ్వులు చిందిస్తూ తన ఆశయ సాధనను తర్వాతి తరానికి అప్పగించిపొయ్యాడు. ఈ సహనంతో కూడిన సాహసమే అతన్ని చరిత్రలో ఓ మహనీయుడిని చేసింది. కనుక సహనం పాటించి స్థితి ప్రజ్ఞతతో వ్యవహరిస్తే విజయం మన వెంటే ఉంటుంది.
నిజానికి సహనం ప్రకృతి సహజం. అయితే సహనాన్ని కీలకమైన సమయంలో కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే సహనంతో ఉండాలని మన పెద్దలు హితబోధ చేస్తుంటారు. అసహనం వల్ల క్షణికావేశం కలుగుతుంది. క్షణికావేశం వల్లే ఎన్నో అవాంఛిత సంఘటనలు జరుగుతాయి. అవేశ కావేశాలు మనిషి నాశనానికి కారణమైతే… సహనం, శాంతం.. మనిషిని అత్యున్నత స్థితికి చేరుస్తాయి. మన లక్ష్యం సాధించాలన్నపుడు మనో నిబ్బరం కోల్పోకుండా ధైర్యస్థైర్యాలు కనబరచడం, నిదానంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం కూడా సహనమే. అలాంటి సహనమే సత్ఫలితాలను ఇస్తుంది. ఆశించింది లభించకపోతే సహనం కోల్పోవడం కొందరి నైజం. ఇది తిరోగమనానికి సంకేతం. ఓర్పు వహించి నేర్పుతో ప్రయత్నిస్తే కోరుకున్న ఫలితాలు తప్పక లభిస్తాయి. అటువంటి మనో నిబ్బరాన్ని ఆనాడు ప్రదర్శించాడు కాబట్టే భగత్‌సింగ్ తన మరణించినా దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించగలిగాడు.
సహనం మనుషులను గొప్పవాళ్లను చేస్తుంది. సామాన్యులను మహనీయులను చేస్తుంది. నిజం ఏమిటో మనకు చూపిస్తుంది. మనిషిని చరిత్రలో నిలబెడుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహనంతో ఎదుర్కోవాలి. అప్పుడే విజయం దానంతట అదే మనల్ని వరిస్తుంది. అందుకే ఈ విలువైన సహన గుణం ఎవరికైనా ఆభరణం వంటిదని పెద్దలు అంటుంటారు. ఒకవేళ హనాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తే మనలో మనమే నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా కీలక సమయాల్లో మన మాటకు ఎవరన్నా తగిన ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. సహనం హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తే వెంటనే పది నుంచి ఒకటి వరకు అంకెలు లెక్కిస్తే కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.