ప్రయివేటీకరణ..కేంద్రీకరణ…కాషాయీకరణ

Privatization..centralization...saffronization2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర పాలకులు విద్యపై పెట్టుబడి అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుందని విద్యారంగానికి జీడీపీలో కొఠారి కమిషన్‌ సూచించిన విధంగా ఆరు శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దశాబ్దకాలంలో 2014 నుండి 2024 మధ్య సరాసరిన జీడీపీలో 0.44 శాతం నిధులు మాత్రమే ప్రతి ఏడాది కేటాయించడం జరిగింది.కానీ ఇదేకాలంలో కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల రుణాలను రద్దు చేశారు.కార్పొరేట్‌ పన్నుల మినహాయింపులను విద్యపై ఖర్చుతో పోల్చినట్లయితే ఈ నూతన సంస్కరణల యుగంలో పాలకుల ప్రాధాన్యత దేనికో అర్థమవుతుంది.ఈ పాలకులు కార్పొరేట్ల పట్ల చాలా పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారు. అదే పేదల చదువుల విషయంలో సబ్సిడీలను అభివృద్ధి నిరోధకాలు అని ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కడుతున్న పన్నులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అంటే అవి కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్తున్నాయి.. ఎవరికి సబ్సిడీలివ్వాలి అంటే ప్రస్తుత పాలకులు కార్పొరేట్లను సబ్సిడీలివ్వడానికి ఎన్నుకున్నారు. ఈ కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీల వలన దేశానికి ఈ కాలంలో ఉద్యోగాల సంఖ్య ఏమైనా పెరిగిందా అంటే పెరగలేదని సమాధానం వస్తుంది.
కార్పొరేట్లకిచ్చే సబ్సిడీలు ఉద్యోగాలను పెంచుతాయని ప్రభుత్వం సమర్ధించుకుంటుంది కానీ వాస్తవంలో పెట్టుబడి నిర్ణయాలు అనేవి భవిష్యత్తు డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. డిమాండ్‌ను పెంచకుండా కార్పొరేట్‌ సబ్సిడీలను ఇవ్వడం ద్వారా పెట్టుబడులు ఎలా పెరుగుతాయి. ఒకవేళ పెట్టుబడుల ద్వారా డిమాండ్‌ పెరిగితే ఉద్యోగుల సంఖ్య పెరగాలి కానీ 2012లో 2.1శాతంగా ఉన్న నిరుద్యోగిత స్థాయి 2024 నాటికి 6.6 శాతానికి ఎందుకు పెరిగింది. నైపుణ్యాలు లేకపోవడం అనే ప్రభుత్వ వాదన తీసుకున్న నైపుణ్యా లు పెంచడానికి కార్పొరేట్లకు సబ్సిడీలివ్వడం కన్నా విద్యపై అధికంగా ఖర్చు పెట్టడం ఒకటే మార్గం కదా?ఒక్క కార్పొరేట్‌ టాక్స్‌ మినహాయింపులను తొలగిస్తేనే ప్రస్తుతం విద్యపై పెడుతున్న ఖర్చు కన్నా పది రెట్లు ఖర్చును పెంచవచ్చు. కానీ పాలకులు కార్పొరేట్ల వైపే నిలబడ్డారు.
నూతన జాతీయ విద్యా విధానం-2020
నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేది పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య కోర్సులను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను కులవృత్తుల వైపు ప్రోత్సహించే లాగా పాతకాలపు కుల వ్యవస్థను పునర్‌ నిర్మించడానికి భూమిక ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఉన్నత విద్యలో సైతం ఏ దశలోనైనా సర్టిఫికేషన్‌ను గ్యారెంటీ చేయడం ద్వారా వారిని చదువుల నుండి మానివేసేలాగా ప్రోత్సహి స్తుంది. దీని ప్రభావం పేదవర్గాలపై ప్రతికూలంగా ఉంటుంది.ఈ విధానంలో పదేపదే స్వచ్ఛంద సంస్థల సహకారంతో పూర్వ ప్రాథమిక విద్య నిర్వహించాలి అని వల్లించడం చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వసైద్ధాంతిక నేపథ్యం ఉన్న సంస్థల చేతుల్లోకి వీటిని అప్పగించే ఆలోచన ఏమైనా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్ర పెత్తనం కిందకి తీసుకుపోయేలాగానిబంధనలను రూపొందించారు. అందువలన మొత్తంగా ఈ విద్యా విధానం భారతదేశాన్ని తిరోగమనడంలో నడిపిస్తుంది.
పాఠశాలల మూసివేత..అభ్యసనాస్థాయి
దేశవ్యాప్తంగా తక్కువ నమోదు పేరుతో లక్షల సంఖ్యలో పాఠశాలలను ఈ దశాబ్దకాలంలో మూసివేశారు.యు డైస్‌ లెక్కల ప్రకారం 2014లో 15,18,160 పాఠశాలలు ఉంటే 2022 లెక్కల ప్రకారం 14,08,115 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి అంటే 1,10,045 పాఠశాలలను ఈ దశాబ్దకాలంలో మూసేశారు.ఈ పాఠశాలల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలు, గిరిజన ప్రాంతాల్లో పిల్లల పరిస్థితి ఏమిటి. దేశంలో ప్రస్తుతం ప్రతి ఏడు పాఠశాలల్లో ఒక పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్నాయి అంటేనే ఆయా పాఠశాలల్లో అందుతున్న విద్య నాణ్యత ఏమిటో మనకు అర్థమవుతుంది.
అవగాహనతో కూడిన కనీస అభ్యసన, సంఖ్యాత్మక జ్ఞానం 2025 నాటికి సాధించడం లక్ష్యంగా ప్రకటించింది.కానీ 2022 అసర్‌ నివేదిక ప్రకారం మూడో తరగతి విద్యార్థులలో 25 శాతం మంది మాత్రమే సంబంధిత తరగతి పఠనా సామర్ధ్యాలను కలిగి ఉన్నారని 20 శాతం మంది మాత్రమే ఆ తరగతికి చెందిన గణిత సామర్థ్యం కలిగి ఉన్నారని తెలియజేస్తుంది.ఈ నివేదిక దేశంలోనే భవిష్యత్‌ తరాలకు అందిస్తున్న విద్యా నాణ్యతలో డొల్లతనాన్ని బట్టబయలు చేస్తుంది. పాఠశాలల్లో తగినంత ఉపాధ్యాయులను నియమించకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలతో ఈ కనీస అభ్యసన సామర్ధ్యాలను ఎలా పెంచగలం. డిసెంబర్‌ 31,2022 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఖాళీలన్నిటిని భర్తీ చేయడానికి కావలసిన నిధులను కేటాయించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద వర్గాల విద్యా నాణ్యతను పెంచుతాము అనే మాటలతో ఉపయోగం ఏముంటుంది.
2017 నుంచి పాఠశాల పాఠ్య పుస్తకాలను ఎన్సీఈఆర్టీ మార్పు చేపట్టింది. 2022 నాటికి ఇది తీవ్రస్థాయికి చేరింది. మొగలుల యుగం, సామాజిక ఉద్యమాలు, కులవ్యవస్థ, ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధం, గాంధీహత్య, డార్విన్‌ జీవ పరిణామ సిద్ధాంతం, ప్రజాస్వామ్యం పాఠాలను తొలగించారు. ఈ తొలగించిన పాఠ్యాంశాలను గమనించిన వారికి ఎవరికైనా ప్రస్తుత పాలకుల సైద్ధాంతిక నేపథ్యానికి విరుద్ధంగా ఉన్న అంశాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారనేది స్పష్టం అవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పాఠ్యపుస్తకాలలో ఆ శాస్త్రీయ అంశాలను చేర్చుతున్నారు. భవిష్యత్‌ తరాలైన చిన్నారి మెదళ్లకు వాస్తవ చరిత్ర తెలియనీయకుండా విభజనను ప్రోత్సహించేలాగా సిలబస్‌ మార్పులు చేయడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం.
ఉన్నత విద్యా బడ్జెట్‌ కేటాయింపులు
ఏ దేశమైనా విశ్వవిద్యాలయాలలో పెట్టుబడులు పెట్టకుండా అభివృద్ధి సాధించడం అసాధ్యం. పెట్టుబడిదారీ దేశాలైన అమెరికా ఇంగ్లాండ్‌ వంటి దేశాలు కూడా చాలా ఏండ్లపాటు ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాయి.అమెరికా1960 నుండి జీడీపీలో ఐదు శాతం పైన విద్యకు కేటాయింపులు చేస్తుంది. ఉన్నత విద్యలో ఒక శాతం తగ్గకుండా ఖర్చు చేస్తుంది. కానీ మన దేశంలో ఉన్నత విద్యపై ఖర్చు యునెస్కో నివేదిక ప్రకారం సెనెగల్‌, ఇథియోపియా, ఘనాదేశాలకన్నా తక్కువ ఉంది.2024 మధ్యంతరం బడ్జెట్లో యూజీసీ నిధులను 61శాతానికి పైగా తగ్గించారు. ఉన్నతి విద్య నగదు ఏజెన్సీ (హెచ్‌ఇఎఫ్‌ఏ) 2017లో ప్రారంభించి విశ్వవిద్యా లయాలకు నిధుల కేటాయింపు పద్ధతిని గ్రాంట్స్‌ నుండి లోన్స్‌కి మార్చారు. దీంతో యు.జి.సిలో (గ్రాంట్స్‌)కి ప్రాధాన్యత లేకుండా పోయింది.దీనితో ఉన్నత విద్యా సంస్థలు మౌలిక సదుపాయాల కొరకు హెచ్‌ఇఎఫ్‌ఏ నుండి పదేండ్లలో తిరిగి చెల్లించే లోన్లపై ఆధారపడివలసి వస్తుంది. ఈ లోన్లు తిరిగి చెల్లించడం విశ్వవిద్యా లలకు భారంగా మారింది. దీంతో ఈ భారాలను విద్యార్థులపై ఫీజుల పెంపు మరి ఇతర మార్గాల ద్వారా వేయవలసి వస్తుంది. ఇది పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుంది.విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం అవలంబి స్తున్న ప్రయివేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అనేక రూపాలలో చేస్తున్న పోరాటాలు విజయవంతం అయితేనే ఈ విధానాలను నిలువరించగలము.
జి. వెంకటేశ్వరరావు 9966135289

Spread the love