– వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్స్ను అడ్డుకున్న గ్రామస్తులు
– వ్యర్థాలతో పంటలు, చెరువుల్లోని నీరు కలుషితం
– ఆందోళనకారులపై లాఠీచార్జి
– ఆగ్రహంతో పోలీసుల వాహనాలు ధ్వంసం
నవతెలంగాణ- మరికల్
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ వద్దనున్న జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ కెమికల్ వ్యర్థాలను చిత్తనూర్ గ్రామ సమీపంలోని వాగులో పారబోసేందుకు ట్యాంకర్ ద్వారా తరలిస్తుండగా.. ఆ వాహనాలను ఏక్లాస్పూర్, చిత్తనూరు, జిన్నారం, కనుమనూరు గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వారిపై లాఠీచార్జికి దిగారు. దాంతో గ్రామస్తులు కట్టెలు, రాళ్లతో పోలీసుల పైకి తిరగబడ్డారు. వారి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ దాడుల్లో మక్తల్ సీఐ రామ్లాల్తో పాటు గ్రామస్తులకు గాయలయ్యాయి. ఆందోళనకారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చిత్తనూర్ గ్రామానికి సమీపంలోని జూరాల ఆగ్రో ఇథనాల్ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటుచేయకుండా తమ గ్రామాల సమీపంలోని వాగులు, ఖాళీ స్థలాల్లో వేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో తమ పంటలు, చెరువుల్లోని నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును కూడా తాము వ్యతిరేకించామని తెలిపారు. కాగా, చిత్తనూరు సమీపంలో ఫ్యాక్టరీ వ్యర్థాలను డంప్ చేసేందుకు వచ్చిన ట్యాంకర్ను గ్రామస్థులు అడ్డుకొని పరిశ్రమ వ్యర్థాలను గ్రామ సమీపంలోని వాగులో వేయొద్దని కోరారు. అడ్డుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ సునీత ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులు, తహసీల్దార్, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులను చెదరగొట్టేందుకు నారాయణపేట డీఎస్పీ లాఠీచార్జికి అనుమతించారు. ఆగ్రహించిన గ్రామస్థులు.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు. పోలీస్ వెహికల్కు గ్రామస్థులు నిప్పు పెట్టారు. ఈ దాడిలో గాయలపాలయిన మక్తల్ సీఐ రాంలాల్తో పాటు గ్రామస్తులు, పోలీసులను నారాయణపేట, మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. కాగా, ఫ్యాక్టరీ యాజమాన్యానికి పోలీసులు, అధికారులు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వ్యర్థాలు డంప్ చేస్తున్నారని చెబితే తమపై పోలీసులు అన్యాయంగా లాఠీచార్జి చేశారని, మహిళలపై కూడా దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. చిత్తనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.