ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్‌ !

Phones of opposition leaders hacked!– కేంద్రంపై పలువురు ఎంపీల ధ్వజం
– మోడీని బహిరంగంగా విమర్శించేవారే లక్ష్యమంటున్న నేతలు
– వివరణ ఇచ్చిన యాపిల్‌ …దర్యాప్తు మొదలెట్టామన్న కేంద్రం
న్యూఢిల్లీ :
జర్నలిస్టులు, ఇండియా ఫోరం నేతల ఫోన్లు హ్యాక్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ పలువురు నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు తమకు యాపిల్‌ కంపెనీ నుండి అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చాయని వారు తెలిపారు. ”మీ ఐ ఫోన్లు హ్యాక్‌ అయే ముప్పును ఎదుర్కొంటు న్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఐ ఫోన్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ ఫోన్లోని సున్నితమైన సమాచారంతో పాటూ కమ్యూనికేషన్లు, కెమెరా, మైక్రోఫోన్‌ వంటివన్నీ వారి అధీనంలోకి వెళ్ళే అవకాశం వుంది.” అన్నది ఆ హెచ్చరికల సారాంశంగా వుంది. దయచేసి ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించాలంటూ ఆ అలర్డ్‌ మెసేజ్‌ కోరుతోంది. దేశంలో ఒకే సమయానికి (అక్టోబరు 30, 11.45 పీఎం) ఐదుగురు వ్యక్తులకు ఇలాంటి అలర్ట్‌ వచ్చింది.
ఫోన్లకు ఇలాంటి హెచ్చరికలు వచ్చిన వారిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, కె.సి.వేణుగోపాల్‌, శశిథరూర్‌, రేవంత్‌ రెడ్డి (కాంగ్రెస్‌), కె.టి.రామారావు(బీఆర్‌ఎస్‌), అసదుద్దీన్‌ ఓవైసీ, సిద్ధార్ద్‌ వరదరాజన్‌ (ది వైర్‌ వ్యవస్థాపక సంపాదకులు), శ్రీరామ్‌ కర్రి (డక్కన్‌ క్రానికల్‌ రెసిడెంట్‌ ఎడిటర్‌), రేవతి (ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌), మహువా మొయిత్రా (తృణమూల్‌), ప్రియాంక చతుర్వేది (శివసేన యూబీటీ) పవన్‌ ఖెరా (కాంగ్రెస్‌), రాహుల్‌ గాంధీ కార్యాలయంలో పనిచేసే పలువురు వున్నారు. దాదాపు 20మంది నేతలు, జర్నలిస్టులు తమకు యాపిల్‌ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయని ధ్రువీకరించారు. ఆ స్క్రీన్‌ షాట్‌లను వారు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తమ ఫోన్లను కేంద్రం హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోం దంటూ వారు తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించేవారే ఈ హెచ్చరికలు అందుకున్న వారిలో వున్నారు.
దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పత్రికా సమావేశం పెట్టి మాట్లాడారు. అదానీకి కేంద్ర ప్రభుత్వం అమ్ముడైపోయిందన్న విషయం దాచి పెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని విమర్శించారు. ‘మీకు కావాల్సినదంతా హ్యాక్‌ చేసుకోండి.’ అని ఆయన అన్నారు. ‘అయితే మిమ్మల్ని ప్రశ్నించడం మాత్రం మేం ఆపేది లేదు.’ అని స్పష్టం చేశారు. కుల గణన నిర్వహించాలంటూ వస్తున్న డిమాండ్ల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు.
యాపిల్‌ వివరణ
ఈ వివాదంపై యాపిల్‌ స్పందిస్తూ ఒక వివరణ ఇచ్చింది. ఈ హెచ్చరిక నోటిఫికేషన్లను అధికారికం గా పనిచేసే ఏ నిర్దిష్ట హ్యాకర్‌కు యాపిల్‌ ఆపాదించ లేదని తెలిపింది. భారత ప్రభుత్వం ఇందుకు బాధ్యురాలని తాము ప్రత్యేకంగా చెప్పలేదని స్పష్టం చేసింది. అధికారికంగా పనిచేసే హ్యాకర్లు చాలా నైపుణ్యంతో, అత్యంత అధునాతన రీతుల్లో పని చేస్తారు. వారు దాడులు చేసే తీరు కూడా ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ వుంటారు. ఇటువంటి దాడులను గుర్తించడమనేది ముప్పుకు సంబంధిం చిన ఇంటెలిజెన్స్‌ సంకేతాలపై ఆధారపడి వుంటు ంది. ఆ సంకేతాలు తరచుగా తప్పుగా, అసంపూర్ణం గా వుంటాయి. ఆపిల్‌ నోటిఫికేషన్లు కూడా నకిలీవి కావచ్చు లేదా కొన్నింటిని గుర్తించలేకపోవచ్చు, ఈ అలర్డ్‌ మెసేజ్‌లు జారీ చేయడానికి గల కారణా లేంటనే సమాచారం మేం ఇవ్వలేం. దానివల్ల హ్యాకర్లు భవిష్యత్తులో తమను గుర్తు పట్టకుండా తమ తీరును మార్చుకోవచ్చు,” అని పేర్కొంటూ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ అలర్ట్‌ల గురించి కేంద్ర ప్రభుత్వం తమను అడిగిందా లేదా అని ప్రశ్నించగా దానిపై యాపిల్‌ స్పందించలేదు. ఇటువంటి అలర్ట్‌ లు 150దేశాల్లోని వారికి వచ్చాయని తెలిపింది.
దర్యాప్తు చేపట్టాం : కేంద్రం
యాపిల్‌ ఫోన్లకు వచ్చిన హెచ్చరికలపై కేంద్రం దర్యాప్తు చేపట్టిందని సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్‌ భోపాల్‌లో విలేకర్లకు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోందని చెప్పారు.
ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించేందుకే వున్న విమర్శకులతో ప్రతి రోజూ తెల్లారుతోంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ దేశం అభివృద్ధి చెందుతుంటే చూడలేరని అన్నారు. యాపిల్‌ నోటిఫికేషన్లు నిర్దిష్టంగా లేవని, అస్పష్టంగా వున్నాయని అన్నారు. అసలు యాపిల్‌ ఫోన్లు భద్రత కలిగినవా కాదా అని నిర్ధారించు కోవాల్సి వుందని వ్యాఖ్యానించారు.
పౌరుల గోప్యత, భద్రతను పరిరక్షించడంలో భారత ప్రభుత్వం తన పాత్రనున సమర్ధవంతంగా పోషిస్తుందని చెప్పారు. ఈ అలర్ట్‌ మెసేజ్‌లకు సంబంధించిన వాస్తవిక, కచ్చిత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తులో తమతో చేతులు కలపాల్సిందిగా యాపిల్‌ను కోరినట్లు చెప్పారు.
సీరియస్‌గా తీసుకోవాల్సిందే : ఐఎఫ్‌ఎఫ్‌
”యాపిల్‌ నుండి వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్ల ను చాలా సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. దీనికి మూలం ఏమిటో నిర్ధారిం చాల్సి వుందని ఇంటర్‌నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) పాలసీ డైరెక్టర్‌ ప్రతీక్‌ వాఘ్రే, వైర్‌తో వ్యాఖ్యానించారు. భారతీయులు ముఖ్యంగా జర్న లిస్టులు, పార్లమెంటేరియన్లు, రాజ్యాంగ పదవుల్లో వున్నవారు గతంలో కూడా పెగాసస్‌తో లక్ష్యం చేసు కోబడ్డారు. ఈ నేపథ్యంలో ఇది మన ప్రజాస్వామ్యా నికి తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. ఐఎఫ్‌ఎప్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ అపర్‌ గుప్తా ఎక్స్‌లో పోస్ట్‌ పెడుతూ వీటిని తప్పుడు అలారమ్‌ లుగా ఎందుకు పరిగణించలేమో వివరించే ప్రయత్నం చేశారు.
రజాస్వామ్య విధ్వంసం- ప్రధాని మోడీకి ఏచూరి లేఖ
భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిన చేసి ప్రధాని నరేంద్ర మోడీ పదవిని చేపట్టారని, కానీ తాజా హ్యాకింగ్‌ వ్యవహారంతో ప్రజాస్వామ్యాన్ని, పౌరుల ప్రజాస్వామ్య హక్కులను దారుణంగా ధ్వంసం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని యాపిల్‌ సంస్థ నుండి వచ్చిన అలర్ట్‌ల నేపథ్యంలో ఏచూరి ప్రధాని మోడీకి లేఖ రాశారు. తనకు వచ్చిన అలర్ట్‌ మెసేజ్‌ను కూడా ఆ లేఖతో జత చేసి పంపారు. తన ఫోన్‌ను హ్యాక్‌  చేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారంటూ సోమవారం రాత్రి తనకు అలర్ట్‌ మెసేజ్‌ వచ్చిందని ఏచూరి ఆ లేఖలో తెలిపారు. పౌరులందరికీ భారత ప్రభుత్వం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ఇది ఘోరంగా ఉల్లంఘించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. నిఘా అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధ మని అన్నారు. తన పని, కార్యకలాపాలనేవి తెరిచిన పుస్తకం వంటివని, అందులో దాచిపెట్టడానికి ఏమీ లేదన్నారు. అందువల్ల ఇలాంటి నిఘా, తాను ఉపయోగించే ఫోన్‌ను యాక్సెస్‌ చేసేందుకు ప్రయత్నించడం ఇవన్నీ చూస్తుంటే తన ఫోన్లో ఏదో సమాచారాన్ని పెట్టి ఆ కల్పిత సమాచారం ప్రాతిపదికన తనను ఇరికించడానికి ప్రయత్నించా లన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా వుందని భావించాల్సి వస్తోందని అన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దారుణంగా దుర్వినియోగం చేస్తోందని, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దీనికి కూడా అవకాశాలు వున్నాయన్నది వాస్తవమని అన్నారు. మొత్తంగా ఈ అంశంపై ప్రభుత్వ స్పందనను తెలుసుకోవాలని భావిస్తున్నానన్నారు.

Spread the love