ఏప్రిల్‌ 15 వరకే.. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుకు అవకాశం

Created with GIMP

నవతెలంగాణ హైదరాబాద్:  భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్‌ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌ దురుశెట్టి అన్నారు. అత్యవసర సర్వీస్‌ శాఖ నోడల్‌ అధికారులతో పోస్టల్‌ బ్యాలెట్‌పై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్‌ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అత్యవసర సర్వీస్‌ శాఖలకు సంబంధించిన శాఖకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి ఒక నోడల్‌ అధికారిని నియమించుకొని సంబంధిత వివరాలను అందజేయాలని కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వారందరూ ఫారం-12డి పూర్తిగా నింపి దానితో పాటు ఓటరు గుర్తింపు కార్డు జత చేస్తూ సంబంధిత హెడ్‌ రిటర్నింగ్‌ అధికారి వద్ద ఈ ఏప్రిల్‌ 15 తేదీలోగా అందజేయాలని కోరారు.
పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేసిన వారికి ఓటు హకు వినియోగించుకునేందుకు మే 3 నుంచి 8 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ వేస్తానని రిటర్నింగ్‌ అధికారికి వద్దకు వస్తే సంబంధిత హెడ్‌ను బాధ్యుడిని చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అత్యవసర సేవల ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో కంటోన్మెంట్‌ జాయింట్‌ సీఈఓ ఆకాశ్‌, డీఅర్‌ఓ వెంకట చారి, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి డిప్యూటీ కలెక్టర్‌ అర్చన, అడిషనల్‌ కమిషనర్‌ (ఎలక్షన్‌) మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

Spread the love