కబ్జా

Possessionలావణ్యకు సొంతఊరును వదిలి మరో ఊరికి వెళ్లిపోవాలంటే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది.
‘శరీరం నుండి ప్రాణం వేరుచేసినట్లు’ ఆమె మనసు బాధతో మూలుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్లెల్లో బతకడం చాలా కష్టం. చెయ్యడానికి పనిలేక చేతిలో డబ్బులు లేక టౌన్‌ కి వెళితే ఏదైనా పని చేసుకొని బతకొచ్చు. పిల్లలకు మంచి చదువులు చెప్పించొచ్చు కదా అనుకుంది లావణ్య.
తన మనసులో మాటను కనిపెట్టినట్లు అక్కవాళ్ళు పేటకు వస్తే ఇంట్లో అన్నిపనులు చేయించుకోవచ్చు. ఎలాగూ అన్ని పనులు చేయడం అలవాటే కాబట్టి మొహమాటానికైనా చేసిపెడుతుంది. కాస్త మంచిగా మాట్లాడి ఒప్పించాలి అనుకుంది లావణ్య తోడికోడలు సురేఖ.
‘అక్కా సదాశివపేటలో మన ఇల్లే ఉందికదా! మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నరు. మన ఇంటి జాగా ఒకవైపు గోడ పడిపోయింది కదా! అటు దిక్కు వాళ్ళు మన జాగాలోకి జరిపి ఇల్లు కట్టుకుంటూ, ఆ జాగా వాళ్ళదేనని కబ్జా పెడుతున్నారు. మీరు కూడా ఇక్కడికి వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది’ అని చెప్పింది తోటి కోడలు సురేఖ.
మన ఊరును వదిలిపెట్టి రావాలంటే భయంగా ఉంది సురేఖా. ఇక్కడ ఏదో నాలుగు ట్యూషన్లు చెప్పుకుని ఎలాగోలా ఉంటున్నాం. పేటకు వస్తే అక్కడి ఖర్చులకు మేము ఆగుతమా? చెప్పు అన్నది లావణ్య.
ఎందుకు భయపడతారు అక్క. మనఇల్లే కదా? ఖర్చులు ఏముంటాయి. ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే మిగతా విషయంలో నేనులేనా ఏంటి?
లావణ్య చేతిని తన చేతిలోకి తీసుకుని ”అక్కా! నాకు కాన్పు అయినప్పుడు నన్ను నీవే చూసుకున్నవు. నీవు లేకపోతే నేనెంత ఇబ్బంది పడేదాన్ని. ఈవిధంగానైనా మీకు సాయం చేసే అవకాశాన్ని ఇవ్వు. అదీకాక నీవు ఏదైనా స్కూల్‌లో టీచర్‌గా అవకాశం వస్తే చేరొచ్చు” అని చెప్పేసరికి నిజమేనని అనుకుని ఆలోచనలో పడింది లావణ్య.
అక్కడికి వెళ్తే కాస్తా మెరుగ్గా బతకొచ్చు కదా అని ఆశ పడింది. భర్తతో అదే మాట చెప్పింది.
”అలాకాదే.. మనం అక్కడికి వెళ్తే చాలా ఇబ్బందుల్లో పడతాం. వాళ్ళతో మనం నెగ్గలేం” అన్నాడు కమలేష్‌.
నానావిధాలుగా చెప్పి భర్తను ఒప్పించింది లావణ్య. ఇద్దరూ కలిసి అన్ని సామాన్లు సర్దుకుని, పిల్లలిద్దరినీ తీసుకుని సదాశివపేట చేరేసరికి రాత్రి 8:30 గంటలు అయింది.
సదాశివపేట మున్సిపాలిటీ కిందికి వస్తుంది. బిజినెస్‌ చేసుకునేవాళ్ళకు మంచి సెంటర్‌ పాయింట్‌.
గాంధీచౌక్‌ చౌరస్తాకు ఒకవైపుగా పాతకాలం నాటి పెద్ద ఇల్లు వాళ్ళది. ‘బాడ గెస్ట్‌హౌస్‌’ అంటారు. విచిత్రంగా చుట్టూ పెద్దపెద్ద బిల్డింగ్‌లు లేచినా ఇదొక్క ఇల్లు మాత్రం పాతకాలం నాటిది.
ముందువైపు బంగ్లా ఇంటికి వెనక వైపు గెస్ట్‌హౌస్‌ కూడా ఉంటుంది.
కమలేష్‌ ది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి ఎవరికి ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడ నివసిస్తారు.
ట్రాలీ నిండుగా సామాన్లతో చీకటిపడే వేళకు సదాశివపేటలో ఉన్న ఇంటికి వచ్చారు లావణ్య, కమలేశ్‌లు.
గేటు తీసుకుని లోపలికి వెళ్లారు. హఠాత్తుగా ఇంట్లో కరెంట్‌ పోయింది. అయ్యో! ఇప్పుడు ఎట్ల అన్నది లావణ్య.
వ్యాన్‌ డ్రైవర్‌ కల్పించుకుని నేను బండి లైట్‌ వేసి ఉంచుతానమ్మా. మీరు మీ వాళ్ళను అడిగి ఏదైనా టార్చ్‌లైట్‌ గాని, కందిలి గానీ పట్టుకొని రండి అన్నాడు. అట్లనే సామాన్లు దించనింకె తోడుకు పిలుచుకోండి అన్నాడు.
నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ కమలేష్‌ ఇంటిడోర్‌ ముందుకు వెళ్లి కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు కుటుంబం అందరూ కలిసి భోజజం చేస్తున్నారు. ఈవేళప్పుడు ఎవరొచ్చిర్రు? అని గునుస్తూ తలుపు తీసాడు కమలేష్‌ తమ్ముడు రూపేష్‌.
ఎదురుగా అన్నను చూసి ”ఏమే అన్నా ఎప్పుడు వచ్చిర్రు? రా లోపలికి” అన్నాడు తమ్ముడు రూపేష్‌.
”పర్వాలేదు తమ్మీ. మీరు భోజనం చేస్తున్నట్లున్నారు కదా! కానీయండి. ఊరు నుండి సామాన్లు తీసుకొని వచ్చినం. అనుకోకుండా కరెంట్‌ పోయింది. బయట అంతా చీకటిగా ఉంది. బ్యాటరీ గానీ దీపంగానీ ఉంటే ఇస్తావా ? పిల్లలున్నారు భయపడ్తరు! జర సామాన్లు దించనింకె ఒక చెయ్యి ఏస్తవా తమ్మీ” అన్నాడు కమలేష్‌.
”సరే ఆగు అన్నా. తింటున్నమే చేయి కడుక్కుని వచ్చి తెస్తాను” అంటూ లోపలికి వెళ్ళాడు రూపేష్‌. లోపల కూడా చీకటిగానే ఉంది.
”సురేఖా.. అన్న వాళ్ళు వచ్చిండ్రు. దీపాలు ఎక్కడున్నాయి చీకటిగా ఉందికదా! ట్రక్కులో సామాన్లు వేసుకుని వచ్చింరు దించనీకి ఇబ్బంది పడుతున్నరు” అన్నాడు.
”వస్తే వచ్చిర్రు తీరు వాళ్ళతోపాటూ ఒక బ్యాటరీ కూడా తెచ్చుకోవచ్చుకదా? వీళ్ళదొక కథ! గూదేశం పడ్తరు” అన్నది సురేఖ.
”బయట అన్న ఉన్నడే, వినిపిస్తది ఊరుకో” అన్నాడు రూపేష్‌.
ఇదిగో ఇది తీసుకో అంటూ దీపంలోని నూనెను మరో బాటిల్‌ లోకి ఒంపేసి, ”పండూ… ఈ దీపం తీసుకునివెళ్లి బయట పెద్దనాన్న ఉన్నాడు ఇచ్చిరాపో బేటా” అంటూ కొడుకు కు ఇస్తూ చెప్పింది సురేఖ.
”అయ్యో నూనె మొత్తం ఒంపేస్తే దీపం ఎట్లా వెలుగుతుంది మమ్మీ. ఎందుకు ఒంపుతున్నావు?” అన్నాడు పండు.
”నీకు తెల్వదు ఊకో. వాళ్ళకు అట్లే చేయాలె. ఇప్పుడు దీపం ఇస్తే మళ్ళీ దాన్ని ఎప్పటిలాగా తెచ్చి ఇస్తారా? దాంట్లో నూనె అయిపోయిందని, పోసి ఇవ్వమని అడుగుతమా?” అన్నది సురేఖ.
”అమ్మా నూనెలేకపోతే దీపం ఎట్ల వెలుగుతుంది?” అన్నాడు పండు.
చిన్నవాడు కదా! పెద్దవాళ్ళ మనసులోని మర్మాలు ఏమి అర్థమవుతాయి!
”అందులో అయిపోతే మంచి నూనె దీపం పెట్టుకుంటరుతీరు! వాళ్లకు అట్లనే చేయాలి. మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకు అర్థం కావాలె గానీ, ఇచ్చిరాపో” అన్నది సురేఖ.
ఇదిగో పెద్దనాన్న దీపం అని చేతికిచ్చి పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు పండు. పిల్లవాడి ప్రవర్తనకు కమలేష్‌ మనసు చివుక్కుమంది. అదీకాక లోపలింట్లో తమ్ముడు, మరదలు మాట్లాడిన మాటలన్నీ బయట గుమ్మం దగ్గర నిలబడిన కమలేష్‌ చెవిలో పడ్డాయి. నోటిమాట రాక నిశ్చేష్టుడయ్యాడు.
కళ్ళ నిండా నీళ్ళు నింపుకొని వెనుదిరిగి అడుగులు వేస్తూ గెస్ట్‌హౌస్‌ దగ్గరికి కదులుతూంటే రూపేష్‌ ‘అన్నా’ అని పిలిచాడు.
”నేను పొద్దున్నే స్కూల్‌కు వెళ్ళాల్నే. ఒకపని చేయి. పొద్దున్నే 6 గంటలకు చౌరస్తా దగ్గర నిలబడితే అడ్డాకూలీలు దొరుకుతరు. వాళ్ళువస్తే అరగంటలో ఇంట్లోకి సర్దేస్తారు” అన్నాడు రూపేష్‌.
”సరేలేరా. నీవేమీ ఇబ్బంది పడకు. నేను చూసుకుంటాలే” అన్నాడు కమలేష్‌.
దీపం వెలిగించాలి అని అగ్గిపెట్టె కోసం తడిమాడు దొరకలేదు. సార్‌ ఇదిగోండి అగ్గి పెట్టి అంటూ ట్రాలీడ్రైవర్‌ తన క్యాబిన్‌ సొరుగులో నుండి అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు.
అదే చీకటిలో దీపం పెట్టుకుని సామాన్లు ఇంట్లోకి చేర్చారు. అప్పటికే 9:30 గంటలు కావస్తుంది. దీపం ఉంది అందులో నూనె లేదు ఎలా వెలుగుతుంది? కొడగట్టిపోతుంది.
భార్యకు విషయాలేమీ చెప్పదలుచుకోలేదు అతను.
సొంత ఇల్లే అయినా, అలవాటు లేని ప్రదేశం కదా! ఊరికి కొత్త! పిల్లలేమో ఆకలి అని ఏడుస్తున్నారు. ఇక్కడ తమ్ముడు, మరదలు ఉన్నారు కదా! ఒక పూట తిండి పెట్టలేక పోతారా అనుకుని వంట చేసుకోవడానికి ఏమీ సమకూర్చుకో లేదు.
తమ్ముడు వాళ్ళు కనీసం భోజనాలు చేసారా? పిల్లలకు ఆకలి వేస్తుందేమో అన్న జాలి కూడా చూపలేదు. వాళ్ళపై పడి తింటామా? ఊళ్ళో ఇలాగే ఉంటామా? ఊళ్ళో ఎక్కడైనా వీధిలో నడుస్తూ బరువు మోయడం చేతకాకపోతే దారిలో పోయేవాళ్ళు కూడా ముఖపరిచయం లేకపోయినా సాయం చేస్తామని ఒక చెయ్యి వేస్తారు కదా? వీళ్ళు ఎంత స్వార్థపరులు. ఊరికి వచ్చినప్పుడు ఏం కావాలన్నా ధైర్యంగా తీసుకుని వాడుకునేవాళ్ళు. అన్ని పనులు చెప్పి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడున్న ఇంటికి వస్తే కనీసం పలకరించడానికైనా బయటకు రాలేదు మరదలు. సాటి మనిషిగా కూడా చూసినట్లు అనిపించడం లేదు. అనుకున్నాడు కమలేష్‌. దు:ఖం తన్నుకొస్తుంది అతనికి. లోలోపలే దు:ఖం దిగమింగుకున్నాడు. ఇద్దరూ కలిసి సామాన్లు ఇంట్లోకి మోసారు.
”లావణ్యా! నేను అలా వీధిలోకి వెళ్ళి చూసొస్తాను. కరెంట్‌ ఇంకా రాలేదు. ఉన్నా ఈ ఇంట్లోకి కనెక్షన్‌ లేనట్లుంది. జాగ్రత్తగా ఉండు. తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను” అంటూ బయటకు నడిచాడు గుడ్లల్లో నీళ్ళు కుక్కుకుంటూ.
గాంధీచౌక్‌ చౌరస్తా వద్దకు నడిచాడు. ఎప్పుడూ జనాలతో కిటకిట లాడుతుండే బజారు ఈ సమయంలో స్తబ్దుగా కనిపిస్తుంది.
”తమ్ముడూ ఇక్కడ దగ్గర్లో ఏదన్నా హోటల్‌ ఉందా?” అడిగాడు ఎదురుగా కనిపించే ఒకతన్ని.
”ఈరోజు ఊళ్ళో కరెంట్‌ కట్‌ అయ్యింది. పొద్దున్నుంచి కరెంట్‌ లేదు అన్నా. అందుకే జల్దిన మూసిండ్రు” అన్నాడతను.
”ఎక్కడన్నా ఒక హోటల్‌ ఉంటే చెప్పు” అన్నాడు కమలేష్‌.
”అన్ని షాపులు మూసేశిండ్రు. గిట్లనే జర ముందుకు పోతే చిన్నచిన్న దుకాణాలు కనిపిస్తాయి. ఏమన్నా తెరిచి ఉంటే చూడు” అనుకుంటూ అతను వెళ్ళిపోయాడు.
కళ్ళు ఇంత పెద్దగా చేసుకుని అలాగే నడిచాడు కమలేష్‌. కాస్త దూరంగా మినుకుమినుకు మంటూ వెలుతురు కనిపించింది అతనికి. కాస్తా ఆశ కలిగింది. మెల్లగా అటువైపు నడిచాడు. ఒక ఇంటి వసారాలో బిస్కెట్లు, బ్రెడ్‌, ఇంకా కొన్ని చిరుతిళ్లు పెట్టుకుని ఒక ఇంటి ముందు టీ కొట్టు లాంటిది పెట్టుకుని ఒక పెద్దావిడ కనిపించింది.
నాలుగు బిస్కెట్‌ ప్యాకెట్‌లు, నాలుగు బన్‌ లు తీసుకుని డబ్బులు ఇచ్చాడు. ”పెద్దమ్మా నాలుగు కప్పులు పాలు ఉంటే వేడిచేసి ఇవ్వగలరా. అన్ని షాపులూ మూసేసిండ్రు అందుకే అడుగుతున్న” అన్నాడు.
నాయనా మా పెద్దమనిషికి వంటచేయాలె. నా దగ్గర పనిచేసే పిల్ల ఇప్పుడే అన్నీ కడిగి బోర్లించి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెట్టడం కుదరదు” అంది ఆ పెద్దావిడ.
పిల్లలు ఆకలితో ఉన్నారని బతిమిలాడినట్లు అనగానే, ఆమె ముఖం కాస్తా జాలిగా పెట్టి ”అయ్యో అవునా బాబు. ఒక ఐదు నిమిషాలు ఆగు. ఇంట్లోకి పోయి పొయ్యిమీద మా కోసం ఉంచుకున్న పాలు గరంజేసి ఇస్త. జర్ర నిలబడు” అంటూ లోపలికి వెళ్ళి రెండు కప్పుల పాలు వేడి చేసి కవర్లో ప్యాక్‌ చేసి రెండు డిస్పోజబుల్‌ గ్లాసులు జతచేసి ఇదిగో నాయనా పిల్లలు ఆకలితో ఉన్నారని అన్నావని ఇస్తున్నా. పొద్దున్నుంచి కరెంటు లేక చాలా ఇబ్బంది అవుతుంది” అన్నది.
”అమ్మా మీ మేలు మర్చిపోలేను” అన్నాడు.
”ఒకరికొకరం బిడ్డా పోయేటప్పుడు ఎంటతీస్కపోతమా!” అంది ఆమె.
కమలేష్‌ ఇంటికి వచ్చాడు. పిల్లలు బాగా ఆకలితో ఉన్నారేమో, పాలల్లో బన్‌ అద్దుకొని ఆవురావురుమని తిన్నారు.
అంతవరకు ముందు గదిలో కాస్త సర్ది, బ్యాగ్‌లోంచి బట్టలు తీసి బెడ్‌ షీట్‌ వేసి పక్క సిద్ధం చేసి పిల్లలను పడుకోబెట్టింది లావణ్య.
బిస్కెట్లు నీళ్ళల్లో ముంచుకుని తిని మంచినీళ్లు తాగి ఇద్దరూ పిల్లల పక్కనే అలాగే ఒరిగి పడుకున్నారు.
***
తెల్లవారుజామునే ఇద్దరూ నిద్ర లేచారు. ఇంటి ముందు భాగంలో ఊడ్చి వేపచెట్టు కింద రాలిపడిన కట్టెపుల్లలను ఒక దగ్గరకు చేర్చింది.
ముందు గది బయట ఒకపక్క మూలకు మూడు రాళ్ళు పెట్టి, కర్ర పుల్లలను అందులో వేసి పొయ్యి వెలిగించింది. వీధిలోని బోరింగ్‌ దగ్గర రెండు బిందెలు నీళ్ళుతెచ్చాడు కమలేష్‌. స్నానాలకు నీళ్లు వేడి చేసి వేడిగా అన్నం, పప్పు వండింది లావణ్య. పిల్లలు నిద్రలేచారు పిల్లలిద్దరికీ ముఖాలు కడిగి స్నానం పోసింది.
వంట పాత్రలను ఇంట్లోకి తీసుకుని వెళ్తుంటే మరిది తోడికోడలు స్కూలుకి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తూ వెళ్తూ లావణ్య వాళ్ళ ఇంటి వైపు వచ్చి ”వదినా… ఇట్ల ఇంటిముందు పొయ్యి పెట్టుకుంటే చూసేవాళ్ళకి ఏం బాగుంటుంది? మమ్మల్ని తప్పుగా అనుకోరా? ఇంట్లోనే చేసుకో. బయట పొయ్యి పెట్టకు” అన్నాడు.
లావణ్య సమాధానం చెప్పలేదు. ఆ ఇంటికి కిటికీలు లేవు. పొయ్యి పెట్టినా గాలి బయటకు పోదు. ఆ విషయం అతనికీ తెలుసు.
ఒకసారి అతని ముఖాన్ని పైకి కిందికి చూసి ఇంట్లోకి వెళ్లి పోయింది లావణ్య. విషయం అర్ధమై ఏమీఅనలేక అతనూ వెళ్ళిపోయాడు.
ఆమె ఇంకా వాళ్ళ సిలిండర్‌ అడిగి తెచ్చుకుందామని అనుకుంది. కానీ సురేఖ కనీసం పలకరించలేదు. పిల్లలతో ఉన్నారు ఏమైనా అవసరం ఉందా అక్కా అని అడగనైనా లేదు.
ఇప్పుడు చూస్తూ దగ్గరకు వచ్చి, ”రాత్రి దీపం ఇచ్చిన గదా! ఇస్తావా అక్కా. మళ్ళీ నాకు అవసరం పడుతుంది కదా!” అని అడిగింది సురేఖ.
చీచీ, మరీ ఇంత మానవత్వం లేని మనుషులా! ఎవరి గురించైనా దగ్గరుంటేనే వాళ్ళ గుణం అర్థమవుతుంది అని మనసులోనే అనుకుంది.
”ఇదిగో సురేఖ రాత్రి నీవు ఇచ్చినప్పుడు దీపంలో నూనె లేకుండె. చూడు పోసి ఇస్తున్న” అన్నది లావణ్య. మారు మాట్లాడుండా తీసుకుని వెళ్లి పోయింది సురేఖ.
***
సామాన్లు సర్ది, పనంతా అయ్యాక ఇంట్లో నుంచి కరెంటు వైర్‌ వేసి, గెస్ట్‌హౌస్‌లోకి కనెక్షన్‌ ఇచ్చి, కరెంట్‌ వచ్చే ఏర్పాటు చేసుకున్నారు కమలేష్‌, లావణ్య.
ఇక పిల్లలకు మంచి స్కూల్‌ చూడాలి. నేనేదైనా జాబ్‌ వెతుక్కోవాలి అనుకుంది లావణ్య. తనకు ఎలాగూ ట్యూషన్లు చెప్పడం అలవాటే కాబట్టి ఇక్కడే ట్యూషన్లు చెప్పడం మొదలుపెడితే ఎలా ఉంటుంది? అనుకుంది. అనుకున్నదే తడవుగా ఒక అట్ట తీసుకుని ట్యూషన్లు చెప్పబడును అని బోర్డు రాసి గేటుకు తగిలించి పెట్టింది లావణ్య.
సాయంకాలం స్కూల్‌ నుంచి వస్తూ లైట్లతో వెలుగుతున్న గెస్ట్‌హౌస్‌ వైపు చూస్తున్న సురేఖ, రూపేష్‌ తట్టుకోలేక పోయారు. వీళ్ళు ఇంట్లోనే ఉండి ఇల్లంతా చూసుకుంటారని అనుకుంటే గెస్ట్‌హౌస్‌లో తిష్టవేసారే! అనుకున్నారు.
పిల్లలను స్కూల్లో జాయిన్‌చేసి మెల్లిగా ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది లావణ్య. ఎట్టకేలకు కమలేష్‌ ఒక కంపెనీలో జాబ్‌ సంపాదించాడు. కాలం గడుస్తుంది. కానీ ఊళ్ళో ఉన్నప్పుడు తోడికోడలు చెప్పిన ధైర్యం ఇక్కడికి వచ్చాక నీటిమీద రాతలే అయ్యాయి.
ఒకరోజు లావణ్య పనిమీద బయటకువెళ్ళి వచ్చేసరికి గెస్ట్‌హౌస్‌లోకి ఇచ్చిన కరెంట్‌ కనెక్షన్‌ కట్‌ చేసారు. మరోరోజు నల్లానీళ్ళు వస్తుంటే వాళ్ళ ఇంట్లోని నీళ్ళన్నీ ఒలుకబోసి మళ్ళీ అన్నీ నింపారు. లావణ్య పట్టుకుందామనుకునేసరికి నల్లా బంద్‌ అయ్యింది. వీధిలోని బోరింగ్‌ నుండి తెచ్చుకోక తప్పలేదు లావణ్యకు.
మరోరోజు సురేఖ కూతురు వాంతులు చేసుకుంటుంటే ఆ పాపకు దిష్టి తీసి పడేస్తూ ”ఇంతకుముందు ఎప్పుడూ ఇట్లా కాలేదక్కా. ఈ పదిహేను రోజుల నుండే ఇట్లా అయితుంది” అంటూ వాళ్ళ కూతురి వాంతులకు మీరే కారణం అన్న ధోరణితో మాట్లాడింది సురేఖ. ప్రతీ ఒక్క విషయంలో కారణం వెతుక్కుని మరీ అనడం మొదలు పెట్టింది. ఆరునెలలు గడిచాయి లావణ్యకు విసుగు వచ్చేసింది.
అందరమూ బాగా చదువుకున్న వాళ్ళమే కానీ వాళ్ళకు గౌవర్నమెంట్‌ జాబ్‌ వచ్చింది. కాస్తా మెరుగ్గా బతుకుతున్నారు. మాకు కలిసిరాక ఇలా పనికోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉమ్మడి కుటుంబం అన్నమాటే కానీ ఒకరికోసం ఒకరం అనే మాటే కనిపించడం లేదు. ఎంతలేదన్నా ఏదైనా మాటకు మాట అందామన్నా మీరు పెద్దవాళ్ళు ఓపిక ఉండాలి అంటారు. నేనే బద్నాం అవుతాను. కలిసి దగ్గరగా ఉండి గొడవలు పడుతూ ఉండే కంటే దూరంగా ఉండి ప్రేమలు పెంచుకోవడం మేలు అనుకుంది లావణ్య.
బాగా ఆలోచించింది ఒక నిర్ణయానికి వచ్చింది. భర్తతో చర్చించింది. ఇక్కడికి వచ్చేముందు మీ మాటలు విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధ పడింది లావణ్య.
”లావణ్యా నీవైనా మన భవిష్యత్తు కోసమే కదా ఆలోచించావు. ఏది జరిగినా మన మంచికే అన్నాడు” కమలేష్‌.
”మనం ఊరు వదిలి వచ్చాక తిరిగి వెనక్కి వెళ్ళడం జరగని పని. ఇక్కడ ఉండడం సాధ్యమయ్యే పనిలాగా అనిపించడంలేదు. ప్రతి విషయంలో వీళ్ళతో పాట్లు పడలేను. కానీ ఉన్నంతలో పిల్లలను చదివించాలి. గొప్పవాళ్ళను చేయాలనే లక్ష్యం తప్ప నాదగ్గర ఏమీలేదు. సంవత్సరం మధ్యలో పిల్లలను స్కూలు మాన్పించలేం. ఇంకా నాలుగు నెలలు అవుతే ఎండాకాలం సెలవులు వస్తాయి. అప్పుడు ఎక్కడికైనా వెల్దామంటారా? ఇదే ఊళ్ళో మరో చోట కిరాయికి ఇల్లు తీసుకుని ఉందామంటారా? ఏంచేద్దామండీ” అన్నది లావణ్య.
”ఉమ్మడి కుటుంబం కదా. ఆస్తి అందరిది కాబట్టి అందరం సమాన హక్కుదారులమే అని అందరూ నా వాళ్ళే అనుకున్నాను. ప్రేమతో మనకు ఉపకారం చేద్దామని ఇంతదూరం రమ్మని పిలిచారనుకున్నా. కానీ జీతం భత్యం లేని పనివాళ్ళుగా ఉంటామనుకుని మనల్ని ఇక్కడికి రప్పించారని ఇక్కడికి వచ్చాక గానీ అర్థం కాలేదు” అన్నది లావణ్య.
”నేను ముందుగానే చెప్పాను కదనే వాళ్ళతో నెగలలేమని. నీవే వినిపించుకోలేదు”’
ఇప్పుడు బాగా బుద్ది వచ్చిందండీ. ఇక్కడ పక్కింటి వాళ్ళు కబ్జా పెట్టిండ్రని పిలిచారు కానీ, మనవాళ్ళే మనందరి జాగాను ఆక్రమించారని అర్థం అయింది. ఎలాగూ ఊరొదిలి వచ్చినం. మళ్ళీ తిరిగి వెళ్ళలేం. ఏదైనా ఆలోచిద్దాం అనుకున్నారిద్దరు.
నాలుగు నెలలు గడిచాయి. ఎండాకాలం సెలవులు వచ్చాయి. పిల్లలిద్దరినీ లావణ్య అమ్మానాన్నల దగ్గరకు పంపించింది.
పట్నంలో ఇద్దరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కిరాయికి ఇల్లు వెతుక్కుని తరువాత సంవత్సరం మకాం హైదరాబాద్‌ నగరానికి మార్చారు.
పిల్లలను మంచి స్కూలులో వేశారు. ఉన్నంతలో పిల్లలను చక్కగా చదివించుకుంటూ గుట్టుగా బతుకుతున్నారు.
కాలచక్రం గిర్రున తిరిగింది. బయట ప్రపంచంలో బతకడం వాళ్ళకు అలవాటైపోయింది.

– జయంతి వాసరచెట్ల, 9985525355

Spread the love