కమిషన్ల వెనుక రాజకీయ కుట్రలు

కమిషన్ల వెనుక రాజకీయ కుట్రలు– విద్యుత్‌ ఒప్పందాల్లో ఒక్క పైసా నష్టం జరగలేదు : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం రేవంత్‌ ప్రభుత్వం.. గత బీఆర్‌ఎస్‌ సర్కారుపై నిందలు వేయటానికి, మాజీ సీఎం కేసీఆర్‌పై బురదజల్లడానికే విచారణ కమిషన్లను వేసిందని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. వాటి వెనుక రాజకీయ కుట్రలు దాగున్నాయని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాల్లో ఒక్క పైసా నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై నిబంధనలకు విరుద్ధంగా కమిషన్‌ చైర్మెన్‌తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించారని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మాట్లాడిన మాటలనే ఆ సందర్భంగా చైర్మెన్‌ చెప్పారని విమర్శించారు. తద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నేత కేసీఆర్‌ తన లేఖలో అన్ని విషయాలనూ స్పష్టం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఏమీ చేయలేమనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మీడియాకు లీకులనిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందంతో రూ.6 వేల కోట్ల నష్టం కాదు, అంతకుమించి లాభం జరిగిందని జగదీశ్‌రెడ్డి వివరించారు.

Spread the love