ఆధార్‌ వెరిఫికేషన్‌లో సమస్యలు

– నిలిచిన రిజిస్ట్రేషన్లు..రూ.100 కోట్లు నష్టం ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆధార్‌ కార్డు వెరిఫికేషన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టింది. సర్వర్‌ డౌన్‌ కావడమే ఇందుకు కారణమని తెలిసింది. దీంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు స్థంబించాయి. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ. 100 కోట్లు కోల్పోయిందనే ప్రచారం జరిగింది. అయితే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించడానికి నిరాకరించారు. ముఖ్యంగా దస్తావేజులు స్కానింగ్‌ చేయడం, ప్రతి డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు సబ్‌రిజిస్ట్రార్లు బయోమెట్రిక్‌ ద్వారా లాగిన్‌ కావాల్సి ఉండగా, అది కూడా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అలాగే రిజిస్ట్రేసన్‌ అయిన తర్వాత డాక్యుమెంట్లు స్కానింగ్‌ చేయడానికి అవకాశం లేదని అధికారులు చెప్పారు. ఇలా రకరకాలుగా తలెత్తిన సాంకేతిక కారణాల మూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140కిపైగా సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగలేదని అధికారులు అంగీకరించారు. ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి శ్రీనివాసులు వివరణ కోరగా ఆధార్‌ వెరిఫికేషన్‌లో తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల మూలంగానే రిజస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆగాయని చెప్పారు. మధ్యాహ్నాం మూడున్నర గంటలకే సాంకేతిక సమస్య కొలిక్కివచ్చిందనీ, ఆతర్వాత రిజిస్ట్రేషన్లు సాఫీగా నడిచాయని చెప్పారు. స్లాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖలో ఎలాంటి సమస్యలూ లేవని వివరించారు. ఆగిపోయిన డాక్యుమెంట్లను మరుసటి రోజు స్కానింగ్‌ చేస్తారని చెప్పారు.

Spread the love