న్యూఢిల్లీ : కోవిడ్ కోసం తాము రూపొందించిన వ్యాక్సిన్ కొవిషీల్డ్ కారణంగా ప్లేట్‌లెట్‌ల సంఖ్య పడిపోవడం, రక్తం గడ్డ కట్టడం వంటివి సంభవించే అవకాశాలు వున్నాయని ఈ వ్యాక్సిన్ తయారీ సంస్థ, అంతర్జాతీయ ఔషధ రంగ దిగ్గజ కంపెనీ ఆస్ట్రాజెనికా అంగీకరించింది. అయితే అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఇవి చోటు చేసుకుంటాయని తెలిపింది. థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసిటోపెనియా సిండ్రోమ్ (టిటిఎస్)గా పిలిచ్చే వైద్య పరిస్థితికి తమ వ్యాక్సిన్‌కు సంబంధముందని కంపెనీ తొలిసారిగా అంగీకరించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఫార్ములాను పూనే కేంద్రంగా పనిచేసే వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కి అందచేశారు. దాంతో భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 174కోట్ల డోసులకు పైగా వేశారు. వ్యాక్సిన్లు వేసిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశం హఠాత్తుగా తెర మీదకు రావడానికి కారణం ఆస్ట్రాజెనికా కంపెనీ ఈ విషయాన్ని అంగీకరిస్తూ కోర్టుకు పత్రాలు అందచేయడమే. ఇద్దరు పిల్లల తండ్రి అయిన జేమీ స్కాట్ ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2021 ఏప్రిల్‌లో తనకు బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని, దాంతో రక్తస్రావం జరిగి శాశ్వతంగా మెదడులో కొంత భాగం గాయపడిందని, దాంతో పనేమీ చేయలేకపోతు న్నానని ఫిర్యాదు చేస్తూ కోర్టుకు వెళ్లారు. బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ ఈ కేసును వివరిస్తూ లండన్ హైకోర్టులో ఇటువంటివి 51 కేసులు నమోదయ్యా యని తెలిపింది. వారు కంపెనీ నుండి నష్టరిహారాన్ని కోరుతూ కేసులు వేశారని పేర్కొంది. ఆ కేసుల విచారణ సందర్భంగా కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. అయితే, పది లక్షల కేసుల్లో నలుగురికి ఇలా సంభవించే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈవ్యాక్సిన్లు వేయడానికి ముందుగా అంటే 2021 జనవరిలో భారత ప్రభుత్వం కూడా ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. తక్కువ ప్లేట్‌లెట్‌ల సంఖ్య వుండేవారికి అత్యంత జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుంటుందని నిర్దిష్టంగా చెప్పింది.