వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 
– జంపన్నవాగు, ముంపు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు
నవతెలంగాణ -తాడ్వాయి 
వర్షాల పట్ల ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం మేడారం, చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగు ఉదృతి, ముంపు గ్రామాలను పర్యటించారు. పడిగాపూర్, ఎల్బాక గ్రామాల ప్రజలు ఈ వర్షాకాలం ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్రాస్ వద్ద జంపన్న వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. మేడారంలోని ఆర్ అండ్ బి, ఐడిబిఐ గెస్ట్ హౌస్ లో ఇటీవల భారీ వర్షాల కారణంగా నీరు చేరి పాడైపోయిన ఫర్నిచర్ ఎలక్ట్రిసిటీ వస్తువులను పరిశీలించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాటి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మేడారం జంపన్నవాగు ముంపు ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. మేడారం జంపన్నవాగు ఉధృతి ఏ సమయంలోనైనా పెరిగే ప్రమాదం ఉందన్నారు. జంపన్నవాగు పరిసరాల్లోని వ్యాపారులను, గ్రామస్తులను అప్రమత్తం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.వీరి వెంట జిల్లా వైద్యాధికారి, మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, డిపిఓ వెంకయ్య, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఎంపిడిఓ సత్యాంజనేయ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ సురేష్ బాబు, ఎంపీఓ జాల శ్రీధర్, ప్రోటోకాల్ అధికారి బొప్ప సమ్మయ్య, మేడారం పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సతీష్, జూనియర్ అసిస్టెంట్లు చంద ప్రవీణ్, జనగాం సాంబశివరావు, ఆర్‌ఐ సునీల్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love