చౌహాన్ రాసిన తొలి కవితాసంపుటం సంగారాభేరి. ఆయనలోని ఓర్పు, సహనం, మాట తీరులానే ఆయన కవిత్వం ఉంది. అందువల్ల ఆయన జీవితంపైనా కవిత్వంపైనా ప్రేమ కలిగింది. ఏ మూలాల నుంచి వచ్చాడో వాటిని మరిచిపోని జీవన స్పృహతో, చైతన్యంతో తన జాతి అస్తిత్వాన్ని కాపాడు కోవాలన్న భావనతోనే ఈ సంగారాభేరిని తెస్తున్నందుకు మరోమారు నా అభినందన. చౌహాన్ అసలు పేరు ముడావత్ లోకేందర్. కిషన్, సాలి ఆయన అమ్మానాన్నలు. రంగారెడ్డి జిల్లాలోని కొలికి రాళ్ళ తండా(జొన్న రాసి తండా)లో జన్మించాడు. పట్టుదలతో చదువుకుని తన మూలాలను మరిచి పోకుండా ద్రావిడ ఆది విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నాడు. మొగ్గలు, నానీలు, హైకూలు కొన్ని రాశాడు. బాలల కథలు రాశాడు. వివిధ సెమినార్లలో పరిశోధనా పత్రాలు సమర్పించాడు. కొన్ని పురస్కారాలు అందుకున్నాడు. అధ్యయనాన్ని విస్తృత పరుచుకుంటూనే ఆదివాసులు, గిరిజన జాతుల అస్తిత్వ సాహిత్యం కోసం చౌహాన్ నిత్య చైతన్యంతో అడుగుతీసి అడుగు వేస్తున్నాడు.
చౌహాన్ నంగారాభేరి కవితా సంపుటిలోని ప్రధాన వస్తుసారం తండా ప్రజల్లో ఆవహించిన జీవన దైన్యాన్నీ నైరాశ్యాన్ని గుర్తించాడు. ఆకలి, అప్పులు, వలసలను తనదైన కోణంతో అర్ధం చేసుకున్నాడు. సరైన విద్య, వైద్యం, ఉద్యోగం లేక పోవడమే కాక ఆర్ధికంగా బడుగు బతుకును అనుభవిస్తున్న తన జాతి జనులను మేల్కొల్పడానికి చైతన్య పరచడానికి ఒక దృష్టిని, దృక్పథాన్ని అర్ధం చేసుకునే విధంగా ఈ సంపుటిలో చాల కవితలు రాశాడు. తండా ప్రజల జీవనం, సంస్కృతి, జీవన విశ్వాసాలు ఎలా పరాయీకరణకు గురవుతున్నాయో ఎత్తి చూపిన కవి చౌహాన్. వర్తమాన ఆర్థిక పీడన, రాజకీయ పీడన, ధ్వంసమవుతున్న ప్రవృత్తులను, కేంద్రీకృత మవుతున్న ఎత్తుగడలను ఎత్తిపట్టి, వారి సాంస్కృతిక జీవనం ఎలా విధ్వంసమై పోతోందో గుర్తించి, వారి జీవన అస్తిత్వాన్ని కవితా వస్తువుగా విస్తృత పరుచుకున్నాడు. చౌహాన్ కవిత్వంలో ప్రధానంగా ఉంది ధిక్కార స్వరమే. తను ఏ తండా నుంచి వచ్చాడో ఏ గూడెం నుంచి వచ్చాడో వారి జీవన అనుభవాలను, స్వభావాలను, అనుభూతులను కవిత్వం ద్వారా వ్యక్తపరిచాడు. లంబాడీ ప్రజల సంస్కృతికి నేటికీ గౌరవమే లేదు. సభ్యసమాజంలో వాళ్ళ జీవితానికి ఉనికే లేకుండా పోతోంది.
”బంజారా హిల్స్లో బంజారాలు లేరు!/ పెద్ద పెద్ద బంగ్లాల ఉన్నాయి!/ లంబాడీల చిన్న గుడిసె ఒక్కటీ లేదు/ ఇది ఎంత చిత్ర విచిత్రమో కదా..!” గోల్కొండ కోటకు బంజారాద్వారం అనిపేరు. మంచిదేకానీ ఆ కోటలో వారికి స్థానం లేదు. బయట కూడ లేదు. బంజారా హిల్స్ చెట్టు మనదే కానీ కాయలు పక్కింటివి కదా! బుక్కెడు బువ్వదొరుకుత లేదన్న గోడును ఏ చెవికి వినిపించాలని కవి మదన పడుతూ రాశాడు. ఏకలవ్యుడి కవిత చైతన్యంతో ప్రశ్నించే కవిత. ”విలు విద్యలో ఓటమి నెరుగని/ ఏకలవ్యుడు బొటన వేలు/ తీసుకున్నట్లు మా నుండి అన్నీ దోచుకున్నారు!/ సామర్థ్యం మాకున్నా/ గుర్తింపు మీ చిరునామా అయింది“ వివక్షతను, దానిలో దాగిన కుట్రను బట్టబయలు చేసే తత్వం చౌహాన్ కవిత్వానికుంది. ఏకలవ్యుని నుంచి నేటిదాక అణగారిన వర్గాల ప్రతిభను, శ్రమను దోచుకుంటున్న భూస్వామ్యాన్నీ, పెట్టుబడి దారి తనాన్నీ రెంటిని ముసుగేసుకున్న పాలక స్వభావాన్ని కవి ఎత్తి చూపడం తోనే అగిపోడు. సమాజం వీటివల్ల ఎక్కడికక్కడ చినిగి పోతుంటే దాన్ని కుట్టడానికి సూది దారం మేమేనంటాడు ఆత్మ స్థైర్యంతో.
తండాలు, గ్రామాలు శ్రమజీవులవి. ఇవి రాజకీయ నివాసాలు ఎందుకవుతున్నాయి? ఎవరికోసం అవుతున్నవన్న సోయితో పల్లెలు మావి అనే కవిత రాశాడు. స్వచ్ఛమైన మనుషుల మధ్యన రంగుల కుంపట్లను రాజకీయాలు ఎందుకు రాజేస్తున్నాయో గుర్తించాలంటాడు. ‘లిఖించని పబ్బం’ కవితలో గిరి పుత్రుల పండగలు మాయమైపోతున్నాయి. గోడకు వేలాడదీసిన క్యాలండర్లోను మా పండుగులను ఉరితీశారు. మా పండుగలు అడవి బిడ్డలకు తెలిసినంతగా మీకు తెలియవు. తెలిసినా చెప్పరు. ఇక వనారణ్యాలకే కాదు జనారణ్యాలకు కూడా మేమే చెబుతామంటాడు వేదనతో. గిరిజన వీరుల నంగారాభేరే మా సంగారాభేరి. మా పెళ్ళిళ్ళలో పురోహితుడికి పిలుపు లేదు.. మా జాతి పెండ్లిడ్లకు మంత్రాలు లేవు.. పంచ భూతాల సాక్షిగా తండా గ్రామ పెద్దల సాక్షిగా జరిగిన పెండ్లిళ్ళే మాలోస్పూర్తి నింపాయి. ఆడంబరాల లగ్గాల కన్న తండావాసుల లగ్గాలే నయమంటాడు. గిరిజన పల్లెలకి రాజకీయాలు చొరబడి గ్రామాలను కలుషితం చేస్తున్నాయి.
చౌహానుకు గిరిజన కళానైపుణ్యంపై, వృత్తులపై మక్కువ ఎక్కువేనని చెప్పాలి. సంగారాభేరి కవిత్వంలో ఈ భేరినాదం ఎప్పుడో మొదలైంది. తుడుం భేరితో ఒకప్పుడు గజినీల సైన్యం తోక ముడిచింది. భేరి గిరిజనుల అస్తిత్వ అత్మ గౌరవ నాదంగా సుస్థిరం చేశాడు ఈ సంపుటిలో. సంగారాభేరి ఒక మాట కాదు మంట. ఒక సాంస్కృతిక గర్జనకున్న ఈ సుస్వరం తాళంతో నృత్యం చేయడమే కాదు తలకిందుల దూకేదికూడ. బలిదానాల బాట ఇది. బహుళతను చాటేదే ఈ భేరీధ్వని. పౌరుషాన్నే కాదు గౌరవాన్ని పలికించేది కూడ. తల్వారు చేతపట్టి శత్రువులను హతమార్చే రణస్వరం కూడ. సంగారాభేరీలో గిరిజన వేదన ఎంతవున్నా విజయమార్గనిర్దేశనమే దాని ధ్యేయం. చౌహాన్ అందుకే తన ఈ కవితా సంపుటికి తండావాసుల అస్తిత్వ పతాకంగా సంగారాభేరిని ప్రతీకగా మలిచారు. చౌహాన్ వెన్నెల రాత్రి కవితలో అడవి ఆత్మను ఆవిష్కరించారు. అడవి మనుషులను కాళరాత్రి నుంచి కాపాడేది వెన్నెలే అంటాడు. గిరిజన బతుకంతా చీకటే. వెన్నెల వారింట సంతోష పరిమళాన్ని అద్దుతుంది. వెన్నెలమ్మా మా బిడ్డలకు నీపేరే పెట్టుకుంటాం. మా జీవితాలను చైతన్య పరిచేది వెన్నెలే నంటాడు చైతన్యం నిండిన హృదయంతో.
గూడెం ప్రజలకు బస్సు లెందుకు వేయరు? పట్టణాల నుండి గ్రామాలకు పల్లెవెలుగు బస్సులు వేస్తున్నందుకు సంతోషమేగానీ తండాలకు గూడాలకు ఎందుకు వేయరు? వాళ్ళు ఏం పాపం చేశారని? ఆదివాసుల కోసం కనీసం బస్సు సౌకర్యం కూడ కరువాయె. కనీసం నడవడానికి సైతం దారి వేయరు. వీధి విద్యుత్ దీపాలు పట్టణాలకు పెట్టినట్టే ఆదివాసుల పల్లెలకు పెట్టరా? అభివృద్ధి ఆదివాసుల నుండి రావాలి కదా! సమాజాల మూలాలు ఆదివాసులేనని ఎందుకు మరిచి పోతారని ప్రశ్నిస్తాడు తనదైన అస్తిత్వ ప్రశ్నలతో. పంట పండించిన వారే సరాసరి అంగడికి తెస్తారు. ‘అగ్వా అంగడి’ కవితలో అమ్మే తల్లులందరిని ఏకంచేసి రెండవ్వారండి అంగడిలోని వాటి కన్నా తక్కువ దరకే నంటాడు.బ్రోకర్ మార్కెట్ తగ్గించాలంటే అంగడికి పండించిన వారే కూరగాయలు తెస్తే వారి దగ్గరనే కొనుగోలు చేయాలన్న స్వభావాన్ని ఎత్తి చూపారు. ‘ఎత్తు పల్లాల’ కవిత కొంత నిర్మాణంలో కాళోజీ స్ఫూర్తిని నింపుకుని రాశారు.
“డబ్బు పరుపులపై నిద్ర ఒక చోట/ భూతల్లి పరుపుపై నిద్రలాలి ఒకచోట/ గంపెడు బలగం గల గూడెం ఒక చోట./ డాబా రెస్టారెంట్లు మరొకచోట” అనడంలో కాళోజీ వ్యత్యాసాలు కవిత ఠక్కున జ్ఞాపకానికి వస్తుంది.
శ్రమను, పనిముట్లను ప్రతీకలుగా చెప్పిన తీరు బాగుంది. అలాగే సైనికులకు దేశం సదా రుణపడే ఉండాలి. వారి రౌద్ర శౌర్య రుధిరం చాలా విలువైందని దేశ రక్షణ కవచం వారిదేనని కొనియాడుతూ రాశారు. అలాగే తెలంగాణ బిడ్డల పయనం, మట్టి వీరుడు, తండాలు తనాడు తున్నాయి, గిరిజన వీరులు, గూడెం గుట్టపై కవితలతో పాటు పాలస్తీనాలో పసికందుల కేకలదాక అంటే ఆదివాసులు మొదలుకుని పాలస్తీనా వాసుల దాక అణగారిన ప్రజల పక్షాన నిలబడి తనదైన గొంతుతో కదన చైతన్యం రగిలించే కవితలు రాసినందుకు చౌహాన్కు అభినందన. చౌహాన్కు కవితా వస్తువును ఎన్నుకోవడంలో ఏమీ చెప్పవలసినది లేదు. కవితా నిర్మాణ శిల్పంపై మరింత శ్రద్ధ పెట్ట వలసిన అవసరం ఉంది. నిర్మాణంపై శ్రద్ధ పెడితే తరువాత మరిన్ని మంచికవితలు రాయడమే కాక నిస్సందేహంగా ఆదివాసి సాహిత్య మనగానే చౌహాన్ బలమైన యువకవుల్లో ముందుంటాడనే భావిస్తున్నాను.
-డా. నాళేశ్వరం శంకరం
9440451960

