త్రిబుల్‌ ఆర్‌ రోడ్డుకు నిరసన సెగ

Protest to Triple R Road Sec– అడుగడుగునా రైతుల ఆందోళనలు
– భూమి కోల్పోతే బతుకెట్టా అని ఆవేదన
– రింగ్‌ రోడ్డు విషయంలో ముందుకు వెళ్లడం ఎలా?
– అధికారుల సమాలోచనలు
నవతెలంగాణ- గజ్వేల్‌
త్రిబుల్‌ఆర్‌ రోడ్డుకు భూములు ఇవ్వలేమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన పలువురు రైతులు.. మళ్లీ ఈ రోడ్డు కోసం ఉన్న కొద్దిపాటి భూములు పోతే బతికేదెట్టా అని ఆవేదన చెందుతున్నారు. మరోచోట నుంచి రోడ్డును మళ్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఆయా మండలాల రైతులు అడుగడుగునా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గజ్వేల్‌ పట్టణంలో రైతులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. తమ భూములను ఇవ్వలేమని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. దీంతో త్రిబుల్‌ ఆర్‌ రోడ్డు విషయంలో ముందుకు వెళ్లడం ఎలా అని సంబంధిత శాఖల అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రైతుల నిరసనలతో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల రైతులు మంత్రులను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
”కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులు, కాలువల కోసం భూములు ఇచ్చాం.. ఇప్పుడు మళ్లీ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ కోసం భూమి ఇచ్చి మేము బతికేదెలా?” అని కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వ భూములు, శిఖం భూములు ఉన్నచోట నుంచి రింగ్‌ రోడ్డు వేయాలని, అలైన్‌మెంట్‌ మార్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. భూమి కోల్పోతున్న చాలా మంది రైతులు ఇప్పటికే ప్రాజెక్టుల నిర్వాసితులు కావటంతో.. మరోమారు భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని తమ భూములను మినహాయించటమో, మరోచోట భూమి లేదా మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వడమో చేయాలని కోరుతున్నారు.
మంత్రులకు విజ్ఞప్తి
భూ నిర్వాసితులు ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. దీంతో వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం ఇప్పటివరకు 980 ఎకరాల భూ సేకరణ చేసినట్టు సమాచారం. ఉత్తర భాగంగా దాదాపు 158 కిలోమీటర్ల పొడవు రోడ్డు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందుకోసం 4500 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అందోల్‌-జోగిపేట్‌ పరిధిలోకి 8.5 కిలోమీటర్లగాను ఐదు గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. గజ్వేల్‌ పరిధిలో 32 కిలోమీటర్ల రోడ్డుకు 17 గ్రామాల్లో, తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని 28 కిలోమీటర్లకు 14 గ్రామాల్లో, సంగారెడ్డి పరిధిలో దాదాపు పది గ్రామాలు మొత్తంగా 54 గ్రామాల పరిధిలో 4500 ఎకరాల భూమిని సేకరిస్తారు. ఈ ప్రాంతంలోని చాలా భూములను రైతులు మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌తోపాటు, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ రింగు రోడ్డు, రైల్వే లైన్‌ నిర్మాణంలో కోల్పోయారు.

Spread the love