బళ్లారి వేదికగా ఈ నెల 9, 10 తేదీలలో సంగం ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్ఞానమృత కళాశాలలో “కన్నడ-తెలుగు నుడి విచార సంకిరణ” అనే రెండు రోజుల సాహిత్య సమావేశాలు అత్యంత స్ఫూర్తిదాయకంగా విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమం కన్నడ, తెలుగు భాషా సాహిత్య ప్రేమికులను ఒకేవేదికపైకి తీసుకువచ్చి, డ్రావిడ భాషల మధ్య పరస్పర అవగాహన, సహకారం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రముఖ కన్నడ, తెలుగు సాహితీవేత్తలు, కవులు, విమర్శకులు, పరిశోధకులు, భాషా ప్రేమికులతో జ్ఞానమృత కళాశాల ప్రాంగణం రెండు రోజులు కళకళలాడింది. వివిధ సెషన్లలో భాషా సాహిత్యాల సార్వకాలికత, సమకాలీన పోకడలు, సామాజిక బాధ్యతలు, స్త్రీవాదం, దళిత బహుజన సాహిత్యం, పర్యావరణ చైతన్యం వంటి అనేక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.
కవులు కేవలం తమ సొంత అనుభవాల ఆధారంగానే కాకుండా వారు తమ సొంత అనుభవాలతో పాటు ఇతరుల అనుభవాల ఆధారంగా రాస్తే, అటువంటి కవిత్వం ప్రజల మనసుల్లో బలంగా నిలిచిపోతుంది అని సీనియర్ కన్నడ విమర్శకుడు, రచయిత ఓ.ఎల్. నాగభూషణ స్వామి అన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ భారతదేశ అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ మాట్లాడుతూ కన్నడ, తెలుగు భాషల మధ్య సామరస్యం, సాహిత్య పరస్పర మార్పిడి, వైవాహిక, సాహిత్య, సాంస్కృతిక, మేధో సంబంధాల గురించి లోతైన విశ్లేషణ చేశారు. సంఘం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. శివలింగప్ప హండిహాలు తన ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ ఏడాది నుంచి ‘ద్రవిడ బలగం’ సిరీస్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఇందులో దక్షిణ భారతదేశంలోని ద్రావిడ భాషలపై చర్చించడం, తమ సాహిత్యంతో సహా ఇతర భాషలతో సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకోవడం తోపాటు, ఒక భాషా సాహిత్యం అన్ని ద్రావిడ భాషలలోకి అనువాదం చేయాల్సిన ఆవశ్యకతను వివరించాలనే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. విశ్రాంత తెలుగు లెక్చరర్ డాక్టర్ ఆర్.దేవన్న, సంగం ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పాటిల్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కర్ణాటక సాహిత్య అకాడమీ ‘సాహిత్యశ్రీ’ పురస్కార గ్రహీతలైన డా. నిష్ఠిరుద్రప్ప, అబ్దుల్ హై తోరణగల్లు లను సంగం ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానించారు. కన్నడ తెలుగు నుడి సాంగత్యంలో భాగంగా కన్నడ కవి, రచయిత చిదానంద సాలి సమన్వయంతో జరిగిన “కావ్య సంవాదం”లో కన్నడ ప్రతినిధులు రవికుమార్ టెలెక్స్, భువనా హిరేమఠ్, నాగణ్ణ కిలారిలతో పాటు తెలుగు ప్రతినిధులు తగుళ్ళ గోపాల్, కల్యాణి కుంజు పాల్గొన్నారు. ఇందులో వారివారి రచనలపై చర్చ జరిగింది. సమన్వయ కర్త ఉభయ భాషల్లోనూ చర్చల సారాంశాన్ని వివరించడం ద్వారా అటు కన్నడ సాహితీకారులకు, ఇటు తెలుగు సాహితీకారులకు ఆసక్తి కలిగించేలా చర్చ సాగింది. అనంతరం కన్నడ, తెలుగు యువ కవులతో జరిగిన ‘కవిగోష్ఠి’ని యువ కవి, తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్ కృష్ణ ప్రారంభించి మాట్లాడుతూ “సంగం ట్రస్ట్ చేసిన ‘ద్రావిడ బలగం’ ఆలోచన గొప్పది. తెలుగు- కన్నడ భాషల సంయుక్త సభలు నిర్వహించడం, ముఖ్యంగా మా తరం ఆలోచనలు ఒకరికి ఒకరు పెంచుకునే గొప్ప అవకాశం ఇది” అని అన్నారు. కవిగోష్ఠిలో కన్నడ కవులు సంతోష్ అంగడి, భాగ్యజ్యోతి హిరేమఠ్, రంగనాథ్ ఎన్. ఆరనకట్టె, మంజునాథ్ బదామి, దీపా గోనాళ్, దశమి తమానకర్, దిలీప్ శివగౌరి, సికందర్ అలీ, జయంతి సునీల్, రేణుకా కోడగుంటి, తెలుగు కవులు ముజాహిద్ అలీ, సందీప్ వొటారికారి, వశిష్ట సోమేపల్లి, సలీమ్ కందికొండ, మాధురి అనిత, పేర్ల రాము, అరవింద్ ఏ.వి., చిక్కొండ్ర రవి, వజ్రాల ప్రియాంక తమ స్వీయ కవితలు వినిపించారు. చివరకు వాటన్నింటినీ సమన్వయ కర్త మోదూరు తేజ రెండు భాషల్లో వివరించారు.
సంగం ట్రస్ట్ ఇచ్చే అవార్డు కోసం అభ్యర్థిని ఎంపిక చేసిన పద్దతి చాలా విన్నూత్నంగా ఉంది. ఫైనల్ కి ఎంపికైన అభ్యర్థులందరిని కూర్చోబెట్టి ఒక గంట చర్చ జరిపి ఆఖరిలో అవార్డు గ్రహీత పేరు ప్రకటించారు. చివరి వరకు సాగిన ఉత్కంట అంతా ఇంతా కాదు. జి.పి. బసవరాజు, సబితా బన్నాడి, రాజేంద్ర ప్రసాద్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రెండో రోజు ‘కథా సమయం’ ను మారుతి పౌరోహితం సమన్వయం చేశారు. ఇందులో కన్నడ ప్రతినిధులు పూర్ణిమ మాళగిమని, శరణబసవ గుడదిన్ని, మధు వై.ఎన్, తెలుగు ప్రతినిధులు మేఘనాథ్ రెడ్డి, సలీమలు తమ స్వీయ రచనల అనుభవాలను పంచుకున్నారు. అనంతరం యువ ప్రచురణకర్తల చర్చా వేదికలో కన్నడ ప్రచురణకర్తలు మమత (కౌది ప్రకాశన), సూర్యకీర్తి (మించుళ్ళి ప్రకాశన), చాంద్ కవి చంద్ర (కావ్యమనె ప్రకాశన), తెలుగు ప్రచురణకర్తలు శ్రీదివ్య (ఝాన్సీ పబ్లికేషన్స్), మల్లికార్జున్ (ప్రేమలు పుస్తకాలు) ప్రచురణ కర్తలుగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చను రాజేంద్ర ప్రసాద్ (సంకథన ప్రకాశన) సమన్వ యం చేశారు. నాగిణి అప్పసాని సమన్వయంలో జరిగిన కవి సమయం చర్చలో కన్నడ ప్రతినిధులు లక్ష్మణ వి.ఎ., సదాశివ సొరటూరు, ఆశా జగదీష్, తెలుగు ప్రతినిధులు పల్లిపట్టు నాగరాజ్, అనిల్ డాని, నాగజ్యోతి శేఖర్ పాల్గొని విశ్లేషణాత్మక చర్చ చేశారు.
చివరగా కన్నడ కవులతో మమత అరసీకెరె సమన్వయంలో నిర్వహించిన కవిగోష్ఠిని ప్రముఖ కవి పి.ఆర్. వెంకటేశ్ ప్రారంభించారు. ఈ కవిగోష్ఠిలో సామంత్రి జ్యోతి, నాగరాజు సూరమ్మనహళ్ళి, జయశ్రీ భేరిగె, దేవరాజ్ హుణసికట్టి, అశోక్ హొసమని, శరణగౌడ పాటిల్ చందాపుర, శివరాజ్ అరళి శేఖరయ్య, టి.హెచ్.ఎం. చాంద్ భాషా, భాగ్యశ్రీ హురకడ్లి, లక్ష్మణ నిట్రవట్టి, అరుణ్ కుమార్ బి, కోటగి కరిబసమ్మ తమ స్వీయ కవితలు వినిపించారు. ఈ సభలలో నాగణ్ణ కిలారి నవల ‘కాయగుడ్డ’, పి.ఆర్. వెంకటేశ్ కవితా సంకలనం ‘కాయువ కణ్ణు’, డా. దస్తగీర్ సాబ్ దిన్ని సంపాదకత్వంలో వచ్చిన ‘కరుళ బెంకియ పతంగ మిర్జా గాలిబ్’ గ్రంథాలు ఆవిష్కరించారు. మొత్తంగా తెలుగు కవిత్వంలోని వైవిధ్యం, ఆధునికత – సమకాలీన సమస్యలను ప్రతిబింబించే సృజనాత్మకతను కన్నడ సాహితీవేత్తల గొప్పగా ప్రశంసించారు. అదేవిధంగా కన్నడ సాహిత్యంలోని గాఢమైన సామాజిక చైతన్యం, భాషా సౌందర్యం తెలుగు సాహితీవేత్తలను మెప్పించాయి.
ఈ సమావేశాలు కేవలం చర్చలకు పరిమితం కాకుండా, రెండు భాషల మధ్య సృజనాత్మక సహకారానికి పునాదులు వేశాయి. ద్రావిడ భాషల పరస్పర ఆస్థిత్వ పరిరక్షణ, అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశాలలో సంగం ట్రస్ట్ వారు ఒక ముఖ్యమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయానికి పునుకోవాలని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రయత్నం ప్రస్తుతం చర్చల దశలో ఉన్నప్పటికీ, ఇది జరిగితే రెండు భాషల సాహిత్య ప్రేమికుల మధ్య సౌహార్దం మరింత బలపడుతుందని, ద్రావిడ భాషల పరస్పర అభివృద్ధికి గొప్ప దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ అనువాద ప్రాజెక్టు ద్వారా రెండు భాషల పాఠకులు కూడా ఒకరి సాహిత్యాన్ని మరొకరు సులభంగా అందుకోగలరు. వీణా ఎర్రిగౌడ్, బాసరకోడు నాగరాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 60 మంది యువ కవులు, ప్రచురణకర్తలు, రచయితలు పాల్గొన్నారు.
అనంతోజు మోహన్ కృష్ణ, 8897765417
కన్నడ తెలుగు నుడి సాంగత్యం
- Advertisement -
- Advertisement -


