విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ మృతి?

మాస్కో : వాగర్‌ గ్రూపు వ్యవస్థాపకుడైన ఎవ్‌ జెనీ ప్రిగోజిన్‌ ప్రయాణికుడిగా నమోదైన ఒక ప్రయివేటు విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ పయనిస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ చనిపోయారు. ఈ విమానం ట్వేర్‌ ప్రాంతంలో నేల కూలిందని, అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బంది చనిపోయారని, ప్రమాదం జరిగిన సమయంలో విమానం మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స బర్గ్‌ పయనిస్తోందని రష్యన్‌ అత్యవసర మంత్రిత్వ శాఖ నిర్దారించింది.
ప్రిగోజిన్‌తోపాటు మాజీ రష్యన్‌ స్పెషల్‌ ఫోర్సెస్‌ ఆపరేటర్‌ డిమిట్రీ ఉట్కిన్‌, వాగర్‌ ఉప అధినేతగా అమెరికా పేర్కొన్న వాలెరీ చెకలోవ్‌ ఉన్నారని రోజా వియాత్సియా అంటోంది. వీరే కాకుండా చనిపోయి న వారిలో సెర్గీ ప్రోపుస్టిన్‌, ఎవజెనీ మకార్యాన్‌, అలెగ్జాండర్‌ టోట్మిన్‌, నికొలారు మాత్యుసీవ్‌ వంటి వాగర్‌ సైనికాధికారులు ఉన్నారు.
క్యాటరింగ్‌ పరిశ్రమను విజయవంతంగా నడుపుతూ వ్లాడీమీర్‌ పుతిన్‌ కు చేరువైన ప్రిగోజిన్‌ వాగర్‌ గ్రూపు అనే ప్రయివేటు మిలిటరీ కంపెనీని 2014లో స్థాపించాడు. ఈ గ్రూపు ఉక్రెయిన్‌ యుద్ధంలో ముఖ్యంగా బాక్మత్‌ పోరాటంలో క్రియాశీలంగా పనిచేసింది. ఈ గ్రూపు2018లో సిరియాలో అమెరికా సైన్యంతో తలపడటమే కాకుండా అనేక ఆఫ్రికా దేశాలలోను తన కార్యకలాపాలను నిర్వహించింది.
జూన్‌లో రష్యా సైన్యం వాగర్‌ ఫీల్డ్‌ క్యాంపుపైన ఫిరంగులతో దాడి చేశాయని, రష్యా సైన్యంలో అవినీతికి పాల్పడే అధికారులను తొలగించటానికి తాను రాజధాని మాస్కోపైన దండెత్తబోతున్నానని ప్రిగోజిన్‌ ప్రకటించాడు. ఈ తిరుగుబాటును పుతిన్‌ రష్యాకు ‘వెన్నుపోటు’గా అభివర్ణించాడు. అయితే బైలోరష్యన్‌ అధ్యక్షుడు, అలుగ్జాండర్‌ లుకషెంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటును విరమించి ప్రిగోజిన్‌ తన దళాలను బైలోరష్యాకు తరలించాడు.

Spread the love