సరైన సూచిక బోర్డు లేక ప్రమాదాలు

– అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
– పర్వేద గ్రామస్తుల డిమాండ్‌
నవతెలంగాణ-శంకర్పల్లి
పర్వేద గేటు వద్ద సరైన సూచిక బోర్డు లేనందు వల్లనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని పర్వేద గ్రామ వార్డు సభ్యులు రవీందర్‌ అన్నారు. ఆదివారం ఆయన శంకరపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్‌ అండ్‌బి అధికారుల నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని పర్వేద గ్రామ గేట్‌ దగ్గర అర్ధరాత్రి కారు బీభత్సం సష్టించి ఆ కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లిందని తెలిపారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. కారులో ఉన్న ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. ఆ సమయంలో వర్షాలు పడడంతో పర్వేద గ్రామ మూలమలుపు వద్ద స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం, సరైన సూచిక బోర్డులు లేకపోవడం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి కారు వేగంగా చొచ్చుకు పోవడం, అదష్టవశాత్తు రాత్రి ఇంట్లో ఎవరు లేకపోవడం వలన ప్రాణ నష్టం జరగలేదని అయన పేర్కొన్నారు. కోట్లు పెట్టి రోడ్లు వేస్తున్నారు కానీ స్పీడ్‌ బేకర్స్‌ క్రాసింగ్‌ పెంట్‌ సైడ్‌ బ్యాలెన్స్‌లు సరిగ్గా అమర్చ లేకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరిగాయని అన్నారు . కొన్ని సార్లు ప్రాణాలు పోయినా సందర్భాలు ఉన్నాయని తెలిపారు. రోడ్డు వేసి కాంట్రాక్టర్‌ చేతులు దులుపుకుంటున్నారు, పర్యావేక్షించాల్సిన ఆర్‌ అండ్‌ బి అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరం అన్నారు. ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ప్రయాణం సాగించాలంటేనే ప్రజలు భయపడుతున్నారని అయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మూల మలుపుల వద్ద సరైన సూచిక బోర్డులు అలాగే అవసరమైన చోట స్పీడు బేకర్లు వేయాల్సిందిగా పర్వేద వార్డు మెంబెర్‌ రవి, ఆ రోడ్డున ప్రయాణం కొనసాగించే వాహనాదారులు కోరుతున్నారు.

Spread the love