నవతెలంగాణ-ఆలేరు టౌను
పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తూ ఇంటి పరిసరాలలో, పొలం గట్ల వద్ద మొక్కలు నాటాలని, ఆలేరు మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఒకటో వార్డులో మొక్కలు పంపిణీ చేశారు. భూమిని కాలుష్య రహితంగా మార్చడానికి, భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వార్డులో మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి మౌనిక హరీష్ మొక్కలు నాటారు.
కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి వృక్షాలుగా మారే వరకు నీరు పోసి, ట్రీగార్డులు ఏర్పాటు చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పచ్చని చెట్లతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలలో మొక్కలు నాటాలని కోరారు. ఆలేరు మున్సిపాలిటీని పచ్చదనంతో మరియు ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు వార్డు ప్రజలు, కాలనీ సంఘాలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, యువతీ యువకులు పాల్గొన్నారు.



