‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం’ ఇది 2014 సాధారణ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ దేశ యువతకు చేసిన వాగ్దానం. గత పదేండ్లుగా ఆయనే కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్నాడు. ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలెక్కడీ అని యువత ప్రశ్నిస్తే, పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగం లాంటిదేనని, దేశ యువతను అవమానించేలా మాట్లాడాడు. కనీసం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి, నిరుద్యోగ యువతను నడిబజారులో నిలబెట్టాడు. దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ప్రభుత్వ అతిపెద్ద కర్తవ్యంగా ఉంటుందని చెప్పిన ప్రధాని చేసిందేమిటి? మేకిన్ ఇండియా (భారతదేశంలో తయారు చేయడం), స్కిల్ ఇండియా (భారత దేశంలో నైపుణ్యాన్ని సంతరించుకోవడం), స్టార్ట్ అప్ ఇండియా (భారతదేశంలో పరిశ్రమలు మొదలుపెట్టడం) వీటి ద్వారా భారతదేశాన్ని వెన్నాడుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించి దేశ ఆర్థిక వ్యవస్థ సుభిక్షం చేస్తానని ప్రగల్భాలు పలికాడు. విదేశీ పెట్టుబడులు, ఉద్యోగాలు తెచ్చిపెడతాయని అశలు కల్పిం చాడు. మరీ ఆ వాగ్దానం ఏమైంది? గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు ఆయన ఉపాధి కల్పన గురించి మాట్లాడటం లేదు. ఉద్యోగాల్ని యువతే అందిపుచ్చుకోలేదని కొత్త నాటకానికి తెరదీశాడు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్ని అటకెక్కాయి. ఇప్పుడు మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ఎన్నికల్లో గెలిచేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నాడు.
పదేండ్ల బీజేపీ పాలనలో అంతా నయవంచన, మోసపూరిత నినాదాలు, ప్రచార ఆర్బాటాలే తప్ప యువతకు జరిగిన ప్రయోజనం ఇసుమంత కూడా లేదు. కార్పోరేట్ అనుకూల, నిరుద్యోగ వ్యతిరేక విధానాల మూలంగా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది చదువుకున్నవారు రోడ్డున పడ్డారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ నిరుద్యోగం పెరిగిపోయిందని అనేక సంస్థల సర్వే రిపోర్టులు పేర్కొన్నాయి. మోడీ ఈ పదేండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? అన్న విషయంలో స్పష్టత లేదు. అసలు ఉద్యోగ నియామకాల సమాచారం కూడా వెల్లడించిన పరిస్థితి లేదు. ఇదే విషయంపై పార్లమెంటులో ప్రధానిని ప్రతిపక్షాలు నిలదీస్తే, సుమారు 7,22,311 ఉద్యోగాలు మాత్రమే వివిధ శాఖల్లో భర్తీ చేసినట్లు స్వయానా కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. మరి యువతకు కల్పిస్తామన్న ఉద్యోగాల సంగతేందంటే? అంతా హుష్‌కాకి! అదో ఎన్నికల జుమ్లాగా బీజేపీ నాయకులు మాట్లాడు తున్నారు. శతకోటీశ్వరులకు రూ. లక్షల కోట్లు రాయితీలు ప్రకటించడం మీదున్న ధ్యాస, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ఏమాత్రం పట్టింపు లేదు. మాట మాట్లాడితే యువతే దేశానికి వెన్నెముక అని చెబుతూ వారినే వెన్నుపోటు పొడిచే చర్యల్ని బీజేపీ శరవేగంగా అమలు చేసింది. త్రివిధ దళాల్లో ఆర్మీ ఉద్యోగ నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికను కాకుండా, నాలుగేం డ్ల కాలపరిమితి ఆధారంగా కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టడంతో యువకులంతా పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. యువత ఆగ్రహావేశాల్ని చల్లార్చేందుకు చర్యలు తీసుకోని మోడీసర్కార్ వారిని ఎక్కడిక్కడే అరెస్టులు చేయించింది.
కొన్ని ఉదాహరణలు చూస్తే దేశంలో నిరుద్యోగం ఎంత తాండవిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 60 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రైల్వేలో లక్ష ఉద్యోగాలు ఖాళీలున్నాయని ప్రకటిస్తే రెండు కోట్ల దరఖాస్తులు వచ్చాయి. 2015లో 368 ఖాళీల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్యూన్ ఉద్యోగాల కోసం ప్రకటన ఇస్తే 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 16 వేల పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తే సుమారు 50 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలో కోర్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను గాను 18వేల దరఖాస్తులు వచ్చాయి. రాజస్థాన్‌లో 18 పోస్టులకు 12వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నది బీజేపీ డబులింజన్ సర్కార్లేనన్న సంగతి మరవకూడదు. దేశాన్ని కోవిడ్-19 ఎంత విచ్ఛిన్నం చేసిందో తెలిసిందే. సరైన సమయంలో అదుపుచేయలేక కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు చాలా అవస్తలు పడ్డారు. వలసకార్మికుల జీవనం మరీ దారుణం. చిన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. ప్రజల కొనుగోలు శక్తి మందగించింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ధరల నియంత్రణకు కూడా చొరవ తీసుకోలేదు. ఇది కూడా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపింది.
దేశంలో ఉద్యోగాలున్న వారి సంఖ్య 2013లో 44 కోట్లు ఉంటే 2016 నాటికి అది 41 కోట్లకు తగ్గి పోయింది 2017 నాటికి 40 కోట్లకు తగ్గగా 2021 నాటికి మరింతగా 38 కోట్లకు పడిపోయింది ఇదే సమయంలో పనిచేయగలిగిన వారి సంఖ్య 79 కోట్ల నుంచి 106 కోట్లకు పెరిగిపోయిందని అనేకమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సమీక్షా కేంద్రం (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) విడుదల చేసిన తాజా నివేదికలో ప్రధానంగా 20నుంచి 34 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో ఏడాదికేడాదికి నిరుద్యోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని మధ్య వయస్కుల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది. యువతకు నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా దొరకడం లేదు. గ్రామాల్లో ఏదైనా పనిచేద్దామన్నా కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే చర్యలు చేపట్టింది. ఈ పథకానికి సంబంధించి నిధుల్లో కోతలు విధిస్తూనే ఉంది.
గతేడాది 20-24 ఏండ్ల యువతలో (2023) జులై-సెప్టెంబర్ మధ్య 43.65శాతం నిరుద్యోగం ఉండగా, అక్టోబర్ -డిసెంబర్ నాటికి 44.49శాతానికి పెరిగింది. 25-29 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో నిరుద్యో గం ఇదే కాలంలో 13.35శాతం నుంచి 14.33 శాతానికి పెరిగింది. 25-29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో నమోదైన నిరుద్యోగం అత్యధికం కావడం గమనార్హం. 30-34 సంవత్సరాల మధ్య వయస్కుష లలో నిరుద్యోగ రేటు కూడా 2.06శాతం నుంచి 2.49 శాతానికి పెరిగింది. పట్టణ నిరుద్యోగంతో పోలిస్తే, గ్రామీణ ప్రాం తాలలో నిరుద్యోగమే అధికంగా ఉన్నదని సిఎంఐఇ తెలిపింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 20-24 ఏండ్ల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి (43.79శాతం) చేరింది. 25-29 సంవత్సరాల మధ్య వయ సున్న వారిలో 13.06శాతం, 30-34 ఏండ్ల మధ్య వయస్కు లలో 2.24శాతంగా నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నవి.
తమ న్యాయమైన, రాజ్యాంగబద్ధ హక్కులైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి నేడు యువత మాట్లాడుతుంటే భావోద్వేగాలు, మతవిద్వేషాలు రెచ్చగొట్టి, సమస్యల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాలు మోడీ సర్కార్ చేస్తున్నది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అంటూ దేశ ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దే విధానాలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ భాష వస్తేనే, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెగేసి చెప్పింది.
ఇదే కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాదిమంది యువ తకు విద్యా, ఉపాధి అవకాశాలు కోల్పోయినట్టే! ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు అనేక అంశాల్లో నిరుద్యోగ యువతతో మోడీ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడమొక్కటే కాదు, నిరుద్యోగ జీవితాలతో పదేండ్లుగా చెలగాటమాడుతున్న బీజేపీని ఓడించాలి. ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడే పార్టీకి గెలిపించాలి. ఇది ప్రజల బాధ్యతే కాదు, యువత ప్రథమ కర్తవ్యంగా ఉండాలి.
కోట రమేశ్
9618339490