పోలీసు ఉద్యోగం గొప్ప బాధ్యత

Police job is a great responsibility– హోంమంత్రి మహమూద్‌ అలీ
– ‘తెలంగాణ ఇంటీగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ఈ ఉద్యోగం అంటేనే గొప్ప బాధ్యతతో కూడుకున్నదని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీసీ కెమెరాలను అనుసంధానం చేసిన ‘తెలంగాణ ఇంటీగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌'(టీజీసీసీసీ) విభాగాన్ని సోమవారం హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో పోలీస్‌ శాఖకు పెద్దపీఠ వేశారని గుర్తు చేశారు. ఎంతో అభివృద్ధిని సాధించామని, కొత్తగా 9 పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసుకున్నామని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. పోలీస్‌ శాఖలో సమర్థవంతమైన పోలీస్‌ అధికారులున్నారని, దాంతో రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ బాగుందన్నారు. పోలీస్‌ శాఖలో 33శాతం మహిళా ఉద్యోగుల నియామకం జరుగుతోందన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ, ఐటీ రంగం ఎంతో పురోగతి సాధించిందన్నారు.
డీజీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధిని సాధించామన్నారు. మావోయిస్టులు, రౌడీల సమస్యలు లేకుండా చేస్తున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభించే ముందు ఇతర రాష్ట్రాల్లో పూర్తిగా అధ్యయనం చేశామని తెలిపారు. తెలంగాణ పోలీసింగ్‌ విధానం న్యూయార్క్‌ పోలీసింగ్‌ తరహాలో ఉందన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. గతంలో గణేష్‌ నిమజ్జనాన్ని బషీర్‌బాగ్‌ కమిషనరేట్లలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి వీక్షించేవాళ్లమని, ఈ సారీ ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ వీక్రమ్‌ సింగ్‌ మాన్‌, సుధీర్‌బాబు, విశ్వప్రసాద్‌, జాయింట్‌ సీపీ గాజారావు భూపాల్‌తోపాటు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Spread the love