ఇండ్ల పక్కనే చెత్త..ఇబ్బందుల్లో ప్రజలు

– పందుల స్వైరవిహారంతో తప్పని కష్టాలు
– పట్టింపులేని మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-కీసర
ఇండ్ల పక్కనే చెత్త వేయడంతో ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ చెత్తతో పాటు పందుల స్వైర విహారంతో సమీప కాలనీల ప్రజలు గత కొన్ని నెలలుగా రోగాల బారిన పడుతున్నారు. అయినా నాగారం మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. నాగారం మున్సిపాలిటీ, రాంపల్లి గ్రామంలోని హనుమాన్‌ నగర్‌కాలనీ లో రోడ్డు పక్కనే ప్రజలు చెత్తను వేస్తుండటం తో సమీప ప్రజలు చెత్త దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. చెత్త ఇక్కడ వేయొద్దని మున్సిపల్‌ అధికారులు బోర్డు ఏర్పాటు చేసిన ఎవరూ పట్టించుకోకుండా యధేచ్ఛగా చెత్తను వేస్తున్నారు. చెత్త సమీపం లో కంప చెట్లు ఎక్కువగా ఉండటంతో పందులు స్వైర విహారం చేయడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వినాయకుడి గుడి నుంచి ముందు కాలనీలకు వెళ్లేవారు ఆ రోడ్డుగుండా వెళ్లాలంటేనే ముఖాలకు అడ్డుగా కర్చీఫ్‌ పెట్టుకుంటూ నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగారం మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో తమ సమస్యను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త, పందుల సమస్యను మున్సిపల్‌ అధికారులు పరిష్కరించక పోతే జిల్లా కలెక్టర్‌ దష్టి తీసుకెళ్తామని ప్రజలు తెలిపారు.

చెత్త, పందుల సమస్యతో నిత్యం ఇబ్బందులు పడుతున్నాం
ప్రతీ రోజు ఇక్కడ కొందరు వ్యక్తులు చెత్త వేస్తుండటంతో చాలా దుర్వాసన వస్తుంది. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. వర్షం వస్తే చెత్త వాసన మరింతగా పెరిగిపోతుంది. పందులు పెద్ద ఎత్తున్న చెత్తలో బోర్లుతూ ఉండటంతో దుర్వాసన ఎక్కువ అవుతుంది. సమస్యను పరిష్కరించాలని పలు మార్లు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
-తరిగొప్పుల సురేందర్‌ , స్థానికులు

Spread the love