పొలిటికల్‌ సర్వేలు

Political surveys– కొన్ని బీఆర్‌ఎస్‌కు అనుకూలం…
– మరికొన్ని కాంగ్రెస్‌కు పట్టం
– ఓటర్లకు గాలం వేసేందుకు మైండ్‌ గేమ్‌
– అయోమయంలో ఓటర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల వేళ వెలువడుతున్న సర్వేలు ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. కొన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌కు అనుకూలం అయితే, మరి కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు పట్టం కడుతున్నాయి. వీటి విశ్వసనీయత సంగతి అలా ఉంచితే ఓటర్లకు గాలం వేసేందుకు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సర్వేలు నిర్వహించుకుంటూ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న నేపథ్యంలో వివిధ రకాల సంస్థలు చేస్తున్న సర్వేలు ప్రజల్లో గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఒక్కో సంస్థ సర్వే ఫలితాలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. ఆత్మ సాక్షి, రాజనీతి ఆర్గనైజేషన్‌, జనతాకా మూడ్‌ తదితర సంస్థలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటే, ఇండియా టుడే సీ ఓటర్‌, పోల్‌ ట్రాకర్‌, జన్మత్‌ తదితర సంస్థల సర్వేలు కాంగ్రెస్‌కు అధికారం ఖాయం అని చెబుతున్నాయి. బీజేపీ మాత్రం పోటి నుంచి అనధికారికంగా తప్పుకుందనే గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు రావడం లేదు.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌ 42.5 శాతం ఓట్లతో 64 నుంచి 70 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ పార్టీ 36.5 శాతం ఓట్లతో 37 నుంచి 43 స్థానాలు దక్కించుకుని రెండవ స్ధానానికి పరిమితం అవుతుందని తేల్చింది. 6 నుంచి 7 స్థానాలు గెలుచుకోవడం ద్వారా మజ్లీస్‌ మూడవ స్థానంలో నిలుస్తుండగా, 5 నుంచి 6 స్థానాలతో బీజేపీ నాలుగవ స్థానానికి పరిమితమవుతుందని అంచనా వేసింది.
పోల్‌ ట్రాకర్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ 64 నుంచి 74 స్థానాలు దక్కించుకోగా, 39 నుంచి 44 స్థానాలతో బీఆర్‌ఎస్‌ రెండవ స్థానానికి పరిమితం కానుంది. జనతాకా మూడ్‌ సంస్థ సర్వే ప్రకారం72 నుంచి 75 సీట్లతో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ పవర్‌లోకి రానుందని తెలిపింది.
కాంగ్రెస్‌ 31 నుంచి 36 సీట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలవనుందని వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధిస్తుందని జన్మత్‌ సర్వే తేలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి 58 నుంచి 60 సీట్లు రానుండగా, బీఆర్‌ఎస్‌ పార్టీ 43 నుంచి 45 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇండియా టుడే సీ ఓటర్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ 54 స్థానాలు దక్కించుకోనుండగా బీఆర్‌ఎస్‌ పార్టీకి 49 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఒక్కో సర్వే ఒక్కో విధంగా వస్తుండటంతో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అసలు విజేత ఎవరో తెలియాలంటే డిసెంబర్‌ 3 దాకా ఆగాల్సిందే.

Spread the love