జేటీసీపై దాడికి నిరసన

జేటీసీపై దాడికి నిరసన– రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో నిలిచిన సేవలు
– మద్దతు పలికిన ఉద్యోగ సంఘాల నాయకులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌(జేటీసీ) రమేష్‌పై దాడిని నిరసిస్తూ.. శుక్రవారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారులు, సిబ్బంది పెన్‌డౌన్‌కు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ నిరసనకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. నిందితుడు ఆటో యూనియన్‌ నాయకుడు మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేశారు. రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నిరసనలో గ్రేటర్‌ పరిధిలోని జేటీసీలు, డీటీసీలు, ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వీరికి మద్దతుగా టీఎన్జీవోస్‌ సెంట్రల్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ముజీబ్‌తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది పెన్‌డౌన్‌తో అప్పటికే ఆర్టీఏ స్లాట్‌ బుక్‌ చేసుకుని కార్యాలయాలకు వచ్చిన వినియోగదారులు రెండు గంటల పాటు ఇబ్బందులు పడ్డారు. దాంతో రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ ఆర్టీఏ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. కమిషనర్‌తో చర్చల అనంతరం అధికారులు, ఉద్యోగులు పెన్‌డౌన్‌ ఆలోచనను విరమించుకుని.. రోజంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ ప్రజలకు సేవలందించారు. తమకు రక్షణ కల్పించాలని అధికారులు, ఉద్యోగులు కోరారు. ఇలాంటి వాతావరణంలో ప్రజలకు సేవలు అందించాలేమని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
ఉద్యోగ సంఘాల మద్దతు..
జేటీసీ రమేష్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. చేపట్టిన నిరసనకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love