Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫార్మాసిటీ భూ సేకరణ చట్ట వ్యతిరేకం

ఫార్మాసిటీ భూ సేకరణ చట్ట వ్యతిరేకం

- Advertisement -

రైతుల ఉద్యమాన్ని
అణచి వేస్తున్న ప్రభుత్వం

2013 చట్టానికి వ్యతిరేకంగా భూ సేకరణ
రైతులపై పోలీసుల దౌర్జన్యం ఆపాలి
నాలుగు గ్రామాల ప్రజల జీవితాలతో చెలగాటం
జీవనోపాధి కల్పించే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
తాడిపర్తిలో టీపీజేఏసీ అభిప్రాయ సేకరణలో వక్తలు
భూములిచ్చేది లేదని తేల్చి చెప్పిన రైతులు


నవతెలంగాణ-యాచారం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నాలుగు గ్రామాల్లో ఫార్మాసిటీ పేరుతో జరిగిన భూసేకరణ అంతా చట్ట వ్యతిరేకమేనని సీనియర్ అడ్వకేట్ వి.రఘునాథ్, మానవ హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యులు ఎస్.జీవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ వి.వసంత లక్ష్మి, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురంపల్లి సుజాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్, రిటైర్డ్ తహసీల్దార్‌ వి.బాలరాజ్ అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని తాడిపర్తిలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ భూ సేకరణ సమస్యలపై ప్రజా అభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీజేఏసీ కో-కన్వీనర్గా కన్నెగంటి రవి వ్యవహరించారు. రైతుల పోరాటానికి ఏఐసీసీ కమిటీ సభ్యుడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీధర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఫార్మాసిటీ భూ సేకరణలో జరుగుతున్న అక్రమాలు, పోలీసుల దౌర్జన్యాల గురించి రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘మా భూమి మాకే కావాలి.. ఫార్మాసిటీ -ప్యూచర్‌ సిటీ వద్దు’ అంటూ స్పష్టం చేశారు. తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు ఇష్టారాజ్యంగా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదులుకోబోమని తేల్చిచెప్పారు.

తాము ఎన్ని ఏండ్ల నుంచి సాగులో ఉన్నాయో.. తామ వాస్తవిక పరిస్థితులు ఏమిటో.. తాము ఆ భూములు కోల్పోతే ఏ విధంగా నష్టపోతామో.. తదితర విషయాలు టీపీజేఏసీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫార్మాసిటీ భూ సేకరణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణలో రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా భూములు లాక్కున్నారని విమర్శించారు. 2013 భూ చట్టానికి వ్యతిరేకంగా ఫార్మాసిటీలో భూసేకరణ జరిగిందని తెలిపారు. ఉపాధి లేనప్పుడు ఫ్యూచర్ సిటీలు, ఫార్మాసిటీలు ఎందుకని ప్రశ్నించారు. రైతులపై పోలీసుల దౌర్జన్యం ఆపాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూసేకరణ అంతా ఒక ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఆరోపించారు. ఈ సిటీ, ఆ సిటీ అని ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని అన్నారు. అధికారులంతా కోర్టు ధిక్కరణకు పాల్పడి రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుంటున్నారని విమర్శించారు.

సస్యశ్యామలమైన పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు. రైతుల తరఫున అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించి వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఏదేమైనా ఫార్మాసిటీకి భూములు వదులుకునేందుకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టంచేశారు. రైతుల అభిప్రాయాలను రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి ప్రజల గొంతుకగా వినిపిస్తామని ‌తెలిపారు. పాలకులు వ్యవసాయాన్ని ప్రోత్సాహించాలనే తప్పా పంట పొలాల్లో విధ్వంసం సృష్టించొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కుందారపు నారాయణ, ఉద్యమ నాయకురాలు కవుల సరస్వతి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కానమోని గణేష్, లక్ష్మారెడ్డి, మైపాల్ రెడ్డి, సందీప్ రెడ్డి, నాయకులు యుగేందర్ రెడ్డి, శ్రీకాంత్ నాయక్, నిరంజన్, సర్పంచ్‌‌లు నీలం ఝాన్నీ, నీలం శ్రీవిద్య, సంగెం చైతన్య, రైతు బలవంత్‌‌రెడ్డి, వివిధ గ్రామాల రైతులు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -