పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాలి

పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాలి– మంత్రి పొన్నం, కోదండరామ్‌కు టీఎన్జీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు భత్యం (డీఏ)లను విడుదల చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను చెల్లించాలని కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. డీఏల విడుదలకు సహకరిస్తామన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, గోవర్ధన్‌రెడ్డి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love