పెండింగ్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Pending fee reimbursement should be released– సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలల యాజమాన్యాలు
– స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి రూ.5,177 కోట్లు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు
– రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ‘ఫీజు దీక్ష’
నవతెలంగాణ-కాప్రా/ విలేకరులు
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణం విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘ఫీజు దీక్ష’ చేపట్టారు. అందులో భాగంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో ఫీజు దీక్షను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్‌ సంతోష్‌ ప్రారంభించారు. అనంతరం దీక్ష ముగింపులో టి.నాగరాజు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దాదాపు రూ. 5,177 కోట్లను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నాలుగు డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల దీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. బడుగు బలహీన తరగతుల విద్యార్థుల కోసం అడిగింది ఇస్తామని చెప్పి కేసీఆర్‌ సర్కార్‌ మోసం చేసిందన్నారు. చదువు పూర్తయినా విద్యార్థుల సర్టిఫికెట్లను కార్పొరేట్‌, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, ఫీజు డబ్బులు మొత్తం కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల్లో సర్టిఫికెట్లను వెంటనే విద్యార్థులకు ఇచ్చేటట్టు జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం నాయకులను దీక్ష విరమింపజేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పరాల నరేష్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర అశోక్‌, జె.చంద్రశేఖర్‌ ఫీజు దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఫీజుల దీక్షకు దాదాపు పది కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, అరుణ్‌, నాయకులు భగత్‌, కార్తిక్‌, శివ, శ్యామ్‌, అనిల్‌, శివ, భాస్కర్‌, రామ్‌ చరణ్‌ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫీజు దీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాయికాడి శంకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,177 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. వీరి దీక్షకు డీవైఎఫ్‌ఐ, ఎమ్మార్పీఎస్‌ సంఘాలు మద్దతు తెలిపాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌ దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఫీజు దీక్ష నిర్వహించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ దీక్షకు పీడీఎస్‌యూ నాయకులు మారుతీ, సీతారాం, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు సురేష్‌, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్‌ మద్దతు తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌ ఎదుట టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం రాజేందర్‌ మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా స్కాలర్‌షిప్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్‌, నాయకులు సునీల్‌ సంఘీభావం తెలిపారు. హనుమకొండ సుబేదారి ఆర్ట్స్‌ కాలేజీ వద్ద, జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో ఫీజు దీక్ష చేపట్టారు.

Spread the love